ష్..గప్‌చుప్
ABN, Publish Date - May 11 , 2024 | 11:55 PM
ప్రచారానికి తెర.. ప్రలోభాల ఎర
ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు
అగ్రనేతల రాకతో వేడెక్కిన మెతుకుసీమ
ముగ్గురు అభ్యర్థుల్లోనూ గెలుపుపై ధీమా
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, మే11 : లోక్‌సభ ఎన్నికల్లో కీలకమైన ప్రచార ఘట్టం ముగిసింది. దాదాపు నెలరోజుల పాటు నువ్వానేనా అన్నట్లు సాగిన ప్రచారానికి తెరపడడంతో మైకులన్నీ మూగబోయాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా పార్లమెంట్ పరిధిలో అగ్రనేతలు ప్రచారంతో హోరెత్తించారు. దీంతో మెతుకుసీమ రాజకీయం రసవత్తరంగా మారింది. రేపే పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఇక ప్రలోభాలపై దృష్టి పెట్టారు. కులాలు, సంఘాలు, వ్యక్తుల వారీగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
మెదక్ పార్లమెంట్ కంచుకోటను కాపాడుకోవాలని బీఆర్‌ఎస్, ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల కదనరంగంలో హోరాహోరీగా తలపడ్డాయి. రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌ల ద్వారా బీఆర్‌ఎస్ పార్టీ ప్రచారంలో ముందంజలో ఉండగా బీజేపీ, కాంగ్రెస్ సైతం తామేం తక్కువకాదన్నట్లుగా వ్యవహరించాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ప్రచారం ముగిసే వరకు జోరుగా సాగింది.
అగ్రనేతల రాకతో జోష్..
గులాబీ దళానికి పెట్టనికోటగా ఉన్న మెతుకుసీమలో మళ్లీ జెండా ఎగరవేయాలని బీఆర్‌ఎస్ పార్టీ శక్తియుక్తులన్నీ ఒడ్డుతోంది. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ఐదు చోట్లా సభలు, రోడ్‌షోలు నిర్వహించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు తనదైన శైలిలో సుడిగాలిలా పర్యటించి కార్యకర్తల్లో ఉత్తేజం నింపారు. కాంగ్రెస్ అభ్యర్థి కోసం ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మంత్రి కొండా సురేఖలు సభలు, రోడ్‌షోలతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. బీజేపీ తరపున ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని జోష్ నింపారు. ఇటు సభలు, అటు రోడ్‌షోలలో జనసమీకరణతో మూడు పార్టీల అభ్యర్థులు తమ సత్తా చాటారు.
ఎవరి ధీమా వారిదే !
మెదక్ స్థానాన్ని బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఉన్న మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామారెడ్డి తన గెలుపుపై పూర్తి ధీమాతో ఉన్నారు. పేద విద్యార్థులకు రూ.100 కోట్ల నిధితో ట్రస్ట్ ఏర్పాటు, మహిళలకు జీవనోపాధి, యువతకు కోచింగ్ సెంటర్లు, రూ.10లక్షల ప్రమాదభీమా తదితర హామీలతో ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. దీనికితోడు ఆరు నియోజకవర్గాల్లోనూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే ఉండడం తనకు కలిసివస్తుందని భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు బీసీ నినాదంతోపాటు రాష్ట్ర ప్రభుత్వంలోని ఆరు గ్యారంటీలపై ఆశలు పెట్టుకున్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు తనదైన వాగ్దాటితో ప్రచారం చేపట్టారు. కేంద్రంలోని మోదీ చరిష్మాతోపాటు అయోధ్య రామమందిర నిర్మాణం, కేంద్ర పథకాలను వివరిస్తూనే కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లను విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజల్లో తనకు అనుకూలమైన స్పందన కనిపించిందని, తమ గెలుపు పక్కా అంటూ అభ్యర్థులు ఆశిస్తున్నారు. మూడు ప్రధాన పార్టీలు ఈ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకుంటామని ధీమాగా చెబుతున్నాయి.
పోలింగ్ శాతంపై సందిగ్ధత
గడిచిన అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే మెదక్ పార్లమెంటు పరిధిలో సగటున 86 శాతానికి పైగానే ఓటింగ్ నమోదైంది. అయితే 2019 పార్లమెంటు ఎన్నికల్లో కేవలం 71 శాతం నమోదు కాగా.. 2014 ఎన్నికల్లో 77 శాతం పోలింగ్ జరిగింది. అంటే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదుకావడం సహజమే. ఈసారి ఎండలతో పోలింగ్‌పై ప్రభావం ఉంటుందేమోననే సందిగ్ధత నెలకొన్నది. అసెంబ్లీ ఎన్నికల కంటే 10 నుండి 15 శాతం తక్కువగా నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు. చాలా గ్రామాల్లో పార్లమెంటు బరిలో ఉన్న అభ్యర్థుల ముఖాలు ప్రత్యక్షంగా పరిచయం కాలేదు. ప్రచార రథాలు, సోషల్ మీడియా ద్వారానే వారి పేర్లు విన్నారు. ఫోటోలు చూశారు. అంతేగాకుండా స్థానిక, అసెంబ్లీ ఎన్నికల్లో తాయిలాల పంపకం, ప్రలోభాల పర్వం ఉండడం వల్ల ఓటింగ్‌పై ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు కనీసం మందలించేవారు కూడా లేదని పలువురు ఓటర్లు బహిరంగంగానే అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలింగ్ శాతం తగ్గవచ్చనే అంచనా వేస్తున్నారు.
Updated Date - May 11 , 2024 | 11:55 PM