కుక్కల దాడిలో లేగదూడలు మృత్యువాత
ABN, Publish Date - Aug 24 , 2024 | 11:26 PM
కుక్కల దాడిలో లేగదూడలు మృత్యువాతపడిన ఘటన కీసరలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
కీసర, ఆగస్టు 24: కుక్కల దాడిలో లేగదూడలు మృత్యువాతపడిన ఘటన కీసరలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కీసరకు చెందిన కుంటోళ్ల మల్లారెడ్డి ఇటీవల రూ.3లక్షలు వెచ్చించి రెండు గేదెలతో పాటు దూడలను కొనుగోలు చేశాడు. ఎప్పటిలాగే గేదెలను మేతకు తీసుకెళ్లగా లేగదూడలను పాకలో కట్టివేశాడు. ఇంతలో కుక్కలు వచ్చి కట్టేసిన లేగదూడలపై దాడిచేసి చంపేశాయి. లేగదూడలు లేకుండా గేదెలు పాలు ఇవ్వడం కష్టమని, దీంతో ఆర్థికంగా నష్టపోతున్నామని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా వారం రోజుల కిందట మల్లారెడ్డి పాక పక్కనే ఉన్న కందాడి రాంగోపాల్‌రెడ్డి పాకలో కట్టేసిన నాలుగు మేకలను కుక్కలు దాడి చంపేశాయి. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకముందే అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
గడ్డిమందు చల్లిన మేత తిని ఎద్దు, ఆవు..
తాండూరు రూరల్: గడ్డిమందు చల్లిన మేత తిని ఎద్దు, ఆవు మృత్యువాతపడ్డాయి. ఈ సంఘటన తాండూరు మండలంలోని వీరారెవిడ్డిపల్లిలో శనివారం చోటుచేసుకుంది. వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు తన రెండు ఎడ్లు, ఒక ఆవును రోజూ మాదిరిగా మేతకు తీసుకెళ్లాడు. గ్రామానికి చెందిన నర్సింహులు పొలంలో గడ్డిమందు పిచికారి చేశాడు. ఈ గడ్డిమందు పిచికారి చేసిన గడ్డిని ఎద్దు, ఆవు తిన్నాయి. దీంతో అస్వస్థతకు గురై మృత్యువాతపడ్డాయి. ఆనంద్ కరన్‌కోట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ విఠల్‌రెడ్డి గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Updated Date - Aug 24 , 2024 | 11:26 PM