ఇథనాల్ పరిశ్రమ.. ఎవరి ప్రయోజనాల కోసం?
ABN, Publish Date - May 17 , 2024 | 11:22 PM
నమ్మబలికి మమ్మల్ని ఆగం చేస్తుంది
అభిప్రాయ సేకరణ లేకుండా పనులు ఎందుకు చేస్తున్నారు?
నిలదీసిన నర్సింహులపల్లి గ్రామస్థులు
అదనపు కలెక్టర్, గ్రామస్థుల మధ్య వాగ్వాదం
బెజ్జంకి, మే 17 : ‘మా గ్రామంలో ఎవరి ప్రయోజనాల కోసం ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు? పరిశ్రమను స్థాపిస్తే భవిష్యత్ తరాల మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది.. యజామాన్యం నమ్మబలికి మమ్మల్ని ఆగం చేస్తుంది’ అని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివా్‌సరెడ్డి ఎదుట బెజ్జంకి మండలంలోని నర్సింహులపల్లి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజురోజుకూ వివాదాస్పదమవుతున్న ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుపై ఫిర్యాదులు రావడంతో అదనపు కలెక్టర్ శ్రీనివా్‌సరెడ్డి శుక్రవారం గ్రామస్థులతో సమావేశాన్ని నిర్వహించారు. సంబంఽధిత కంపెనీ యజామాన్యం గ్రామస్థులతో మాట్లాడినప్పటికీ వినకపోవడంతో అదనపు కలెక్టర్ చొరవ తీసుకుని మాట్లాడారు. పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ప్రజలకు ప్రయోజనం ఉంటుందని, ప్రభుత్వపరంగా ఇథనాల్ పరిశ్రమకు అనుమతులు లభించాయని తెలిపారు. పరిశ్రమ ఏర్పాటుకు ఎన్ని శాఖల నుంచి అనుమతులు లభించాయని గ్రామస్థులు అదనపు కలెక్టర్‌ను అడిగారు. ప్రజాప్రయోజనాల కోసం ఉపాధి కలుగుతుందంటే పరిశ్రమ ఏర్పాటును స్వాగతిస్తాం కానీ, గ్రామస్థుల అభిప్రాయ సేకరణ లేకుండా పనులను ఎందుకు చేస్తున్నారని ప్రజలు నిలదీశారు. ఇతర ప్రాంతాల్లో ఇథనాల్ పరిశ్రమలు నెలకొల్పారని, కావాలంటే వాటిని చూసి అభ్యంతరాలుంటే చెప్పండని అధికారులు తెలిపారు. ఇంతవరకు తమను ఎందుకు తీసుకెళ్లడం లేదని గ్రామస్థులు మండిపడ్డారు. ఎన్నికల ఉన్న నేపథ్యంలో ఆలస్యమైందని, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే ఇథనాల్ పరిశ్రమ ఉన్న గ్రామానికి తీసుకెళ్తామని అదనపు కలెక్టర్ హామీ ఇచ్చారు. సమావేశం ముగిసిన అనంతరం వెళ్తున్న అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి వాహనాన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు. స్పష్టమైన హమీ ఇవ్వకుండా ఎలా వెళ్తరాని ప్రశ్నించడంతో స్వల్ప ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కారులో నుంచి దిగిన ఆయన మరోసారి గ్రామస్థులకు నచ్చచెప్పారు. ఈ విషయంపై ఉన్నాతాధికారులకు నివేదిక అందిస్తామని తెలిపారు. గ్రామంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ క్రమంలో గ్రామస్థులకు, పోలీసులకు కొంత సేపు వాగ్వాదం జరిగింది. అదనపు కలెక్టర్ జోక్యంతో సద్దుమణిగింది. ఈ సమావేశంలో సిద్దిపేట ఏసీపీ బాలాజీ, రూరల్ సీఐ శ్రీను, బెజ్జంకి ఎస్‌ఐ కృష్ణారెడ్డి, పొల్యూషన్ బోర్డు అధికారి రవీందర్, పరిశ్రమ మేనేజర్ రామృకష్ణ పాల్గొన్నారు.
Updated Date - May 17 , 2024 | 11:22 PM