ఇంటి వద్దకే రాములోరి తలంబ్రాలు
ABN, Publish Date - Apr 10 , 2024 | 12:16 AM
భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తులకు చేరవేసేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. రాములోరి తలంబ్రాలను భక్తులు పవిత్రంగా భావిస్తారు. సీతారాముడి కల్యాణానికి భద్రాచలం వెళ్లలేని భక్తుల కోసం తలంబ్రాలను వారి ఇంటికే చేరవేసేందుకు టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది.
చెల్లించాల్సిన ధర రూ.151
భద్రాచలం వెళ్లలేని భక్తులకు ఆర్టీసీ ఏర్పాట్లు
గతం కంటే ఎక్కువ మందికి పంపిణీకి నిర్ణయం
నల్లగొండ, ఏప్రిల్ 9: భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తులకు చేరవేసేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. రాములోరి తలంబ్రాలను భక్తులు పవిత్రంగా భావిస్తారు. సీతారాముడి కల్యాణానికి భద్రాచలం వెళ్లలేని భక్తుల కోసం తలంబ్రాలను వారి ఇంటికే చేరవేసేందుకు టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. గత రెండేళ్లుగా ఆర్టీసీ ఈ సౌకర్యాన్ని కల్పించగా, ఈసారి అధిక సంఖ్యలో భక్తులకు తలంబ్రాలు పంపిణీ చేయాలని ప్రణాళిక రూపొందించింది.
ఆర్టీసీ లాజిస్టిక్ సేవల ద్వారా 2022 నుంచి ఇంటి వద్దకే రాముడి కల్యాణ తలంబ్రాల ను భక్తులకు చేరవేస్తోంది. ఈసారి కూడా అదే మాదిరిగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాములోరి తలంబ్రాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఈ తలంబ్రాలను శుభకార్యాలకు అంక్షితలుగా ఉపయోగిస్తే రాముల వారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వా సం. అదేవిధంగా రైతులు ఈ తలంబ్రాలను పొలాల్లో చల్లి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు.దీంతో పంటలు సమృద్ధిగా పండుతాయని, దిగుబడులు అధికంగా వస్తాయని రైతుల నమ్మకం. అంతేగాక ఈ తలంబ్రాలతో చిన్న పిల్లలను ఆశీర్వదిస్తుంటారు. ఉమ్మ డి నల్లగొండజిల్లా వ్యాప్తంగా భక్తులు ఈతలంబ్రాల కొనుగోలుకు ఆసక్తి చూపుతుంటారు.
ప్యాకెట్ రూ.151
సీతారామచంద్ర స్వామి కల్యాణ తలంబ్రాలకు గత ఏడాది ప్యాకెట్ ధర రూ.116 ఉండగా, ప్రస్తు తం రూ.151కు పెంచారు. గతంలో మాదిరిగానే భక్తులు కొరుకున్న చోటికి ప్యాకెట్లను చేర్చేలా ఆర్టీసీ చర్యలు తీసుకుంది. కల్యాణానికి హాజరుకాలేని రామ భక్తులు ఆర్టీసీ కార్గో సేవలు వినియోగించుకోవడంతోపాటు సంస్థకు ఆదాయాన్ని సమకూర్చేందుకు ఈ సౌకర్యాన్ని ప్రవేశపెట్టారు. ఈనెల 17న భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవం జరగనుంది. తలంబ్రాలు కావాల్సిన వారు రూ.151 చెల్లించి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని లాజిస్టిక్ కేంద్రాలతో పాటు మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్‌ల వద్ద ముందస్తు బుక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఈనెల 18వ తేదీ వరకు బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. కొద్ది రోజుల క్రితం సమక్క-సారక్క జాతరకు వెళ్లలేని భక్తులకు సైతం ఆర్టీసీ ప్రసాదం, పసుపు, కుంకుమ సరఫరా చేసింది.
భక్తులు సద్వినియోగం చేసుకోవాలి : శ్రీదేవి, నల్లగొండ ఆర్‌ఎం
ఆర్టీసీ కల్పిస్తున్న ఈ సౌకర్యాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలి. విశిష్టమైన సీతారాముల కల్యాణ తలంబ్రాల పంపిణీని ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా చేస్తున్నాం. ఎంతో నియయ, నిష్టలతో చేతితోనే ఒలిచిన తలంబ్రాలను ఇంటి వద్దకే అందించేందుకు నిర్ణయించాం. భక్తులు బుకింగ్ సమయంలో తమ పూర్తి చిరునామాతో పాటు ఫోన్ నెంబర్‌ను కూడా నమోదు చేయాలి. రాములోరి కల్యాణం అనంతరం ఇంటి వద్దకే తలంబ్రాలను పంపిణీ చేస్తాం.
తలంబ్రాల కోసం డిపోల వారీగా సంప్రదించాల్సిన నంబర్లు
డిపో సెల్ నంబర్
నల్లగొండ 9154298691
నార్కట్‌పల్లి 9154298692
మిర్యాలగూడ 9154298693
దేవరకొండ 9154298694
సూర్యాపేట 9154298695
కోదాడ 9154298696
యాదగిరిగుట్ట 9154298697
Updated Date - Apr 10 , 2024 | 12:16 AM