ఇన్‌చార్జిలు ఇంకెన్నాళ్లు?
ABN, Publish Date - Jul 15 , 2024 | 12:00 AM
ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వ్యవస్థ కుంటుపడుతోంది.
ఐదు మండలాల్లో ఎంఈవో పోస్టులు ఖాళీ
పట్టించుకోని ఉన్నతాధికారులు.. అస్తవ్యస్తంగా పాఠశాలల నిర్వహణ
చేవెళ్ల, జూలై 14 : ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వ్యవస్థ కుంటుపడుతోంది. చేవెళ్ల నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఎంఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్నేళ్లుగా ఇన్‌చార్జి ఎంఈవోలతో కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో పాఠశాలల పర్యవేక్షణ సరిగ్గా లేక పాఠశాల విద్య గాడితప్పుతోంది. ప్రభుత్వ ఉపాధ్యాయులపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రైవేట్ పాఠశాలల గురించి పట్టించుకునే నాథుడే లేడు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం చెప్పిందే వేదంగా నడుస్తోంది. నిబంధనలను తుంగలో తొక్కి విద్యను వ్యాపారంగా మార్చుకుంటూ తల్లిదండ్రులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఇన్‌చార్జి ఎంఈవోల స్థానంలో రెగ్యులర్ అధికారులను నియమించి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని తల్లిదండ్రులు, మేధావులు కోరుతున్నారు.
నియోజకవర్గంలో ఇలా
చేవెళ్ల నియోజకవర్గంలో 264 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో ప్రాథమిక పాఠశాలలు 170, ప్రాథమికోన్నత 42, ఉన్నత పాఠశాలలు 52 ఉన్నాయి. వీటికి అదనంగా ఐదు మండలాల్లో కేజీబీవీ, ఆదర్శ, బీసీ, ఎస్సీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు కొనసాగుతున్నాయి. వీటల్లో మొత్తం 25వేల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణకు మండలానికో ఎంఈవో అవసరం. అయితే కొన్నేళ్లుగా ఈ పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. ప్రభుత్వం ఎంఈవో పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నిర్వహించడం లేదు. పీజీహెచ్‌ఎంలు, సీనియర్ అధ్యాకుల ప్రమోషన్లతోనే చాన్నాళ్లుగా ఎంఈవో పోస్టులను భర్తీ చేస్తోంది. అలా అయినా మండలానికొకరు కాకుండా రెండు, మూడు మండలాలకు ఒకరు చొప్పున ఇన్‌చార్జి ఎంఈవోలు పనిచేస్తున్నారు. దీంతో ఏ మండలానికీ వారు సరైన న్యాయం చేయలేకపోతున్నారు. చేవెళ్ల, శంకర్‌పల్లి మండలాలకు కలిపి ఇన్‌చార్జి ఎంఈవో ఉన్నారు. ఆయనే శంకర్‌పల్లి మండలం జన్వాడలోని జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగానూ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అటు హెచ్‌ఎంగా, రెండు మండలాలకు ఇన్‌చార్జి ఎంఈవోగా త్రిపాత్రాభినయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే షాబాద్ మండల ఇన్‌చార్జి ఎంఈవోగా షాద్‌నగర్ రెగ్యులర్ ఎంఈవో కొనసాగుతున్నారు. మొయినాబాద్ మండలం కనకమామిడిలోని జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎంను మండల ఇన్‌చార్జి ఎంఈవోగా నియమించారు. ఆయనకే శేరిలింగంపల్లి మండల అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే నవాబ్‌పేట్ మండలం ఎక్‌మామిడి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నవాబ్‌పేట్ మండల ఇన్‌చార్జి ఎంఈవోగా కొనసాగుతున్నారు. ఆయనే మెమిన్‌పేట ఇన్‌చార్జి ఎంఈవోగానూ కొనసాగుతున్నారు. ఈ ఇన్‌చార్జి ఎంఈవోలు తమ పాఠశాల నిర్వహణ బాధ్యతలు, మండల ఇన్‌చార్జి బాధ్యతలు చూసుకుంటున్నారు. దీంతో అన్ని పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడింది. టీచర్ల సమయపాలన, విద్యా బోధనలపై అజమాయిషీ తప్పింది.
ఇష్టారాజ్యంగా ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు
చేవెళ్ల డివిజన్‌లోని ప్రైవేట్ పాఠశాలలపై పర్యవేక్షణ లేకపోవడంతో ఆ పాఠశాలల యాజమాన్యాలు ఫీజుల విషయంలో, పుస్తకాలు, స్కూల్ డ్రెస్సుల అమ్మకాలు సాగిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలో వారిని కట్టడి చేసేవారే కరువయ్యారు. పాఠశాలల్లో పుస్తకాలు, బుక్కులు, డ్రెస్సులు అమ్మొద్దనే నిబంధన ఉన్నా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయాల ఫీజులు వసూలు చేస్తున్నారు. కొన్ని ప్రైవేట్ స్కూళ్లను ప్రభుత్వ అనుమతి లేకుండా నడిపిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటాలాడుకుంటున్నా ప్రశ్నించే వారు లేకుండా పోయారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సదుపాయాలు లేవు. అనుమతిలేని పాఠశాలల విషయం మండల, జిల్లా విద్యాశాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. పాఠశాలల యాజమాన్యాలు ఇచ్చే ఆమ్యామ్యాలకు అలవాటుపడే చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇంత తతంగం జరుగుతున్నా ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తనీఖీలు చేసి ప్రైవేట్ పాఠశాలల వ్యవహారంపై కొరడా ఝులిపించాలని ప్రజలు కొరుతున్నారు.
చిక్కరు.. దొరకరు!
చేవెళ్ల నియోజకవర్గంలో ఇన్‌చార్జి ఎంఈవోలు నిత్యం అందుబాటులో ఉండాల్సి ఉండగా రెండు మండలాల చొప్పున ఇన్‌చార్జి బాధ్యతలతో వారు ఏ మండలంలో ఎప్పుడు ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇన్‌చార్జి ఎంఈవోలు చిక్కరు.. దొరకరు అన్నట్టుగా తీరు ఉంది. కార్యాలయానికి వస్తే స్కూల్ విసిట్ అని, స్కూళ్లకు వెళ్తే కార్యాలయ పని చెబుతున్నారు. రెగ్యులర్ అధికారి లేక మండల వనరుల కేంద్రాల్లో ఉండాల్సిన సిబ్బంది సైతం తమ విధులను ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారు. అజామాయిషీ, పట్టించుకునే వారు లేక ఎవరికి వారే.. యమునా తీరే అన్న చందంగా మండలాల్లో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందనడంతో ఎలాంటి సందేహం లేదు!
Updated Date - Jul 15 , 2024 | 12:00 AM