డీసీసీబీ చైర్మన్‌గా ఎవరు?
ABN, Publish Date - Aug 17 , 2024 | 11:03 PM
ఉమ్మడి పాలమూరు జిల్లా డీసీసీబీకి కొత్త చైర్మన్ ఎవరు అవుతారనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఈ డీసీసీబీ పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 2020 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. మొత్తం సొసైటీలను అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకుంది.
నిజాంపాషా రాజీనామాతో కొత్త చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ
విష్ణువర్ధన్‌రెడ్డి, వెంకటయ్య, మంజులారెడ్డి పోటీపడుతున్నట్లు సమాచారం
వచ్చే ఏడాది ఫిబ్రవరి 28తో ముగియనున్న ప్రస్తుత పాలకవర్గం గడువు
కొత్త చైర్మన్ ఎన్నిక కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం
మహబూబ్‌నగర్, ఆగష్టు 17(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి పాలమూరు జిల్లా డీసీసీబీకి కొత్త చైర్మన్ ఎవరు అవుతారనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఈ డీసీసీబీ పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 2020 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. మొత్తం సొసైటీలను అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఎన్నికలకు మరో ఆరు నెలలు గడువు ఉంది. డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న చిట్యాల నిజాంపాషా గత నెల చివరి తేదీన తన పదవికి రాజీనామా చేశారు. రెండేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తనకు ఆరోగ్యం సహకరించడం లేదని పదవిని వదులుకున్నారు. ఎప్పుడో ఆయన పదవి నుంచి దిగిపోతాడని ప్రచారం జరిగినప్పటికీ అలాగే నెట్టుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో ఎవరు చైర్మన్ అవుతారనే విషయంలో మాత్రం అందరికీ ఆసక్తి నెలకొంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలన్నీ రైతులకు అనుబంధంగా పని చేస్తాయి. ఇందులో పదవులు ఉన్నవారిలో కూడా మెజారిటీ రైతులేనని చెప్పొచ్చు. ప్రస్తుత చైర్మన్ రాజీనామా చేయగా.. దాని కోసం రాష్ట్ర సహకార శాఖ నుంచి నోటిఫికేషన్ వెలువడితేనే కొత్త చైర్మన్‌ను ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలన్నీ దాదాపు అధికార పార్టీ కనుసన్నల్లోనే పని చేస్తాయి. సభ్యులు, డైరెక్టర్లలో మెజారిటీ బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారే అయినప్పటికీ.. కాంగ్రె్‌సకు సంబంధించిన మంత్రులు, ముఖ్యనాయకుల మద్దతు కోసం పలువురు డైరెక్టర్లు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రయత్నాలు చేస్తున్న వారిలో కొందరు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోగా.. కొందరు మాత్రం బీఆర్‌ఎ్‌సలోనే ఉన్నారు.
రాజీనామా చేసి 17 రోజులు..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు 77 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత కూడా ఇంకా ఉమ్మడిగా కొనసాగుతున్న ఏకైక సంస్థ ఇదేనని చెప్పొచ్చు. జిల్లా పరిషత్‌లు కూడా గత ఎన్నికల సమయంలోనే విభజన కాగా.. కేవలం డీసీసీబీ అలాగే కొనసాగుతోంది. బైలా మార్చడమో లేక చట్టం చేయడమో చేస్తే తప్ప, ఈ విభజన జరిగే అవకాశం లేదు. అయితే 77 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 15 మంది డైరెక్టర్లుగా ఉంటారు. ఇందులో ఏ క్లాస్ డైరెక్టర్లు 12 మంది కాగా.. బీ క్లాస్ డైరెక్టర్లు మరో ముగ్గురు ఉన్నారు. ఏ క్లాస్ డైరెక్టర్లంటే వ్యవసాయ సహకార సంఘానికి చెందిన వారు. బీ క్లాస్ డైరెకర్లు ఇతర సహకార సంఘాలకు చెందిన వారు. వీరికి ఓటు హక్కు ఉంటుంది కానీ.. వారు పోటీలో ఉండటానికి అర్హత ఉండదు. కేవలం ఏ క్లాస్‌లో ఉన్న 12 మంది డైరెక్టర్లు మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో మెజారిటీ పాలక వర్గాలను దక్కించుకున్న బీఆర్‌ఎస్ పార్టీ.. తమ అభ్యర్థిగా చిట్యాల నిజాంపాషాను ఎంపిక చేసి, చైర్మన్‌గా ఎన్నుకుంది. కోరమోని వెంకటయ్యను వైస్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. చైర్మన్ నిజాంపాషా గత నెల 31వ తేదీన తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికి దాదాపు 17 రోజులు అయినప్పటికీ.. ఇంకా కొత్త చైర్మన్ ఎన్నికపై ఎలాంటి దృష్టి సారించలేదు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం కొంతమంది డైరెక్టర్లతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఎన్నికకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో? ఎప్పుడు ఎన్నిక ఉంటుందోనని డైరెక్టర్లు ఎదురుచూస్తున్నారు.
