కార్యదర్శి లేరు.. ప్రత్యేక అధికారి రారు
ABN, Publish Date - Jul 13 , 2024 | 12:08 AM
మండలంలోని పాలడుగు గ్రామంలో పంచాయతీ పాలన కుంటుపడింది.
20రోజులుగా తెరుచుకోని పంచాయతీ కార్యాలయం
పాలడుగులో కుంటుపడిన పాలన
మోత్కూరు, జూలై 12: మండలంలోని పాలడుగు గ్రామంలో పంచాయతీ పాలన కుంటుపడింది. సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ఇప్పుడు గ్రామపంచాయతీలకు సర్పంచులు లేరు. ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీలు నడుస్తున్నాయి. పాలడుగు గ్రామ పంచాయతీ కార్యదర్శి జి.శోభన గత నెల 22నుంచి దీర్ఘకాలిక (మూడు మాసాలు) సెలవుపై వెళ్లారు. ఆయన స్థానంలో కనీసం ఇనచార్జి కార్యదర్శిని కూడా నియమించలేదు. డిప్యూటీ తహసీల్దార్ గ్రామ ప్రత్యేక అధికారిగా ఉన్నారు. ఇటు పంచాయతీ కార్యదర్శి లేక, అటు గ్రామ ప్రత్యేక అధికారి రాక గ్రామ సచివాలయం తాళం తీయడం లేదని గ్రామ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. పర్యవేక్షణ కొరవడి సిబ్బంది కూడా సక్రమంగా పనిచేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామంలో పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ సక్రమంగా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలం కావడంతో వీధుల్లో చెత్తాచెదారం పేరుకపోయి, మురికి కాల్వలు సకాలంలో శుభ్రం చేయకపోవడం, బ్లీచింగ్ పౌడర్ చల్లక పోవడంతో దోమలు పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. నీటి ట్యాంకులు శుభ్రం చేయడంలేదంటున్నారు. వీధి దీపాలు సక్రమంగా వెలగక రాత్రివేళ చీకట్లో ప్రజలు వీధుల్లో నడిచేప్పుడు ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక, విషపురుగులేమైనా సంచరిస్తున్నాయో తెలియక భయంభయంగా వెళ్లాల్సి వస్తోందంటున్నారు. కార్యదర్శి, ప్రత్యేక అధికారి లేక కార్యాలయం తెరువకపోవడంతో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, నూతన ఇళ్ల నిర్మాణ అనుమతులు ఇవ్వడంలో జాప్యం జరుగుతుండటంతో ఇబ్బంది పడుతున్నామంటున్నారు. వివిధ పనులపై గ్రామపంచాయతీకి వచ్చిన ప్రజలకు కార్యాలయం తాళం తీయక పోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. వెంటనే పంచాయతీ కార్యదర్శిని నియమించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
పంచాయతీ కార్యదర్శిని నియమించాలి
పాలడుగు గ్రామపంచాయతీ కార్యదర్శి శోభన సెలవుపై వెళ్లడం, గ్రామ పత్యేక అధికారి గ్రామానికి రాకపోవడంతో సుమారు 20రోజులుగా పంచాయతీ కార్యాలయం తాళమే తీయడం లేదు. గ్రామంలో పారిశుధ్యం, వీఽధి దీపాల నిర్వహణ సమస్యగా మారింది. తమ సమస్యలు చెప్పుకోవడానికి కార్యాలయానికి వచ్చే వారికి కార్యాలయం తాళం వేసి ఉండటంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. వెంటనే మా గ్రామానికి పంచాయతీ కార్యదర్శిని నియమించి సమస్యలు పరిష్కరించాలి.
-గుండు వెంకటనర్సు, స్థానికుడు
Updated Date - Jul 13 , 2024 | 12:08 AM