ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ
ABN, Publish Date - Aug 21 , 2024 | 12:03 AM
ఎగువన వర్షాలతో మూసీ నదీ పరవళ్లు తొక్కుతోంది. యాదాద్రిభువనగిరి జిల్లాలో సోమవారం సగటున 46.0 మిల్టీమీటర్ల వర్షపాతం నమోదైంది.
యాదాద్రి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి) : ఎగువన వర్షాలతో మూసీ నదీ పరవళ్లు తొక్కుతోంది. యాదాద్రిభువనగిరి జిల్లాలో సోమవారం సగటున 46.0 మిల్టీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌తో పాటు జంట నగరాలతో కురుస్తున్న భారీ వర్షాలతో మూసీకి భారీగా వరద నీరు వస్తోంది. దీనికి తోడు జిల్లాలో వర్షాలు వరదకు తోడై నదీ ఉధృతంగా ప్రవహిస్తోంది. మూసీ ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాం తాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు స్తంభి ంచాయి. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మూసీ పరివాహక ప్రాంతాలపై సంబంధిత అధికారులు ఎప్పకటిప్పుడు పర్యవేక్షించాలని యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జెండగే ఆదేశించారు.
తగ్గుముఖం పట్టిన వరద
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉధృతంగా ప్రవహించిన మూసీ రాత్రికి తగ్గుముఖం పట్టింది. దీంతో సంగెం వద్ద రాత్రి వేళలో వాహనాల రాకపోకలు నడిచాయి. అయితే హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో సంగెం, రుద్రవెల్లి బ్రిడ్జిల వద్ద ఎప్పకటిప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
జోరుగా వర్షాలు
జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం సగటున 46.0మిల్టీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా యాదగిరిగుట్ట మండలంలో 170.3మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా రామన్నపేట మండలంలో 5.8మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా భువనగిరిలో 132.3 మిల్లీమీటర్లు, బొమ్మలరామారంలో 98.8, మోటకొండూరులో 95.5, యాదగిరిగుట్టలో 68.6, ఆలేరులో 68.5, తుర్కపల్లి మండలంలో 50.4మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా వర్షపాతం నమోదైంది.
ఆరుతడి పంటలకు...
భారీ వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతుల్లో ఆనందం నెలకొంది. ప్రస్తుత వర్షాలతో ఆరుతడి పంటలకు జీవంవచ్చింది. మరో నాలుగైదు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో చెరువులు, కుంటలు నిండి భూగర్భజలాలు పెరిగి వరి పంటకు ఇబ్బందికరంగా ఉండదని రైతులు ఆశిస్తున్నారు.
నిలిచిన రాకపోకలు
బీబీనగర్ : బీబీనగర్ మండలంలో మూసీ పరవళ్లు తొక్కింది. మంగళవారం తెల్లవారుజాము నుంచే ప్రవాహం మెల్లమెల్లగా పెరుగుతూ ఉదయానికల్లా ఉగ్రరూపం దాల్చింది. దీంతో బీబీనగర్, భూదానపోచంపల్లి ప్రధానమార్గంలో రుద్రవెల్లి, జూలూరు గ్రామాల మధ్య ఉన్న లోలెవల్ బ్రిడ్జిపై నుంచి మూసీ ప్రవహించింది. దాంతో ఈ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నిత్యం ఈ మార్గం గుండా రాకపోకలు కొనసాగించే వారంతా పిలాయిపల్లి, మక్తనంతారం, బట్టుగూడెం, పెద్దరావులపల్లి మార్గాల ద్వారా రాకపోకలు కొనసాగించారు. ఈ మార్గంలో నడపాల్సిన యాదగిరిగుట్ట, ఉప్పల్ డిపో బస్సులను పోచంపల్లి వరకు కాకుండా రుద్రవెల్లి వరకు ఆర్టీసీ అధికారులు కుదించి నడిపించారు. మరో నాలుగైదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో రెవెన్యూ, పోలీ్‌సశాఖ అధికారులు రుద్రవెల్లి, జూలూరు మార్గంపై నిఘా ఏర్పాటుచేశారు. మూసీకి పోటెత్తిన వరద ఉధృతితో మరికొన్ని రోజుల పాటు ఈ ప్రాంత ప్రజలకు తిప్పలు తప్పేలాలేవు.
చెరువులకు జలకళ
భూదానపోచంపల్లి:మండలంలోని మూసీ ఆయకట్టులోని గ్రామాల్లోని చెరువులు మూసీ వరద నీటితో నిండి జలకళ సంతరించుకున్నాయి. అదేవిధంగా జూలూరు-రుద్రవెల్లి గ్రామాల మధ్య వంతెనపై మూసీ వరద పరిస్థితిని మంగళవారం తహసీల్దారు శ్రీకాంతరెడ్డి పరిశీలించారు. రహదారిపై రాకపోకలు నిలిపివేస్తూ బార్‌కేడ్లు అడ్డుగా పెట్టారు. వారి వెంట మండల రెవెన్యూ ఇనస్పెక్టర్ గుత్తా వెంకట్‌రెడ్డి ఉన్నారు.మంగళవారం ఉదయం వర్షానికి పట్టణంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లపై వరద నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
వలిగొండ మండలంలో
వలిగొండ : మండలంలోని సంగెం గ్రామం భీమలింగం కత్వ వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మంగళవారం ఉదయం అధికారులు బారీగేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. సంగెం, చౌటుప్పల్, పోచంపల్లి మండలాలకు చెందిన ప్రజలు భువనగిరికి వెళ్లడానికి వలిగొండ మీదుగా వెళ్లారు. సాయంత్రం వరద నీరు తగ్గడంతో సంగెం వంతెనపై నుంచి రాకపోకలను అధికారులు అనుమతించారు. మండలంలో మంగళవారం కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు నిలిచి గుంతలు పడ్డాయి. వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
Updated Date - Aug 21 , 2024 | 12:03 AM