ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలకు మహర్దశ

ABN, Publish Date - Jun 24 , 2024 | 12:02 AM

ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం సమకూర్చిపెట్టడంలో రిజిస్ర్టేషన్‌ శాఖ ముందు వరుసలో ఉంటుంది. కానీ.. అలాంటి శాఖకు ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో సొంత భవనాల్లేవు.

చేవెళ్లలో అద్దె భవనంలో కొనసాగుతున్న సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం

త్వరలోనే ఆఫీసులకు సొంత భవనాలు

నూతన బిల్డింగ్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు

రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలపై ప్రభుత్వం స్పెషల్‌ ఫోకస్‌

అధిక ఆదాయాన్నిచ్చే చోట్ల తొలి విడతలోనే నిర్మాణాలు

కార్పొరేట్‌ తరహాలో ఆఫీసులు.. సొంత భవనాల ఆధునికీకరణ

చాలాచోట్ల అరకొర వసతులతో అద్దె భవనల్లో కార్యాలయాలు

ఉమ్మడి జిల్లాలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు మోక్షం కలగనుంది. జిల్లాల్లోని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలకు అధునాతన హంగులతో నూతన భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పనుల కోసం ఆఫీసులకొచ్చే వారికి కేఫ్‌టేరియాలు, వెయిటింగ్‌ లాంజ్‌లు తదితర వసతులతో కార్పొరేట్‌ ఆఫీసుల తరహాలో ఈ బిల్డింగ్‌లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. సర్కారుకు భారీగా ఆదాయం తెచ్చే రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లోని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయ భవనాలను తొలి విడతలో నిర్మించనున్నారు. ఎక్కువ ఆదాయం వచ్చే జిల్లాలకు తక్కువ ఆదాయం వచ్చే జిల్లాల నుంచి సిబ్బందిని సర్దుబాటు చేయనున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయాలకు వెళ్లే ప్రజలకు ఇబ్బందులు తొలగనున్నాయి.

(ఆంధ్రజ్యోతి-రంగారెడ్డి అర్బన్‌, జూన్‌ 23): ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం సమకూర్చిపెట్టడంలో రిజిస్ర్టేషన్‌ శాఖ ముందు వరుసలో ఉంటుంది. కానీ.. అలాంటి శాఖకు ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో సొంత భవనాల్లేవు. అయితే త్వరలో ఆ శాఖ కార్యాలయాలకు మంచి రోజులు రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించాలనీ, అదుకోసం స్థలాలు సేకరించాలని, ఇప్పటికే సొంత భవనాలుంటే వాటినీ కార్పొరేట్‌ స్థాయిలో ఆధునికీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అద్దె భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాల స్థానంలో కార్పొరేట్‌ కార్యాలయాలను తలదన్నే రీతిలో అధునాతన భవనాలను నిర్మించనున్నారు. రాష్ట్రంలో 144 సబ్‌ రిజిస్ర్టార్‌ ఆఫీసులున్నాయి. వీటిలో 38 మాత్రమే సొంత భవనాల్లో కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా రిజిస్ర్టార్‌ పరిధిలో 22 సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలున్నాయి. వాటిల్లో జిల్లా సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయం కూడా అద్దె భవనంలోనే కొనసాగుతోంది. డిస్ట్రిక్ట్‌ సబ్‌ రిజిస్ర్టార్‌ పరిధి 22 కార్యాలయాల్లో రంగారెడ్డి జిల్లాలో 18, వికారాబాద్‌ జిల్లాలో నాలుగు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు ఉన్నాయి. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ సబ్‌ రిజిస్ర్టార్‌ మినహా మిగతా అన్ని చోట్లా కార్యాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతోన్నాయి. ప్రస్తుతం రిజిస్ర్టేషన్లకు వచ్చే వారు కూర్చునేందుకు వీలు లేకుండా ఉండటంతో చెట్ల కింద, నీడ ఉన్న చోట సర్దుకుపోతున్నారు. ఈ కార్యాలయాలు కూడా సీజన్లలో కిక్కిరిస్తున్నాయి. కనీసం అక్కడ కూర్చనే పరిస్థితి కూడా లేదు. రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు గంటల తరబడి కార్యాలయంలో నిలబడే ఉండాల్సి వస్తోంది. ఇకపై ఇలాంటి పరిస్థితి లేకుండా ఉండేందుకు సబ్‌ రిజిస్ర్టార్‌ ఆఫీసులకు నూతన భవనాలను నిర్మించేందుకు తెలంగాణ సర్కార్‌ సంకల్పించింది. భూములు సిద్ధంగా ఉన్నచోట వీలైనంత త్వరగా మోడల్‌ సబ్‌ రిజిస్ర్టార్‌ ఆఫీసులను నిర్మించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. సబ్‌రిజిస్ర్లార్‌ ఆఫీసులకు సరిపడే స్థలాలను అన్వేషిస్తున్నారు. మొదటి దశలో ఆదాయం ఎక్కువగా వస్తున్న రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని సబ్‌ రిజిస్ర్టార్‌ ఆఫీసుల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

జిల్లాలపై స్పెషల్‌ ఫోకస్‌!

రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాపై సర్కార్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. నగరానికి ఆనుకొని ఉండటం, ఎక్కువగా రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలు జరగడం, ఎప్పటికప్పుడు పెద్దపెద్ద వెంచర్లు ఏర్పాటు అవుతుండటంతో సర్కార్‌ ఈ రెండు జిల్లాలపై ప్రత్యేక నజర్‌ పెట్టింది. రంగారెడ్డి జిల్లాలోని 18, మేడ్చల్‌ జిల్లాలో 12 సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలను ఆధునిక హంగులతో నిర్మించేందుకు ప్లాన్‌ చేసింది. స్థల పరిశీలన చేయాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు సైతం ఆదేశాలు అందాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంలో జిల్లాలోని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు ముందంజలో ఉన్నాయి.

అరకొర వసతులతో ఏళ్లుగా అద్దె భవనాల్లో...

నగరానికి కూతవేటు దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లో సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలకు సొంత భవనాల్లేవు. అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. నిత్యం లక్షల్లో ఆదాయం వస్తున్నా కార్యాలయాలకు వచ్చే ప్రజలకు కనీస వసతులు లేక తిప్పలు పడుతున్నారు. కలెక్టరేట్‌, ఔటర్‌ రింగ్‌రోడ్డు, ఫార్మాసిటీ, వంటి ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు అవుతుండటంతో ఇక్కడ భూములకు భారీగా డిమాండ్‌ ఉంది. దీంతో స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లు భారీగా జరుడుతున్నాయి. అద్దె భవనంలో సరైన తాగునీటి వసతి, మూత్రశాలలు లేక కార్యాలయానికి వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పార్కింగ్‌ సౌకర్యం లేక రోడ్లపైనే వాహనాలు నిలుపుతున్నారు.

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో ఇదీ పరిస్థితి

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 12 రిజిస్ర్టేషన్‌ కార్యాలయాలుండగా వాటిల్లో నాలుగు మాత్రమే సొంత భవనాలు కలిగి ఉన్నాయి. మిగిలిన కార్యాలయాలన్నీ అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటికి ప్రతి నెలా నెలా రూ.లక్షల్లో అద్దె చెల్లిస్తున్నారు. అద్దె భవనాల్లో కొనసాగే కార్యాలయాలకు ఇచ్చే క్రయవిక్రయ దారులు, ప్రజలు నిల్చునేందుకు కూడా కొన్ని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో వసతుల్లేవు. ఇబ్బందులు ఎదురవుతున్నా తప్పని పరిస్థితుల్లో ఆ భవనాల్లోనే కార్యాలయాలను కొనసాగిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే స్థలాలు చూసినప్పటికీ భవన నిరర్మాణాలకు అవసరమైన నిధులు లేక ప్రక్రియ నిలిచిపోయింది.

నిర్మాణాలకు నిధులు మంజూరు చేసినా..

చేవెళ్ల సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయం నిర్మించేందుకు కోర్టు పక్కనున్న స్థలాన్ని కేటాయించారు. పదేళ్ల క్రితం రూ.62లక్షలు మంజూరు చేశారు. భవనం నిర్మించేందుకు కాంట్రాక్టర్‌ ముందుకు రాకపోవడంతో నిధులు మళ్లిపోయాయి. కార్యాలయం ప్రస్తుతం అయ్యప్పస్వామి ఆలయం పక్కన అద్దె భవనంలో కొనసాగుతోంది. కనీస సౌకర్యాలు లేవు. క్రయ విక్రయాలు జరిపేందుకు వచ్చిన వారికి తాగునీరు, మరుగుదొడ్ల వంటి సౌకర్యాలు లేవు. ప్రజలు ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు. షాద్‌నగర్‌లోని నాగులపల్లి రోడ్డులో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ భవన నిర్మాణానికి 2019లో ప్రభుత్వం 10గుంటల భూమిని కేటాయించింది. దీనికి అప్పటి హోం మంత్రి మహమూద్‌ అలీ శంకుస్థాపన చేశారు. కానీ నేటి వరకు ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్ట లేదు. ప్రస్తుతం ఈ స్థలం సమీపంలో ఉన్న ఫంక్షన్‌ హాల్‌కు పార్కింగ్‌ స్థలంగా మారింది. రాజేంద్రనగర్‌కు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం 1996లో మంజూరైంది. తాత్కాలికంగా అంటూ అద్దె భవనంలో ఏర్పాటు చేశారు. నేటికీ అద్దె భవనంలోనే కొనసాగుతోంది. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుతున్న సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయానికి సొంత భవనం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. శేరిలింగంపల్లి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయానికి స్థలాన్ని కేటాయించారు. అయితే ఈ స్థలం వివాదంలో ఉంది. ఓ ప్రజాప్రతిఽధి అడ్డుకోవడంతో భవ నిర్మాణానికి నోచుకోవడం లేదు. అలాగే శంకర్‌పల్లి, గండిపేట్‌, ఫరూక్‌నగర్‌, చంపాపేట్‌, పెద్ద అంబర్‌పేట్‌, వనస్థలిపురం, సరూర్‌నగర్‌, శంషాబాద్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, వికారాబాద్‌, పరిగి, తాండూరుల్లో సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. దీంతో ప్రజలు, అధికారులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - Jun 24 , 2024 | 12:48 AM

Advertising
Advertising