Hyderabad: టీ-శాట్‌లో ఉన్నత విద్య ప్రసారాలు
ABN, Publish Date - Oct 29 , 2024 | 05:17 AM
ఉన్నత విద్య ప్రసారాలను టీ-శాట్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య వి.బాల కృష్ణారెడ్డి తెలిపారు. తెలంగాణలోని ప్రతి ఇంటికీ నాణ్యమైన విద్యను టీ-శాట్ ద్వారా అందించడం తమ ప్రధాన లక్ష్యమన్నారు.
అదే వెబ్‌సైట్లో పరీక్షల ఫలితాలు
ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు బాల కృష్ణారెడ్డి
హైదరాబాద్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్య ప్రసారాలను టీ-శాట్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య వి.బాల కృష్ణారెడ్డి తెలిపారు. తెలంగాణలోని ప్రతి ఇంటికీ నాణ్యమైన విద్యను టీ-శాట్ ద్వారా అందించడం తమ ప్రధాన లక్ష్యమన్నారు. అంబేడ్కర్ వర్సిటీ ప్రాంగణంలోని టీ-శాట్ కార్యాలయాన్ని ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ఈ.పురుషోత్తం, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్‌తో కలిసి సోమవారం ఆయన సందర్శించారు. టీ-శాట్ పనితీరు.. ప్రాథమిక, ఇంటర్ విద్య, పోటీ పరీక్షలు, ఇతర విభాగాలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో బాల కృష్ణారెడ్డి బృందానికి టీ-శాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి వివరించారు.
భవిష్యత్తులో నాణ్యమైన డిజిటల్ కంటెంట్‌ను ఉన్నత విద్యనభ్యసించే వారికి అందించే విధంగా ఉమ్మడి ప్రణాళికను సిద్థం చేసుకుందామని, ప్రవేశ పరీక్షల ఫలితాలను టీ-శాట్ వెబ్‌సైట్ ద్వారా విడుదల చేయాలని వేణుగోపాల్ రెడ్డి కోరగా.. బాల కృష్ణారెడ్డి సానుకూలంగా స్పందించారు. ఉన్నత విద్యకు సంబంధించి 52 మాడ్యూల్స్ కంటెంట్ అందుబాటులోకి తెచ్చే విధంగా ఏరాట్లు చేస్తున్నామని ఈ సందర్భంగా బాల కృష్ణారెడ్డి పేర్కొన్నారు.
Updated Date - Oct 29 , 2024 | 05:17 AM