కీలక పోస్టుల కోసం పైరవీలు
ABN, Publish Date - Aug 01 , 2024 | 12:50 AM
రాష్ట్రంలో బదిలీల ప్రక్రియ మొదలవడంతో కీలక పోస్టుల కోసం పైరవీలు ఆరంభమయ్యా యి. రాజకీయ పలుకుబడి వినియోగించుకొని ముఖ్యమైన స్థానాల్లో తిష్టవేసిన అధికారులు, ఆ స్థానాలు వదిలేందుకు ఇష్టపడడంలేదు. దీంతో బదిలీల ప్రక్రియ సజావుగానే జరుగుతుందా? అన్న సందేహం వ్యక్తమవుతోంది.
రెవెన్యూ శాఖలో తీవ్రప్రయత్నాలు
రవాణా, ఎక్సైజ్‌శాఖల్లో పాతుకుపోయిన వారిని కదలించాలనే సూచనలు
పశుసంవర్థకశాఖలో పనిచేసేందుకు ముందుకురాని అధికారులు
పారదర్శకంగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్
(ఆంధ్రజ్యోతిప్రతినిధి-నల్లగొండ): రాష్ట్రంలో బదిలీల ప్రక్రియ మొదలవడంతో కీలక పోస్టుల కోసం పైరవీలు ఆరంభమయ్యా యి. రాజకీయ పలుకుబడి వినియోగించుకొని ముఖ్యమైన స్థానాల్లో తిష్టవేసిన అధికారులు, ఆ స్థానాలు వదిలేందుకు ఇష్టపడడంలేదు. దీంతో బదిలీల ప్రక్రియ సజావుగానే జరుగుతుందా? అన్న సందేహం వ్యక్తమవుతోంది.
ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ప్రహసనంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని కీలకమైన రెవెన్యూ శాఖలో రాజకీయ పైరవీలు ఊపందుకున్నాయి. దశాబ్దాలుగా పాతుకుపోయిన ఉద్యోగులు, అధికారులు మళ్లీ అవే స్థానాల్లో లేదంటే, సమీప విభాగాల్లో పోస్టింగుల కోసం పైరవీలు మొదలు పెట్టారు. మరోవైపు కీలకమైన మండలాల్లో తహసీల్దార్ పోస్టులు పొందేందు కు కొందరు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రవాణా, ఎక్సైజ్ శాఖల్లో బదిలీల ప్రక్రియ మొదలవక మునుపే కీలకమైన స్టేషన్లు, యూ నిట్లు, విభాగాల్లో పోస్టులు పొందేందుకు ప్రయత్నా లు ముమ్మరంచేశారు. ఎమ్మెల్యేలు, సంఘాల నేతల సహకారంతో అనుకూలమైన పోస్టింగులకోసం ప్రయత్నాలు చేస్తుండడం చర్చనీయాంశమైంది.
రవాణా, ఎక్సైజ్ శాఖల్లోనూ..
కీలకమైన ఎక్సైజ్, రవాణా శాఖల్లోనూ ఉమ్మడి జిల్లాలో కొన్ని సెక్షన్లలో, యూనిట్లలో ఉద్యోగులు, సిబ్బంది పాతుకుపోయారని, వారిని ఈ బదిలీల్లోనైనా స్థానచలనం కలిగించాలనే డిమాండ్లు ఇత ర ఉద్యోగుల నుంచి వస్తున్నాయి. ఎక్సైజ్ శాఖలో కొందరు ఉద్యోగులు దశాబ్దాలుగా ఒకే డివిజన్‌లో స్టేషన్లు, సెక్షన్లు మారు తూ పనిచేస్తున్నారని, ఈ డివిజన్లలో వీరు ఆడిందే ఆట పాడిందే పాట గా సాగుతుందని, అధికారులు ఎవరు వచ్చినా, వ్యవహారాలన్నీ వీరే చక్కబెడుతుండడంతో వీరిపైన ఆరోపణలు కూడా దండిగానే వస్తున్నాయి. ఇలాంటి వారిని గుర్తించి బదిలీల్లో స్థానచలనం కలిగించాలని కోరుతున్నారు. మరో కీలకమైన రవాణాశాఖ యూనిట్లలోనూ కొందరు ఉద్యోగులు ఇదే తరహాలో పాతుకుపోయారని తెలుస్తోంది. జాతీయ రహదారి, సరిహద్దు యూనిట్లు, పారిశ్రామిక ప్రాంత సమీప యూనిట్లలో పనిచేసే ఉద్యోగుల్లో కొందరు ఇలా దశాబ్దాలుగా పాగావేసి యూనిట్లను శాసించే స్థాయికి ఎదిగారన్న ఆరోపణలున్నాయి. ఈ దఫా కూడా బదిలీలు మొదలవగానే తమ కుర్చీలు మారకుండా, మారినా ఆఫీసు నుంచి చెక్‌పోస్టలకు, చెక్‌పోస్టుల నుంచి ఆఫీసులకు, లేదం టే ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఇలా ఏదైనా యూనిట్ మారకుండా ఉండేలా ఆప్షన్లు పెట్టుకునేందుకు సిద్ధమైన ట్లు తెలుస్తోంది. ఈసారి బదిలీల ప్రక్రియ మొదలవగానే ఇలాంటి వారిని గుర్తించాలని, రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు సైతం వీరికి ఆస్కారమివ్వకుండా పారదర్శకంగా బదిలీలు సాగే లా చూడాలని కోరుతున్నారు.
