సూర్యాపేట జిల్లాలో ఇథనాల్ మంటలు!
ABN, Publish Date - Dec 13 , 2024 | 04:24 AM
సూర్యాపేట జిల్లా మోతె మండలం రావిపహాడ్‌లో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ ఎదుట గురువారం అఖిలపక్షం చేపట్టిన మహాధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకు పెద్దసంఖ్యలో తరలివచ్చిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఫ్యాక్టరీ తాళం పగులగొట్టే ప్రయత్నం చేయడంతో వారికి పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
రావిపహాడ్‌లో ఫ్యాక్టరీ వద్ద స్థానికుల ఆందోళన.. పోలీసులతో ఘర్షణ
మహిళల పట్ల ఏఎస్సై దురుసు ప్రవర్తన
మోతె, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా మోతె మండలం రావిపహాడ్‌లో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ ఎదుట గురువారం అఖిలపక్షం చేపట్టిన మహాధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకు పెద్దసంఖ్యలో తరలివచ్చిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఫ్యాక్టరీ తాళం పగులగొట్టే ప్రయత్నం చేయడంతో వారికి పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో ఏఎస్సై సత్యనారాయణ ఓ మహిళ చేయిపట్టుకుని, అభ్యంతరకరంగా మాట్లాడడంతో ఇతర మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రావిపహాడ్‌లో ఎన్‌ఎంకే బయో ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేపడుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీపై స్థానికులు కొద్దిరోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ యజమానులు ఫ్యాక్టరీ నిర్మాణం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆత్మకూరు(ఎస్), రావిపహడ్, అప్పన్నగూడెం, సర్వారం, శెట్టిగూడెం, ఆవాసతండా, కొత్తగూడెం గ్రామాల నుంచి రైతులు, ప్రజలు పార్టీలకు అతీతంగా తరలివచ్చి మహాధర్నాలో పాల్గొన్నారు.
ప్రజాభిప్రాయం సేకరించకుండా అక్రమ మార్గంలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆరోపించారు. ఇథనాల్ ఫ్యాక్టరీతో చుట్టుపక్కల 10 గ్రామాల పరిధిలోని వ్యవసాయ భూములు దెబ్బతింటాయన్నారు. ఫ్యాక్టరీకి రోజూ 7.50 లక్షల లీటర్ల నీరు అవసరం ఉంటుందని, దీంతో భూగర్బ జలాలు అడుగంటిపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఉదయం 10గంటలకు ఆందోళన ప్రారంభించగా.. మధ్యాహ్నం 12 గంటలైనా నిర్వాహకులు, అధికారులు ఎవరూ రాకపోవడంతో మహిళలు, రైతులు ఫ్యాక్టరీ గేట్ల తాళాలు పగులగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, మోతె ఎస్సై యాదవేందర్ రెడ్డి సిబ్బందితో వచ్చారు. ఫ్యాక్టరీలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన ప్రజలను చెదరగొట్టారు. సుమారు రెండు గంటల పాటు ఉద్రిక్తత కొనసాగింది. పోలీసుల తీరుపై గుమ్మడి నర్సయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నిర్వాహకులు పోలీసుల సమక్షంలో ప్రజలతో చర్చించారు. రెండు, మూడు రోజుల్లో ఫ్యాక్టరీ నిర్వహణ తీరు, ఇతర అంశాలపై అవగాహన కల్పిస్తామని నిర్వాహకులు చెప్పడంతో ప్రజలు ధర్నాను విరమించారు.
Updated Date - Dec 13 , 2024 | 04:24 AM