మియాపూర్-పటాన్‌చెరు రూట్‌లో డబుల్ డెక్కర్
ABN, Publish Date - Jul 14 , 2024 | 11:29 PM
పటాన్‌చెరు, జూలై 14: మెట్రోరైలు ప్రాజెక్టు రెండో దశలో భాగంగా మియాపూర్ నుంచి పటాన్‌చెరు సర్వే పనులు ప్రారంభమయ్యాయి.
13 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి మధ్యలో మెట్రో ట్రాక్
ధార్మిక కట్టడాలు, ఇరుకైన ప్రాంతాల్లో డబుల్ డెక్కర్ ప్రతిపాదనలు
ఎన్‌హెచ్‌ఏఐ, హెచ్‌ఏఎంఎల్ అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన
సిస్ట్రా ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ నిపుణుల ప్రతిపాదన
పటాన్‌చెరు, జూలై 14: మెట్రోరైలు ప్రాజెక్టు రెండో దశలో భాగంగా మియాపూర్ నుంచి పటాన్‌చెరు సర్వే పనులు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్(హెచ్‌ఎఎంఎల్), నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేశారు. ప్రాజెక్టు డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్న సిస్ర్ట్రా ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ నిపుణులు మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు డబుల్ డెక్కర్ విధానాన్ని ప్రతిపాదించారు. ఈ రూట్లో ధార్మిక కట్టడాలు, ఇరుకు రూట్లకు అనుగుణంగా మెరుగైన ఇంజనీరింగ్ పద్ధతులను అనుసరించి, స్థలాభావ పరిస్థితులకు అనుగుణంగా డబుల్ డెక్కర్ డిజైన్ రూపొందించారు. మదీనగూడ నుంచి గంగారం దారిలో, బీహెచ్‌ఈఎల్ చెక్‌పోస్టు నుంచి అశోక్‌నగర్ వరకు ఈ పద్ధతుల్లో డబుల్ డెక్కర్ విధానంలో ట్రాక్‌ను నిర్మించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. కింది వరుసలో జాతీయ రహదారిపై వరుసలో మెట్రోట్రాక్‌ను ఏర్పాటు చేస్తారు. జాతీయ రహదారిపై రవాణాకు ఆటంకం ఏర్పడకుండా పై అంతస్తులో మెట్రోట్రాక్‌ను నిర్మించేందుకు వీలుగా డిజైన్లను సిద్ధం చేస్తున్నారు. భెల్ జంక్షన్‌లో ప్రస్తుతం భారీ ఫ్లై ఓవర్ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై డబుల్ డెకర్ ఫ్లై ఓవర్‌తో పాటు సమీకృత మెట్రోస్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ నిర్మించేలా ఇంజనీర్లు డిజైన్లను సూచిస్తున్నారు. మియాపూర్ టూ పటాన్‌చెరు రూట్లో మెట్రో విస్తరణ డీపీఆర్ సిద్ధం చేస్తున్నామని, డిజైన్లకు తుది మెరుగులు దిద్దుతున్నామని హెచ్‌ఏఎంఎల్ అధికారులు పేర్కొన్నారు. జాతీయ రహదారి రూట్లో మెట్రో రావడంతో పౌర రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. రూ.20వేల కోట్లతో చేపడుతున్న మెట్రో రెండో విస్తరణలో మియాపూర్ పటాన్‌చెరు రూట్‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. పటాన్‌చెరు నుంచి హైదరాబాద్‌కు నిత్యం లక్షలాది మంది ప్రయాణిస్తున్నారు. మెట్రో రాకతో మరింత మెరుగైన రవాణా సౌకర్యం కలగనుంది.
పటాన్‌చెరుకు మెట్రో పరుగులు పెట్టేందుకు కృషి
మెట్రో రైలు ప్రాజెక్టును వేగంగా పూర్తిచేసి పటాన్‌చెరు పారిశ్రామికవాడ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తాం. భవిష్యత్తులో పటాన్‌చెరుతో పాటు సంగారెడ్డి వరకు విస్తరించాలన్న తన ప్రతిపాదనలను అమలు చేసేలా చూస్తున్నాం. కేంద్రం వాటాగా రావాల్సిన నిధులను సకాలంలో అందించేందుకు తోట్పాటునందిస్తాం. మెట్రో రైలుతో పారిశ్రామికవాడ ప్రజలతో పాటు సంగారెడ్డి జిల్లా ప్రజలకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుంది. ఎంపీగా గెలిచిన వెంటనే మొదటిసారిగా మెట్రో అధికారులను కలిసి డీపీఆర్ సిద్ధం చేయాలని విజ్ఞప్తి చేశాను. సత్వరం ప్రాజెక్టు కార్యరూపం దాల్చి పూర్తయ్యేలా నిరంతరం పర్యవేక్షిస్తాను.
- రఘునందన్‌రావు, మెదక్ ఎంపీ
Updated Date - Jul 14 , 2024 | 11:29 PM