ముగ్గురి మధ్యలో పోటీ..
ఆరు నెలల పదవి కాలానికి గాను.. చైర్మన్ పదవి కోసం ముగ్గురు డీసీసీబీ డైరెక్టర్లు పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురు కూడా నిజాంపాషా ఎన్నిక సమయంలో చైర్మన్ గిరిని ఆశించినవారే కావడం విశేషం. ఆరు నెలలకు ఇది వృథా ప్రయాసే. అయినప్పటికీ.. వచ్చే పాలకవర్గం నాటికి బలంగా తయారై ఎన్నికల్లో మళ్లీ పదవిని పొందొచ్చనే ఆలోచనలో ఉన్నారు. మహబూబ్‌నగర్ పీఏసీఎస్ చైర్మన్ అయిన కోరమోని వెంకటయ్య గతంలోనే చైర్మన్ పదవిని ఆశించారు. అయితే కొన్ని రాజకీయ సమీకరణాలు, మంత్రుల ప్రాబల్యం వల్ల ఆయనకు పదవి దక్కలేదు. వైస్ చైర్మన్ పదవి లభించింది. ఇప్పుడు ఆయన చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. అలాగే వనపర్తి జిల్లా పానగల్ పీఏసీఎస్ అధ్యక్షుడిగా ఉన్న మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి కూడా ఈ పదవిని ఆశిస్తున్నారు. ఆయన కూడా గతంలో సీరియ్‌సగా ప్రయత్నించారు. జూపల్లి కృష్ణారావు నియోజకవర్గమే అయినప్పటికీ వారిద్దరి మధ్య పలుమార్లు విభేదాలు, పలు సందర్భాల్లో స్నేహ సంబంధాలు ఉన్నాయి. మరి ప్రస్తుత పరిస్థితి ఏంటి? పోటీలో ఉంటే మంత్రి సహకరిస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరో పోటీదారు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని మేకగూడ పీఏసీఎస్ చైర్‌పర్సన్ కంకటి మంజులారెడ్డి అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె పోటీ పడుతున్నప్పటికీ.. ఆమెకు ఎంత మంది డైరెక్టర్లు మద్దతు ఇస్తారో వేచిచూడాలి. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఈ డీసీసీబీకి సంబంధించిన పీఏసీఎ్‌సలు తక్కువగానే ఉన్నాయి. మహబూబ్‌నగర్ నుంచి విభజన అయిన తర్వాత సంబంధాలు కూడా బాగా దెబ్బతిన్నాయి. మరి ఆమె డైరెక్టర్ల మద్దతు ఎలా కూడగడతారో వేచి చూడాలి. మొత్తం 15 మంది డైరెక్టర్లలో 12 మందికి పోటీ అవకాశం ఉండగా.. అందరికీ ఓటు వినియోగించుకోవచ్చు. అధికారికంగా బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రె స్‌లో చేరినవారు ఇప్పటివరకు ముగ్గురే కావడం విశేషం.
Updated Date - Aug 17 , 2024 | 11:03 PM