రెవెన్యూలో పాతుకుపోయిన ఉద్యోగులు కదులుతారా..? లేదా..?
ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట కలెక్టరేట్లతోపాటు కీలకమైన మిర్యాలగూ డ, సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి, చౌటుప్పల్, కోదాడ రెవెన్యూ డివిజన్లలో పనిచేయడానికి అధికారులు, ఉద్యోగు లు ఆసక్తి చూపుతున్నారు. సంబంధిత పోస్టుల్లో తమను నియమించేలా సహకరించాలని ఎమ్మెల్యేలు, కీలకనాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కీలకమైన భూసేకరణ కొనసాగే మండలాల్లో, హైదరాబాద్ నగరానికి సమీపం లో ఉన్న మండలాలకు, జాతీయ రహదారులపై ఉన్న మం డలాల్లో, మైనింగ్ నిర్వహణ ఉన్న ప్రాంతాల్లో తహసీల్దార్లు గా పనిచేసేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొందరు అధికారులు ఎమ్మెల్యేల సిఫార్సులతో ఉధృతంగా ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ సాగుతోంది. మరోవైపు కీలకమైన కలెక్టరేట్లు, డివిజన్ కార్యాలయాల్లో దశాబ్దాలుగా పాతుకుపోయిన ఉద్యోగులు మళ్లీ ఏదో రూపంలో ఇక్కడే కొనసాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నల్లగొండ, సూర్యాపేటల్లో కొందరు అధికారులు ఇదే తరహాలో కలెక్టరేట్ నుంచి డివిజన్ కార్యాలయానికి, డివిజన్ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు మారేలా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. రెవెన్యూశాఖలో ఉన్నతాధికారుల కనుసన్నల్లో కీలక వ్యవహారాలను చక్కబెట్టే స్థాయిల్లో ఉండే ఈ అధికారులు మళ్లీ తమ ప్రాభవం తగ్గకుండా సమీపంలోనే పోస్టులు పట్టాలని ప్రయత్నిస్తున్నారని, ఈ బదిలీల్లోనైనా వీరిని కదిలించకపోతే బదిలీల ప్రయోజమేముంటుందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. రాజకీయ నేతలు.. ప్రధానంగా ఎమ్మెల్యేలు ఇలాంటి వారికి సహకరించకుండా ఉంటేనే బదిలీల పర్వం సజావుగా సాగుతుందని, దీనిపై ఉన్నతాధికారులు, పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు.
అమ్మో పశుసంవర్దక శాఖా !
పశుసంవర్దకశాఖలో పనిచేయాలంటే ఉద్యోగులు జంకుతున్నారు. ఈ శాఖలో గత ప్రభుత్వ హయాంలో గొర్రెల స్కామ్ జరగడం, బాధ్యులపై కేసులు నమోదవడంతో కీలక అధికారి పోస్టులతోపాటు కీలకమైన సెక్షన్లలో పనిచేసే ఉద్యోగుల కోసం బదిలీల్లో ఎవరూ ఆప్షన్లు పెట్టుకోవడం లేదు. గత ప్రభుత్వ హయాంలో గొర్రెలస్కామ్‌లో దళారుల వద్ద కొనుగోలు చేశారనే ఆరోపణలు విచారణలో తేలడంతో రూ.18కోట్ల బిల్లులు పెండింగ్‌లో పడిపోయాయి. వారంతా దళారులేనని ప్రభుత్వం నిర్దారించి బిల్లులు ఆపడంతో ఇక్కడ బాధ్యతల్లోకి వస్తే ఈ ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుందనే భయంతో అధికారులెవరూ ఈ పోస్టులోకి రావడానికి సు ముఖత చూపడంలేదు. దీంతోపాటు కీలకమైన వైద్యాధికారులు, సెక్షన్ ఉద్యోగుల కొరత ఉండడంతో ఈ పోస్టులకు డిమాండ్ లేకుండా పోయింది. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ శాఖల్లో ఏళ్ల తరబడి పాతుకుపోయిన వారికి స్థానం చలనం కలిగిస్తారా? లేక అదే స్థానంలో తిష్ట వేసేలా రాజకీయ నేతలు సహకరిస్తారా? అనే అంశం చర్చనీయాంశమైంది.
Updated Date - Aug 01 , 2024 | 12:50 AM