డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లివ్వాలని ఆందోళన
ABN, Publish Date - Jun 23 , 2024 | 11:58 PM
మహేశ్వరం మండలం మన్‌సాన్‌పల్లిలో తమకు వెంటనే డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను కేటాయించాలని లబ్ధిదారులు ఆదివారం ఆందోళన చేశారు.
ఫ్లాట్లు పంపిణీ చేయిస్తానని ఎమ్మెల్యే సబిత హామీ
మహేశ్వరం, జూన్ 23: మహేశ్వరం మండలం మన్‌సాన్‌పల్లిలో తమకు వెంటనే డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను కేటాయించాలని లబ్ధిదారులు ఆదివారం ఆందోళన చేశారు. 2018లో ప్రభుత్వం ఇక్కడ డబుల్‌బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నాలుగేళ్లపాటు రు.100కోట్లతో 2,412 ఫ్లాట్లను అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించింది. ఇళ్లు లేని పేదలు దరకాస్తు చేసుకోగా కొందరిని ఎంపిక చేసి 21-9-2023న అప్పటి మంత్రి సబితారెడ్డి ఫ్లాట్ మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికలు రావడంతో కోడ్ కారణంగా ఇళ్ల పంపిణీ నిలిచింది. ఎన్నికల అనంరతం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్ల పంపిణీ ప్రక్రియను చేపట్టింది. స్థానికంగా నిర్మించిన ఇండ్లను స్థానికేతరులకు కేటాయించారని పంపిణీ నిలిపేశారు. దీంతో అంతకు ముందు ఎంపికైన వారు ఆదివారం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్ద ఆందోళన చేశారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పి.సబితారెడ్డి ఫోన్లో వారితో మాట్లాడారు. త్వరలో సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానని ఆమె హామీ ఇవ్వడంతో లబ్ధిదారులు ఆందోళన విరమించి వెళ్లిపోయారు.
Updated Date - Jun 23 , 2024 | 11:58 PM