AP News: సమాధానం చెప్పండి.. ఆ డీఆర్‌వోకు కలెక్టర్ నోటీసులు
ABN, Publish Date - Jan 21 , 2025 | 12:02 PM
Andhrapradesh: అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సమావేశం నిర్వహించారు. అయితే ఓ వైపు సమావేశం జరుగుతుండగా.. డీఆర్‌వో మాత్రం వేరే పనిలో బిజీగా గడిపారు. ఎంతో సీరియస్‌గా సమావేశం జరుగుతుండగా..
అనంతపురం, జనవరి 21: జిల్లా కలెక్టరేట్‌లో జరుగుతున్న ఉన్నతాధికారుల సమావేశంలో డీఆర్‌వో మలోల (DRO Malola) ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడుతూ కెమెరాకు చిక్కడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వెంటనే చర్యలు తీసుకున్నారు. కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడుతున్న డీఆర్ఓ మలోలపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. సమావేశ మందిరంలో ఆన్‌లైన్ రమ్మీ ఎందుకు ఆడాల్సి వచ్చింది.. అనే దానిపై డీఆర్ఓ మలోలను వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చారు. డీఆర్ఓను విచారించాల్సిందిగా జాయింట్ కలెక్టర్‌ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ నివేదిక ఆధారంగా డీఆర్ఓ మలోలపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు.
ఇదీ జరిగింది...
కాగా.. కలెక్టరేట్‌లో సమావేశం జరుగుతున్న సమయంలో డీఆర్‌వో మలోల రమ్మీ ఆడటం తీవ్ర కలకలం రేపింది. అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన రాజీవ్ రంజన్ మిశ్రాకు డీఆర్వో మలోల స్వాగతం పలికారు. ఇదే సమావేశంలో అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్లు వినోద్ కుమార్, చేతన్, ఎస్పీ జగదీష్, అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న పాల్గొన్నారు. అయితే ఓ వైపు సమావేశం జరుగుతుండగా.. డీఆర్‌వో మాత్రం వేరే పనిలో బిజీగా గడిపారు. ఎంతో సీరియస్‌గా సమావేశం జరుగుతుండగా.. దాన్నీ ఏమాత్రం పట్టించుకోకుండా డీఆర్‌వో మలోల ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడుతూ బిజీబిజీగా గడిపారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా, వ్యతిరేకంగా వినతి పత్రాలు ఇచ్చేందుకు పలు సంఘాలు తరలివచ్చాయి.
CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే
అయితే ఇవేవీ కూడా తనకు పట్టనట్లు స్మార్ట్ ఫోన్‌లో రమ్మీ ఆడుతూ తన ప్రపంచంలో మునిగిపోయారు డీఆర్వో మలోల. పక్కనే ఉన్నతాధికారులు ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌లో పేకాట ఆడుతూ జిల్లా రెవెన్యూ అధికారి కాలక్షేపం చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. కార్యాలయంలోనూ డీఆర్వో మలోల పేకాట ఆడటమే పనిగా పెట్టుకున్నారని కలెక్టరేట్ ఉద్యోగులు చెబుతున్నారు. రెవెన్యూ అధికారి అయ్యుండి ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ముఖ్యమైన అంశంపై సమావేశం జరుగుతున్న సమయంలో రెవెన్యూ అధికారిగా ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఇలాగేనా ప్రవర్తించేది అంటూ మండిపడుతున్నారు. ఇలాంటి అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Davos: అట్టహాసంగా ప్రారంభమైన వరల్డ్ ఎకనికమిక్ ఫోరం సదస్సు
Encounter.. కాశ్మీర్: ఉగ్రవాదుల కాల్పుల్లో ఆంధ్రా జవాన్ మృతి
Read Latest AP News And Telugu News
Updated Date - Jan 21 , 2025 | 01:30 PM