రోడ్డు ప్రమాదంలో బీజేపీ నాయకుడు మృతి
ABN, Publish Date - May 17 , 2024 | 12:07 AM
బైకును కారు ఢీకొన్న సంఘటనలో బీజేపీ నల్లగొండ పార్లమెంట్ సోషల్ మీడియా కోకన్వీనర్ మృతిచెందాడు.
సూర్యాపేటక్రైం, మే 16 : బైకును కారు ఢీకొన్న సంఘటనలో బీజేపీ నల్లగొండ పార్లమెంట్ సోషల్ మీడియా కోకన్వీనర్ మృతిచెందాడు. ఈ ప్రమాదం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ వద్ద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పట్టణ ఇనస్పెక్టర్ జీ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం ఆత్మకూర్(ఎ్‌స)మండల కేంద్రానికి చెందిన కొప్పుల క్రాంతిరెడ్డి సూర్యాపేటలో విద్యానగర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. నల్లగొండ పార్లమెంట్ బీజేపీ సోషల్‌మీడియా కోకన్వీనర్‌గా పనిచేస్తున్నాడు. అయితే బుధవారం తన స్నేహితుడి పెళ్లిరోజు ఉండడంతో వారి నివాసం వద్ద బుధవారం రాత్రి వరకు స్నేహితులతో ఉండి సంబరాల్లో పాలుపంచుకున్నాడు. అనంతరం అర్ధరాత్రి దాటిన తర్వాత బైక్‌పై కుడకుడ రోడ్డు నుంచి విద్యానగర్‌లోని ఇంటికి వెళ్తున్నాడు. ఆ సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న కారు కొత్తబస్టాండ్ వద్ద కొప్పుల క్రాంతిరెడ్డి ప్రయాణిస్తున్న బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్రాంతిరెడ్డి తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. క్రాంతిరెడ్డి తండ్రి నర్సిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇనస్పెక్టర్ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద బీజేపీ నాయకులు క్రాంతిరెడ్డి మృతికి సంతాపం తెలిపారు.
కార్యకర్తకు కన్నీళ్లతో వీడ్కోలు పలికిన సంకినేని
ఆత్మకూర్(ఎస్) : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీజేపీ నల్లగొండ పార్లమెంట్ సోషల్‌మీడియా కోకన్వీనర్ కొప్పుల క్రాంతిరెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం ఆత్మకూర్(ఎస్) గ్రామంలో గురువారం నిర్వహించారు. మృతదేహానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు, బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతిమయాత్రలో పందిరి రాంరెడ్డి, కిషన, వీరేందర్, సైదులు, దనుంజయగౌడ్, కర్ణాకర్, కృష్ణ, రవి, వీరారెడ్డి, పాల్గొని పార్టీలో తమతో కలిసి పనిచేసిన క్రాంతిరెడ్డికి కన్నీటితో వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సంకినేని దంపతులు క్రాంతిరెడ్డిని తలుచుకుని కన్నీటిపర్యంతం అయ్యారు.
Updated Date - May 17 , 2024 | 12:07 AM