త్వరలో మున్సిపాలిటీగా మహేశ్వరం?
ABN, Publish Date - May 17 , 2024 | 12:42 AM
మహేశ్వరం మండల కేంద్రంతో పాటు మండలంలోని సిరగిరిపురం, గంగారం, గంగారం తండా, మన్‌సాన్‌పల్లి, ఉప్పుగడ్డతంగా, కొత్తతండా, కేసీతండా, డీజీతండా, ఎన్డీతండా, కేబీతండా, తుమ్మలూరు, మొహబత్‌నగర్ గ్రామాలను కలుపుకొని మహేశ్వరం కేంద్రంగా నూతన మున్సిపాలిటీ ఏర్పాటు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి.
ప్రత్యేక జీవో ఇప్పించే యత్నంలో అధికార పార్టీ నాయకులు!
పంచాయతీ పిలుపునకు దూరం కానున్న పలు పల్లెలు
మహేశ్వరం, మే 16 : మహేశ్వరం మండల కేంద్రంతో పాటు మండలంలోని సిరగిరిపురం, గంగారం, గంగారం తండా, మన్‌సాన్‌పల్లి, ఉప్పుగడ్డతంగా, కొత్తతండా, కేసీతండా, డీజీతండా, ఎన్డీతండా, కేబీతండా, తుమ్మలూరు, మొహబత్‌నగర్ గ్రామాలను కలుపుకొని మహేశ్వరం కేంద్రంగా నూతన మున్సిపాలిటీ ఏర్పాటు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. మహేశ్వరం మండల కేంద్రంతో పాటు ఇతర గ్రామాలు, తండాలు కలుపుకొని మొత్తం 18 వేలకు పైగా జనాభా ఉంటుంది. వచ్చే జూన్, జూలై మొదటి వారంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు, జూలై, ఆగస్టులో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు, అక్టోబరు తరువాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేస్తోందని సమాచారం. ఈ ఎన్నికల కోడ్ రాకముందే మహేశ్వరాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసే పనిలో కొందరు అధికార పార్టీ నాయకులు బిజీబిజీగా ఉన్నారు. దశాబ్ధాల కాలంగా పంచాయతీలుగా పిలువబడుతున్న పలు పల్లెలు ఆ పిలుపులకు దూరమై మున్సిపాలిటీలో వార్డులుగా మారనున్నాయి. మున్సిపాలిటీ ఏర్పాటవుతుందనే వార్తలు మహేశ్వరం వాసుల్లో తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. దశాబ్దాల కాలంగా గ్రామ పంచాయితీలుగా ఉన్న తుక్కుగూడ, రావిరాల, సర్ధార్‌నగర్, మంఖాల్ గ్రామాలను కలుపుకొని తుక్కుగూడ కేంద్రంగా ఐదేళ్ల క్రితం మున్సిపాలిటీగా తయారైంది. అదే తరహాలోనే ఇప్పుడు మహేశ్వరాన్ని కూడా మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని, అందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమతి కోరాలని కొందరు అధికార పార్టీ నాయకులు మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కేఎల్లార్‌పై ఒత్తిడి తెస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్‌తో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన మహేశ్వరం.. ఇంకా గ్రామ పంచాయితీగానే ఉంటే అభివృద్ధి కుంటుపడుతందని.. కొందరు మున్సిపాలిటీగా ఏర్పడితే సామాన్యప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంటుందని మరి కొందరు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద ప్రతిపాదనలు పెట్టారనే సమాచారం జోరుగా వినిపిస్తోంది. చాలా వరకు మహేశ్వరాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తేనే బాగుంటుందని.. అప్పుడే అభివృద్ధి చెందడంతో పాటు మరుగునపడ్డ మహేశ్వరం అభివృద్ధిలో మరింత పరుగులు పెడుతుందని కాంగ్రెస్ నాయకులు కొందరు వారి అభిప్రాయాలను పార్టీ అధినాయకత్వానికి వినిపించారు. మహేశ్వరాన్ని త్వరలో మున్సిపల్‌గా ఏర్పాటు చేయాలని, అందుకోసం ప్రత్యేక జీవో ఇచ్చే విధంగా అధికారులకు ఆదేశాలివ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించాలని కేఎల్లార్‌పై స్థానిక నేతలు ఒత్తిడి పెంచారు. దాంతో త్వరలో మహేశ్వరం నూతన మున్సిపాలిటీగా రూపుదిద్దుకోనుందనే వార్తలు మహేశ్వరంలో జోరందుకున్నాయి.
Updated Date - May 17 , 2024 | 12:42 AM