నిరుపయోగంగా నీటి తొట్లు
ABN, Publish Date - Apr 23 , 2024 | 11:51 PM
పంచాయతీ అధికారుల నిర్లక్షం, ప్రజాప్రతినిధుల అలసత్వంతో పశువులు, మేకల,గొర్లు దాహార్తిని తీర్చేందుకు నిర్మించిన నీటితొట్లు మూలనపడ్డాయి.
నిర్వహణను పట్టించుకోని అధికారులు
దప్పికతో అల్లాడుతున్న పశువులు
కొన్ని గ్రామాల్లో ధ్వంసమైన నీటి తొట్లు
వెంటనే చర్యలు తీసుకోవాలంటున్న రైతులు
యాచారం, ఏప్రిల్ 23 : పంచాయతీ అధికారుల నిర్లక్షం, ప్రజాప్రతినిధుల అలసత్వంతో పశువులు, మేకల,గొర్లు దాహార్తిని తీర్చేందుకు నిర్మించిన నీటితొట్లు మూలనపడ్డాయి. వాటి ల్లో నీరు నింపడం లేదు. కొన్ని తొట్లు కూలిపోయాయి. ఎండ ల్లో పశువుల కోసం నీటితొట్లు కట్టారు. వాటి నిర్వహణపై అధికారులు, పంచాయతీ పాలకవర్గాలు పట్టించుకోవడం లేదు. చెరువుల్లో నీరెండి, తొట్లలో నీరు లభించక మూగ జీవాలు దప్పికతో అలమటిస్తున్నాయి. యాచారం, మేడిపల్లి, కుర్మిద్ద, తాటిపర్తి, నానక్‌నగర్, మేడిపల్లి, తక్కళ్లపల్లి, కొత్తపల్లి నందివనపర్తి, చిన్నతూండ్ల, బాషమోనిగూడ, ధర్మన్నగూడ, మల్కీజ్‌గూడ, తమ్మలోనిగూడ, మంగలిగడ్డతండా, మర్లకుంట తండా, చౌదర్‌పల్లి, కొమ్మోనిబావి, గొల్లగూడ, పిల్లిపల్లి గ్రామాల్లోని నీటితొట్లలో చుక్కనీరు లేదు. నింపే ప్రయత్నాలు చేయడం లేదు. కొన్ని నీటితొట్ల గోడలు కూలాయి. ఒక్కో తొట్టికి రూ.19,958 ఉపాధి హామీ నిధులు వెచ్చించి నిర్మించారు. నీటితొట్లలో పంచాయతీ అధికారులు నీరు నిం పాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. దీంతో రైతులు, పశుపోషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుర్మిద్దలో వాటర్ ట్యాంక్ వద్ద నీటితొట్టిని పూడ్చేశారు. తాటిపర్తిలో రాళ్లు వేసి ధ్వంసం చేశారు. ఎండ కాలంలో నీటికి పశువులు అల్లాడుతున్నాయని, అధికారులు వెంటనే చర్యలు తీసుకొని నీటి తొట్లకు మరమ్మతులు చేయించి నీరు నింపేలా చూడాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ఎంపీడీవో నరేందర్‌రెడ్డిని వివరణ కోరగా వృథాగా ఉన్న నీటితొట్లలో నీరుపెట్టాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలిచ్చాం అన్నారు.
Updated Date - Apr 23 , 2024 | 11:51 PM