ఇద్దరు నేతన్నల బలవన్మరణం
ABN, Publish Date - Apr 26 , 2024 | 04:51 AM
సిరిసిల్లలో వస్త్ర సంక్షోభానికి మరో ఇద్దరు నేత కార్మికులు బలయ్యారు. గురువారం ఒకే రోజు ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మనగర్‌కు చెందిన అడిచెర్ల
సిరిసిల్లలో కలవరపెడుతున్న వస్త్ర సంక్షోభం
సిరిసిల్ల, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్లలో వస్త్ర సంక్షోభానికి మరో ఇద్దరు నేత కార్మికులు బలయ్యారు. గురువారం ఒకే రోజు ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మనగర్‌కు చెందిన అడిచెర్ల సాయి (25) గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయి మరమగ్గాల అనుబంధ పరిశ్రమ వార్ఫిన్ కార్మికుడిగా పనిచేసేవాడు. తల్లి పద్మ బీడీ కార్మికురాలు. తండ్రి కైలాసం పక్షవాతంతో మంచాన పడ్డాడు. మరమగ్గాలు నడవకపోవడం వల్ల వార్ఫర్‌గా భీములు పోసే పనిలేకపోవడంతో ఆవేదనకు గురయ్యాడు. ఆర్థిక ఇబ్బందులతో సాయి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాగా జిల్లాలోని తంగళ్లపల్లి మండలం ఇందిరానగర్‌కు చెందిన పవర్‌లూం నేత కార్మికుడు అంకారపు మల్లేశం (54) నాలుగు నెలలుగా మరమగ్గాల పని లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కుటుంబ పోషణ భారమైంది. దీంతో మనస్తాపం చెందిన మల్లేశం గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సిరిసిల్లలో వస్త్ర సంక్షోభం నేపథ్యంలో ఇదే నెలలో నేత కార్మికుడు సిరిపురం లక్ష్మీనారాయణ (65), మార్చిలో నేత కార్మికుడు తడుక శ్రీనివాస్ (42) ఆత్మహత్య చేసుకున్నారు. బతుకమ్మ చీరల వంటి ప్రభుత్వ ఆర్డర్లు నిలిచిపోవడంతోపాటు స్వయంగా పరిశ్రమను నడుపుకోవడానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు అందకపోవడంతో ఇబ్బందికరంగా మారుతోంది. దీంతో నాలుగు నెలలుగా సిరిసిల్ల మరమగ్గాలపై ఉత్పత్తులు నిలిచిపోయాయి. మరమగ్గాలు మూతపడడంతో నేత కార్మికులు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనారోగ్య పరిస్థితులు తోడవడంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
Updated Date - Apr 26 , 2024 | 04:51 AM