డంపింగ్ యార్డులకు బై.. బై!
ABN, Publish Date - Jul 31 , 2024 | 12:27 AM
మేడ్చల్ మునిసిపాలిటీ పరిధిలో చెత్త డంపింగ్ యార్డులకు ఇక తెరపడనుంది.
మేడ్చల్ నుంచి చెత్త తరలింపు
జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు చేరవేత
తాత్కాలిక చెత్త స్టోరేజికి స్థలాన్వేషణ
మేడ్చల్ టౌన్, జూలై 30: మేడ్చల్ మునిసిపాలిటీ పరిధిలో చెత్త డంపింగ్ యార్డులకు ఇక తెరపడనుంది. ఇంటింటికి తిరిగి సేకరిస్తున్న చెత్తను ఇకపై స్థానిక డంపింగ్ యార్డులకు బదులుగా జవహర్‌నగర్ జీహెచ్‌ఎంసీ డంపింగ్ యార్డుకు తరలించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మేడ్చల్‌లో చెత్తను నిల్వచేసేందుకు రైల్వే కాలనీ సమీపంలో ఒక డంపింగ్ యార్డు, అత్వెల్లిసమీప ప్రైవేట్ స్థలంలో మరో డంపింగ్ యార్డును నిర్వహిస్తున్నారు. ఇక్కడ చెత్త వేసి దహనం చేస్తున్నారు. రైల్వే కాలనీ వద్ద ఉన్న డంపింగ్ యార్డుకు రోడ్డు లేక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వేట్రాక్ అవతల డంపింగ్ యార్డు ఉండటంతో మూడేళ్లుగా కొనసాగుతున్న రైల్వే అండర్ పాస్ పనులతో తరలింపు వాహనాలు రైల్వే ట్రాక్ దాటి యార్డు వద్దకు వెళ్లేందుకు మార్గం లేకుండా పోయింది. దీంతో మునిసిపల్ సిబ్బంది తంటాలు పడుతున్నారు. అత్వెల్లిలోని డంప్‌యార్డు పరిసరాల్లో రెసిడెన్షియల్ జోన్ ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున గేటెడ్ కమ్యూనిటీలున్నాయి. ఇక్కడ చెత్త డంపింగ్, నిప్పు పెట్టడంపై స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. 24గంటలూ వస్తున్న కలుషిత పొగతో ఇబ్బందులు పడుతున్నామని, అనారోగ్యం పాలవుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు కౌన్సిల్ చెత్తను దూరప్రాంతానికి తరలించాలని నిర్ణయించి ఉన్నతాధికారులకు ప్రతిపాదన పంపింది. దీంతో జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు మేడ్చల్ మున్సిపల్ చెత్తను తరలించేందుకు అనుమతించారు. చెత్తను తరలింపునకు అయ్యే ఖర్చును మున్సిపాలిటీ భరించాల్సి ఉంటుంది.
రోజూ 20 నుంచి 25 టన్నుల చెత్త తరలింపు
ప్రస్తుతం ఉన్న రెండు డంపింగ్ యార్డులను మూసేస్తున్నందున రోజూ మున్సిపల్ పరిధిలో సేకరించే చెత్తను ఒకచోట నిల్వచేసి అక్కడి నుంచి భారీ వాహనాల్లో జవహర్‌నగర్‌కు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. చెత్తను డంప్ చేయడానికి స్థలం కోసం అధికారులు అణ్వేషిస్తున్నారు. ఇందుకు రెవెన్యూ శాఖ పరిధి ఉన్న స్థలాల కోసం అధికారులను సంప్రదిస్తున్నారు. అలాగే మున్సిపల్ ఉన్న స్థలాలనూ పరిశీలిస్తున్నారు. పట్టణంలో రోజూ 20-25టన్నుల చెత్త జమవుతోంది. సేకరించిన చెత్తను ఏ రోజుకారోజు జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలించనున్నారు. దీంతో ఇక్కడ డంపింగ్ యార్డుల సమస్య పరిష్కారంతో పాటు పట్టణ పరిధిలో ఇక్కపై చెత్త నిల్వ ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. రోజూ భారీ వాహనాల్లో రెండుమూడు ట్రిప్పుల్లో చెత్తను తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు. చెత్త తరలింపునకు ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డు నిర్వాహకుల నుంచి అనుమతి పొందినట్టు కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు.
Updated Date - Jul 31 , 2024 | 12:27 AM