ఘనంగా నీలకంఠ స్వామి ఉత్సవాలు
ABN, Publish Date - Sep 02 , 2024 | 11:17 PM
పట్టణంలోని కురిహీనిశెట్టి జాండ్ర సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన నీలకంఠ స్వామి ఉత్సవాలు కనుల పండువగా కొనసాగాయి.
కోస్గి, నారాయణపేట న్యూటౌన్, సెప్టెంబరు 2 : పట్టణంలోని కురిహీనిశెట్టి జాండ్ర సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన నీలకంఠ స్వామి ఉత్సవాలు కనుల పండువగా కొనసాగాయి. శ్రావణమాస చివరి సోమవారం పురస్కరించుకొని పట్టణంలోని రామాలయం శివాజీ కూడలి మీదుగా మహిళల బోనాలు, కళాకారుల విన్యాసాలతో పల్లకీ సేవ సాగింది. అదే విధంగా మండలంలోని ముంగిమళ్ల రామలింగేశ్వరుని ఆలయానికి గ్రామం నుంచి ఉత్సవ మూర్తిని పల్లకీ సేవగా ఆలయానికి తీసుకొచ్చారు. కాగా శుక్రవారం జాతర ఉత్సవాలు నిర్వహించనున్నారు. అమావాస్య కావడంతో గ్రామంలోని తిమ్మన్నబావి, దండ్రోత్రి ఆంజనేయస్వామి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. నారాయణపేట పట్టణంలోని బారంబావి నీలకంఠ స్వామి ఆలయంలో కురీహినిశెట్టి జాండ్ర సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రత్నమాల, బాల్‌రాజ్, చంద్రశేఖర్, నర్సిములు, చంద్రకాంత్, సాయికుమార్, ప్రశాంత్ పాల్గొన్నారు. అదే విధంగా పరిమాళపురం నీలకంఠ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం పల్లకీ సేవ నిర్వహించారు. కాగా పళ్ల ఉమమహేశ్వర ఆలయంలో శివ లింగానికి దద్దోజనంతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Updated Date - Sep 02 , 2024 | 11:17 PM