జీవోలే కాదు.. పనులూ చేస్తాం
ABN, Publish Date - Jul 15 , 2024 | 10:48 PM
జీవోలు కావాలంటే ఎన్నైనా ఇవ్వొచ్చని, జీవోలు ఇవ్వడమే కాదు, టెండర్లు పూర్తయిన వెంటనే పనులు ప్రారంభిస్తూ శంకుస్థాపనలు చేయడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ విధానమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.
టెండర్లు పూర్తయిన తర్వాతే శంకుస్థాపనలు చేయడమే మా విధానం
వెనుకబడిన మహబూబ్‌నగర్- నల్గొండ జిల్లాలను అభివృద్ధి చేస్తాం
బైపా్‌సతో జడ్చర్ల, భూత్పూరు, పాలమూరు ట్రైసిటీలుగా అభివృద్ధి
పీయూలో ఉద్యోగాల భర్తీ, వైస్ ఛాన్సలర్ కూడా త్వరలో నియామకం
జడ్చర్ల పర్యటనలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
జడ్చర్లలో రూ.133 కోట్లతో రోడ్లకు శ్రీకారం చుట్టి, పనులు ప్రారంభం
మహబూబ్‌నగర్, జూలై 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జీవోలు కావాలంటే ఎన్నైనా ఇవ్వొచ్చని, జీవోలు ఇవ్వడమే కాదు, టెండర్లు పూర్తయిన వెంటనే పనులు ప్రారంభిస్తూ శంకుస్థాపనలు చేయడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ విధానమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. జడ్చర్ల నియోజకవర్గంలో రూ. 133 కోట్లతో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వచ్చిన ఆయన జడ్చర్లలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జడ్చర్లలో పనులను కూడా మిషన్లు దించిన తర్వాతే ప్రారంభించామని చెప్పారు. త్వరలో దేవరకద్ర నియోజకవర్గంలో రూ. 150 కోట్లతో చేపట్టబోయే పనులకు కూడా ఇదేవిధానం అమలు చేస్తామన్నారు. వెనుకబాటులో ఉన్న పాలమూరు- నల్గొండ జిల్లాలను అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో కృషి చేస్తున్నామని చెప్పారు. రీజనల్ రింగ్‌రోడ్డుకు 20 కిలోమీటర్ల దూరంలోనే జడ్చర్ల ఉన్నదని, పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు చాలా అవకాశాలున్నాయన్నారు. మహబూబ్‌నగర్, భూత్పూరు, జడ్చర్ల బైపాస్ ద్వారా ట్రై సిటీలుగా మారతాయని అన్నారు. పీయూలో ఉద్యోగాలను భర్తీ చేస్తామని, త్వరలో వీసీ నియామకం పూర్తవుతుందని అన్నారు. హైదరాబాద్- బెంగళూరు హైవేను గ్రీన్ ఫీల్డ్‌గా మార్చి 12 లైన్లుగా విస్తరించబోతున్నామని, దీనికి సంబంధించిన డీపీఆర్ కూడా సిద్ధం అవుతోందన్నారు.
త్వరలో ఇందిరమ్మ ఇళ్లకు నిధులు
త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ. 5 లక్షలు ఇచ్చి పేదల సొంత ఇంటి కలను నెరవేరుస్తామన్నారు. పదేళ్లు బీఆర్‌ఎస్ ప్రభుత్వం స్కిల్ డెవల్‌పమెంట్ సెంటర్ల ఆలోచన చేయలేదని, తాము స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కేటీఆర్ విదేశాలు తిరిగి వచ్చి ఇక్కడ అభివృద్ధి చేశామంటున్నారని, కానీ ఆ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చేసిన పనులే కారణమన్నారు. త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం ప్రారంభవుతుందని, దానికి చేరువలో ఉన్న పాలమూరు జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. స్థానిక ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్మన్లు, హైదరాబాద్ మేయర్‌తో సహా కాంగ్రెస్ గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రె్‌సకే పాలించే హక్కు ఉన్నదన్నారు. మహబూబ్‌నగర్ స్కిల్ సెంటర్‌కు రూ. 10 కోట్లు ఇచ్చామని, అవసరమైతే మరో రూ. 10 కోట్లు ఇస్తామన్నారు. బీఆర్‌ఎస్ విమర్శలు చేస్తుంటే ప్రజలు పదేళ్లు ఏం చేశారని నవ్వుకుంటున్నారని అన్నారు. జడ్చర్లలో ఆసుపత్రి కట్టి సిబ్బందిని నియమించకపోతే తాళం వేసి ఉన్నదని, తాను కమిషనర్ కర్ణన్‌తో మాట్లాడానని, 15 రోజుల్లో డాక్టర్లు, సిబ్బంది నియామకం పూర్తయి, ఆసుపత్రి ప్రారంభవుతుందని చెప్పారు.
8 నెలల్లో రూ. 133 కోట్లు నిధులు : అనిరుధ్‌రెడ్డి
మూడేళ్ల క్రితం రోడ్ల కోసం పాదయత్ర చేస్తుంటే గత పాలకులు నవ్వారని, జీవోలు తెచ్చారు కానీ రోడ్లు వేయలేదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి విమర్శించారు. తాము ఎనిమిది నెలల్లోనే రూ. 133 కోట్లు తీసుకువచ్చామని, పదేళ్లలో బీఆర్‌ఎస్ రూ. 120 కోట్లు ఇచ్చిందన్నారు. 100 పడకల ఆస్పత్రి అని చెప్పి 30 పడకల ఆస్పత్రి కట్టారని, అందులో ఫర్నిచర్, వైద్యులు లేరన్నారు. అభివృద్ధిలో జడ్చర్లను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దమే లక్ష్యమన్నారు. ఇప్పటికే ఐదు సబ్ స్టేషన్లను మంజూరు చేశామని, జడ్చర్ల, కల్లూరు వద్ద 133 కేవీ సబ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామన్నారు. జడ్చర్ల బైపాస్ కోసం డీపీఆర్‌కు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.
సంకల్పం ఉంటే నిధులు వస్తాయి : యెన్నం
రోడ్లు, భవనాల విషయంలో మహబూబ్‌నగర్ అభివృద్ధిలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహకరిస్తున్నారని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. గతంలో ఇక్కడ ఇన్‌చార్జి మంత్రిగా పనిచేశారని, కోరిన వెంటనే నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. జిల్లాకు ప్రతినెలా వచ్చి అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న జాతీయ రహదారిని 12 లేన్లుగా, శ్రీశైలం దారిని ఆరు లేన్లుగా, రాయిచూర్ రహదారిని గ్రీన్‌ఫీల్డ్‌గా మార్చేందుకు కృషి చేయాలని కోరారు. ఆర్‌ఓబీ అవసరమని అడిగితే వెంటనే నిధులు మంజూరు చేశారని చెప్పారు. సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ పాల్గొన్నారు.
Updated Date - Jul 15 , 2024 | 10:48 PM