కేంద్ర బడ్జెట్‌ను సవరించాలి
ABN, Publish Date - Jul 31 , 2024 | 10:55 PM
రైతాంగాన్ని మోసగించిన కేంద్ర బడ్జెట్‌ను సవరించి వ్యవసాయానికి అధిక నిధులు కేటాయించాలని కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు.
- వ్యవసాయానికి అధిక నిధులు కేటాయించాలి
- కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ ప్రతులను దహనం
నారాయణపేట, జూలై 31 : రైతాంగాన్ని మోసగించిన కేంద్ర బడ్జెట్‌ను సవరించి వ్యవసాయానికి అధిక నిధులు కేటాయించాలని కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం నారాయణపేట నర్సిరెడ్డి చౌరస్తాలో కేంద్ర బడ్జెట్ పత్రులను దహనం చేశారు. అఖిలభారత ప్రగతి శీల రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.యాదగిరి, సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామారెడ్డి, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ డివిజన్ కార్యదర్శి కాశీనాథ్ మాట్లాడుతూ మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌లో రైతులు, కార్మికులు, నిరుద్యోగులను నిరాశ పరిచిందన్నారు. కార్పొరేట్ పెత్తందార్లకు దోచి పెట్టేలా ఉందని ఆరోపించారు. కార్యక్రమంలో అంజిలయ్య గౌడ్, ప్రశాంత్, వెంకట్రాములు, శివకుమార్, అంజి, నరహరి పాల్గొన్నారు.
మక్తల్ : కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ బుధవారం అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నాయకులు స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో కేంద్ర బడ్జెట్ ప్రతులు దహనం చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు భగవంతు, సీపీఐ(ఎంఎల్) జిల్లా నాయకుడు కిరణ్ మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి నిధులు తగ్గించడం దారుణం అన్నారు. స్వామినాథన్ సిఫార్సు ప్రకారం 32 ఫార్ములా ఏర్పాటు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. ఐఎఫ్‌టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఏజీ బుట్టో, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్, ఈశ్వర్ పాల్గొన్నారు.
Updated Date - Jul 31 , 2024 | 10:55 PM