పత్తాలేని ఫీజు రీయింబర్స్‌మెంట్
ABN, Publish Date - Aug 21 , 2024 | 01:13 AM
మూడేళ్ళుగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయా కళాశాలల యాజమాన్యాలు ఫీజు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఫీజు నిధులు విడుదల కాగానే తిరిగి డబ్బు వాపసు ఇస్తామని అంటున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
మూడేళ్ళుగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయా కళాశాలల యాజమాన్యాలు ఫీజు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఫీజు నిధులు విడుదల కాగానే తిరిగి డబ్బు వాపసు ఇస్తామని అంటున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.
ఫ రూ. 171.13 కోట్ల బకాయిలు
జిల్లాలో 2021-22 నుంచి 2023-24 వరకు మూడు సంవత్సరాల్లో 171.13 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. బీసీ సంక్షేమ శాఖ ద్వారా బీసీ విద్యార్థులకు రావలసిన బకాయిలు 131.35 కోట్లు ఉన్నాయి. ఈ బకాయిలు ఇలా ఉండగానే కొత్తగా చేరుతున్న విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేసుకుంటున్నారు. బీసీ సంక్షేమ శాఖలోనే స్కాలర్‌షిప్ కోసం గత మూడేళ్లలో 1,35,000 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా వీరికి 118.4 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డాయి. ఈబీసీ కేటగిరీ కింద ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం 6,984 మంది దరఖాస్తు చేసుకోగా వీరికి 12.95 కోట్ల రూపాయలు మంజూరు కావలసి ఉంది. బీసీ విద్యార్థులకు 131.35 కోట్లు రావలసి ఉండగా, ఎస్సీ సంక్షేమశాఖలో దరఖాస్తు చేసుకున్న 11,075 మంది విద్యార్థులకు 30.28 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉన్నది. ఎస్టీ సంక్షేమ శాఖలో 4,700 మంది విద్యార్థులకు 7.5 కోట్లు, మైనార్టీ సంక్షేమశాఖలో ఐదు వేల మంది విద్యార్థులకు ఎనిమిది కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నది. మూడేళ్ల బకాయిలు ఉన్నా రెండేళ్లకు సంబంధించిన బకాయిల్లో సగం శాతం నిధులు మాత్రమే ఆయా కళాశాలలకు విడుదల చేసినట్లు సమాచారం. 50 శాతం రెండేళ్ల బకాయిలు, ఒక సంవత్సరం మొత్తం బకాయిలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించి, పాఠశాలలు, కళాశాలలు నడిపించడం కష్టంగా మారిందని ప్రైవేట్ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఫ సర్టిఫికెట్ల అందక ఇబ్బందులు
సగం శాతం నిధులు విడుదల అయినట్లు పేర్కొని ఏడాది కావస్తున్నా విద్యార్థుల ఖాతాల్లో మాత్రం ఆ నిధులు జమ కాలేదు. దీంతో విద్యార్థులు, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులకు గురుతున్నారు. విద్యను పూర్తిచేసుకొని సర్టిఫికెట్ తీసుకోవలసిన విద్యార్థులకు ఈ బకాయిలు తప్పకుండా చెల్లించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతున్నది. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు రాక పోవడంతో ఆ డబ్బు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని, ప్రభుత్వం నుంచి నిధులు రాగానే చెల్లించిన డబ్బు వాపసు చేస్తామని యాజమాన్యాలు చెబుతున్నట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం విద్యాసంస్థల జేఏసీ ఆందోళనకు దిగేందుకు సిద్ధమై ప్రభుత్వానికి నోటీసులు కూడా అందజేసింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే ఫస్ట్ యర్ విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయాలని టీజేఏసీ ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలకు పిలుపునిచ్చింది. ప్రభుత్వం వెంటనే ఈ నిధుల చెల్లింపుపై దృష్టిసారించి తమ చదువులకు ఆటంకం లేకుండా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు.
Updated Date - Aug 21 , 2024 | 01:13 AM