ఇథనాల్ పరిశ్రమను అడ్డుకునేందుకు పోరాడతా..
ABN, Publish Date - Apr 26 , 2024 | 04:59 AM
‘ఇథనాల్ పరిశ్రమను అడ్డుకునేందుకు మీతో కలసి నిలబడతా.. పోరాడుతా..’ అంటూ నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండల ప్రజలకు తెలంగాణ జన సమితి (టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం మద్దతు
దిలావర్‌పూర్ మండల ప్రజలకు కోదండరాం మద్దతు
మార్పు కోసం ఆలోచించి ఓటేయాలన్న టీజేఎస్ చీఫ్
దిలావర్‌పూర్, ఏప్రిల్ 25: ‘ఇథనాల్ పరిశ్రమను అడ్డుకునేందుకు మీతో కలసి నిలబడతా.. పోరాడుతా..’ అంటూ నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండల ప్రజలకు తెలంగాణ జన సమితి (టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం మద్దతు పలికారు. ఇక్కడ నిర్మించ తలపెట్టిన ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా గత కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. గురువారం దిలావర్‌పూర్ మండలంలో కోదండరాం పర్యటించారు. దిలావర్‌పూర్‌కు చెందిన ఉపాధి హామీ కూలీలు, రైతులతో ఆయన మాట్లాడారు. ‘ఇథనాల్ పరిశ్రమ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైతులపై అప్పటి ప్రభుత్వం కేసులు పెట్టడం దారుణం. ఆ కేసులను ఎత్తేయాలని ప్రొఫెసర్ హరగోపాల్, నేను సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కోరాం. ఆయన పోలీస్ ఉన్నతాధికారులను పిలిచి కేసులు ఎత్తివేసే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు’ అని చెప్పారు. నరేంద్ర మోదీ హయాంలో దేశంలో అసమానతలు పెరిగాయన్నారు. పేదల పొట్టగొట్టి.. పెట్టుబడిదారులకు దేశ సంపదను దోచి పెడుతున్నారని ఆరోపించారు. ఉపాధి హామీ పథకానికి కేంద్రం అరకొర నిధులే కేటాయిస్తోందని.. దీంతో కుటుంబంలో ఒకరికి మాత్రమే 100 రోజుల పని దొరుకుతోందన్నారు. మార్పు కోసమే కాంగ్రె్‌సకు మద్దతు పలుకుతున్నట్లు స్పష్టం చేశారు. ‘నేను కాంగ్రెస్ వ్యక్తిని కాను.. టీజేఎ్‌సను స్థాపించి పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కొట్లాడుతున్నా.. కాంగ్రె్‌సకు ఎందుకు మద్దతు ఇస్తున్నానంటే దేశంలో అసమానతలు పోవాలి.. అందరికీ సమన్యాయం జరగాలి.. ఆ మార్పు కాంగ్రెస్ చేస్తుందన్న నమ్మకంతోనే ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నాను.. మార్పు కోసం ఆలోచించి ఓటేయండి’ అని కోదండరాం కోరారు.
Updated Date - Apr 26 , 2024 | 04:59 AM