అత్త భూమి అమ్మొద్దని పెట్రోల్ పోసుకున్న అల్లుడు
ABN, Publish Date - Aug 21 , 2024 | 11:23 PM
తనకు తెలియకుండా అత్త భూమిని అమ్ముకుంటుందని ఓ అల్లుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా మహ్మదాబాద్‌లో జరిగింది.
మహమ్మదాబాద్, ఆగస్టు 21 : తనకు తెలియకుండా అత్త భూమిని అమ్ముకుంటుందని ఓ అల్లుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా మహ్మదాబాద్‌లో జరిగింది. మండల పరిధిలోని వెంకట్‌రెడ్డిపల్లి గ్రామానికి చెందిన నాగిరెడ్డి, అంజిలమ్మ దంపతులకు ఓ కుమార్తె రాఘవేంద్రమ్మ ఉన్నది. మగ పిల్లలు లేకపోవడంతో మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన నర్సింహారెడ్డిని 15 ఏళ్ళ కిందట ఇల్లరికం తెచ్చుకొని రాఘవేంద్రమ్మతో వివాహం జరిపించారు. వారంతా మహమ్మదాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఆరు నెలల కిందట అనార్యోగంతో రాఘవేంద్రమ్మ మృతి చెందింది. దీంతో అత్త అంజిలమ్మ తన పేరున ఉన్న ఎకరం 30 గుంటల భూమిని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి రూ. 84 లక్షలకు అమ్మింది. ఈ మేరకు బుధవారం రిజిస్ట్రేషన్ కోసం అంజిలమ్మ, కొనుగోలుదారులు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అల్లుడు నరసింహారెడ్డి అక్కడకు వచ్చి వారికి రిజిస్ట్రేషన్ చేయొద్దని, భూమి లేకుంటే తాను ఎలా బతకాలని బతిమిలాడాడు. కానీ, వారు తమ బిడ్డనే చనిపోయిందని, నీవు మాకేమవసరమని ప్రశ్నించారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి లోనైన నర్సింహారెడ్డి బాటిల్‌లో తనవెంట తెచ్చుకున్న పెట్రోల్, అగ్గిపెట్టెతో తహసీల్దార్ చాంబర్‌లోకి చొరబడి తహసీల్దార్ ముందుకు వెళ్లి ఈ రిజిస్ట్రేషన్ చేయొద్దని గట్టిగా అరుస్తూ వం టిపై పెట్రోల్ పోసుకున్నాడు. అగ్గి పెట్టెతో అంటించుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే అక్కడ ఉన్న వారంతా అప్రమత్తమై అతన్ని కార్యాలయం బయటకు తీసుకెళ్లారు. తహసీల్దార్ తిరుపతయ్య సమాచారం మేరకు పోలీసులు అతన్ని స్టేషన్‌కు తరలించారు. భూమి రిజిస్ట్రేషన్‌ను నిలిపివేశారు.
Updated Date - Aug 21 , 2024 | 11:23 PM