బడి ఊడ్చే దిక్కేది?
ABN, Publish Date - Jul 10 , 2024 | 12:41 AM
ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లు లేక ఊడ్చేదిక్కులేదు. ఫలితంగా పాఠశాలల ఆవరణలు అపరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. గతంలో పాఠశాలల్లో ఊడ్చేందుకు, మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు ప్రభుత్వం స్కావెంజర్లను నియమించి వేతనాలు అందజేసింది.
స్కావెంజర్లు లేక అపరిశుభ్రంగా పాఠశాలల ఆవరణ
పట్టించుకోని మునిసిపాలిటీలు, పంచాయతీలు
ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు
సూర్యాపేటఅర్బన్, భువనగిరి టౌన్, జూలై 9: ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లు లేక ఊడ్చేదిక్కులేదు. ఫలితంగా పాఠశాలల ఆవరణలు అపరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. గతంలో పాఠశాలల్లో ఊడ్చేందుకు, మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు ప్రభుత్వం స్కావెంజర్లను నియమించి వేతనాలు అందజేసింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం స్కావెంజర్లను, స్వీపర్లను తొలగించడంతో పాఠశాలలను శుభ్రంచేసే పరిస్థితి లేకుండా పోయింది. స్కావెంజర్ల స్థానంలో మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీ సిబ్బందికి పాఠశాలల పారిశుధ్య పనులు అప్పగించింది. అయితే ఇప్పటికే పట్టణాలు, గ్రామాల్లో పారిశుధ్య పనులు నిర్వహిస్తున్న కార్మికులు, పాఠశాలల్లో పనులు చే సేందుకు నిరాకరిస్తున్నారు. పాఠశాలల పనులను అదనపు బాధ్యతలుగా చూస్తున్న పారిశుధ్య కార్మికులు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఒత్తిడి చేసినప్పుడు మాత్రమే చుట్టపుచూపుగా వచ్చి పైపైన పనులు నిర్వహించి వెళ్తున్నారు. దీంతో పాఠశాలల్లో పారిశుధ్యం లోపిస్తోంది.
కంపుకొడుతున్న మరుగుదొడ్లు
విద్యాసంవత్సరం ప్రారంభమై 40 రోజులు అవుతుండ గా, పాఠశాలల్లో స్కావెంజర్లు లేక మరుగుదొడ్లు కంపుకొడుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో గతంలో మొత్తం 753 మంది స్కావెంజర్లు పాఠశాలల్లో విధులు నిర్వహించేవారు. ప్రతీ 40 మంది విద్యార్థులకు ఒక స్కావెంజర్ ఉండేవారు. వారికి నెలకు గతంలో రూ.2,500 వేతనం ఇచ్చేవారు. వీరు పాఠశాల ప్రాంగణం, గదులు, మరుగుదొడ్లను శుభ్రం చేసేవారు.అయితే గత ప్రభుత్వం వారిని తొలగించి పాఠశాలల బాధ్యతలను మునిసిపల్, గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులకు అప్పగించింది. కొన్ని పంచాయతీల్లో పారిశుధ్య సిబ్బంది సరిపడా లేకపోవడం, ఉన్న సిబ్బంది అదనపు భారంతో పాఠశాలల్లో పనులకు ముందుకు రావడం లేదు.
ఉమ్మడి జిల్లాలో 3,125 ప్రభుత్వ పాఠశాలలు
నల్లగొండ జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 1,126, ప్రాథమికోన్నత పాఠశాలలు 128, ఉన్నత పాఠశాలలు 229 వరకు ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 690 ప్రాథమిక, 78 ప్రాథమికోన్నత, 162 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 930 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 65వేల మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. యాదాద్రి జిల్లాలో 712 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 39,760 మంది విద్యార్ధులు విద్యనభ్యసిస్తున్నారు. 2,790 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభంలోపే స్కావెంజర్ల వ్యవస్థ పునరుద్ధరణపై ఓ నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి ఉపాధ్యాయ సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో హామీ ఇచ్చారు. అయితే పాఠశాలలు ప్రారంభమై రోజులు గడుస్తున్నా నేటికీ ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు.
స్కావెంజర్లను నియమించాలి : ఆవుల నాగరాజు, పీడీఎ్‌సఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో వెంటనే స్కావెంజర్లు, స్వీపర్లను నియమించాలి. గత ప్రభుత్వం వారిని తొలగించడంతో పాఠశాలల్లో పరిశుభ్రత లోపించింది. చెత్తాచెదారం పేరుకుపోవడంతో దోమలు వృద్ధి చెంది విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు.
పాఠశాలల పారిశుధ్య బాధ్యత స్థానిక సంస్థలదే : కె.నారాయణరెడ్డి, యాదాద్రి జిల్లా డీఈవో
ప్రభుత్వ పాఠశాలల పారిశుధ్య బాధ్యత స్థానిక సంస్థలదే. ఈ మేరకు ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో పంచాయతీలు, పట్టణాల్లో మునిసిపాలిటీలు ప్రభుత్వ పాఠశాలల ఆవరణలను, మూత్రశాలలను శురఽభం చేయాలి. ఇది అమలవుతోంది కూడా. అయితే కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు, మరికొన్ని పాఠశాలల్లో స్వచ్ఛంద సంస్థలు స్కావెంజర్లను నియమించి భృతి చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది.
Updated Date - Jul 10 , 2024 | 12:41 AM