వలస కార్మికులకు రేషన్
ABN, Publish Date - Aug 21 , 2024 | 01:11 AM
ఉపాధిని వెతక్కుంటూ జిల్లాకు వలసవచ్చిన అంతర్‌రాష్ట్ర కూలీలు చాలా మంది ఇక్కడే స్థిరపడ్డారు. వీరిలో చాలా మందికి రేషన్‌కార్డులు ఉన్నా ఈ-కేవైసీ లేకపోవడంతో రేషన్ రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తెల్లరేషన్ కార్డు కలిగిన వలస కూలీలు ఈ-కేవైసీ చేసుకునే వీలు కల్పించింది. తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఈ-కేవైసీ పక్రియ గత సంవత్సరం సెప్టెంబరు నుంచి ఫిబ్రవరి వరకు కొనసాగించారు. ఇందులో ఇతరరాష్ట్రాల నుంచి వలస వచ్చిన కూలీలు ఈ కేవైసీ చేసు కోలేదు.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
ఉపాధిని వెతక్కుంటూ జిల్లాకు వలసవచ్చిన అంతర్‌రాష్ట్ర కూలీలు చాలా మంది ఇక్కడే స్థిరపడ్డారు. వీరిలో చాలా మందికి రేషన్‌కార్డులు ఉన్నా ఈ-కేవైసీ లేకపోవడంతో రేషన్ రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తెల్లరేషన్ కార్డు కలిగిన వలస కూలీలు ఈ-కేవైసీ చేసుకునే వీలు కల్పించింది. తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఈ-కేవైసీ పక్రియ గత సంవత్సరం సెప్టెంబరు నుంచి ఫిబ్రవరి వరకు కొనసాగించారు. ఇందులో ఇతరరాష్ట్రాల నుంచి వలస వచ్చిన కూలీలు ఈ కేవైసీ చేసు కోలేదు. ఈ-కేవైసీ నుంచి అవగాహన లేకపోవడం, తరచూ ఒక ఊరి నుంచి మరొక ఊరికి మారిన క్రమంలో ఈ పక్రియ పూర్తి కాలేదు. ఈ పరిస్థితుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు వలస వచ్చిన ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌కు సం బంధించి రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో కార్మికులు వలస వస్తున్నారు. దాదాపు 15 వేల నుంచి 20 వేల వరకు వలస కార్మికులే ఉన్నారు. ఇందు లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల వారు ఎక్కువగా ఇక్కడే స్థిరప డ్డారు. రేషన్ కార్డులు పొందారు. వీరికి ఈ కేవైసీ చేసుకోవడానికి రేషన్ కార్డు లింకేజీలో అధార్ కార్డు, రేషన్ కార్డు చిరునామాల్లో తేడాలు ఉండ డంతో ఈ కేవైసీ కాలేదు. ఈ సారి ప్రత్యేక పోర్టల్ ద్వారా రేషన్ డీలర్ నుంచి ఈ కేవైసీ చేసుకునే వీలు కల్పించారు. ఈ నెల 12న ప్రభుత్వం మార్గదర్శకాలను పౌరసరఫరాల శాఖ అధికారులకు అందాయి. దీనికి సంబంధించిన పక్రియను ప్రారంభించే దిశగా తహసీల్దార్‌ల ద్వారా రేషన్‌డీలర్లకు చేరే విధంగా చర్యలు చేపట్టారు. త్వరలోనే ఈ కేవైసీ పక్రియ ప్రారంభం కానుంది.
వలస కార్మికులకు రేషన్ కార్డులు
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వస్త్ర పరిశ్రమను నమ్ముకుని తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి వలసవచ్చిన వారు ఉండగా ఇతర రాష్ట్రాల నుంచి భవన నిర్మాణ కార్మికులు, కాంట్రాక్ట్ పనులకు, ఇటుక బట్టీలతో పాటు ఇటీవల వ్యవసాయ పనులకు కూడా కార్మికులు పెద్దసంఖ్యలోనే వలస వస్తున్నారు. సంవత్సరాల తరబడి ఇక్కడే ఉండిపోతున్నా వారిలో రేషన్ కార్డులు పొందని వారు ఉన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు వలస కార్మిక కుటుంబాలకు కూడా రేషన్ కార్డులు ఇవ్వాలనే అదేశాలు జారీ చేసంది. ఈ క్రమంలో జిల్లాలో వలస కుటుంబాలకు సంబంధించి సర్వే నిర్వహించారు. వారి వద్ద నుంచి రేషన్‌కార్డుల కోసం 1,655 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులు పరిశీలించి 786 మంది కార్మికులకు కార్డులు ఇచ్చే విధంగా ప్రభుత్వానికి నివేదిక పంపారు. 869 దరఖాస్తులను తిరస్కరించారు. జిల్లాలో వలస కుటుంబాల నుంచి వచ్చిన దరఖాస్తుల్లో బోయినపల్లిలో 135 దరఖాస్తులు, చందుర్తిలో 67, గంభీరావుపేటలో 97, ఇల్లంతకుంటలో 240, కోనరావుపేటలో 125, ముస్తాబాద్‌లో 96, రుద్రంగిలో 38, తంగళ్లపల్లిలో 143, వీర్నపల్లిలో 23, వేములవాడ అర్భన్‌లో 144, వేములవాడ రూరల్‌లో 63, సిరిసిల్లలో 326, ఎల్లారెడ్డిపేటలో 133 దరఖాస్తులు వచ్చాయి. కరీంనగర్, సిద్ధిపేటకు సం బంధించి 25 దరఖాస్తులు జిల్లాకు పంపించారు. వీటిలో 786 మంది రేషన్‌కార్డులు అందించే పక్రియకు పరిశీలన జరుగుతోంది.
జిల్లాలో 80.19 శాతం ఈ-కేవైసీ పూర్తి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,73,743 రేషన్ కార్డులు ఉండగా 4,97,081 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో అంత్యోదయ అన్నయోజన కార్డులు 13,724 ఉండగా 36,645 మంది లబ్ధిదారులు ఉన్నారు. అహార భద్రత కార్డులు 1,59,812 కార్డులు ఉండగా 46,0226 మంది లబ్ధిదారులు, 207 అన్నపూర్ణ కార్డులు ఉండగా 210 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి సంబంధించి గత సంవత్సరం సెప్టెంబరు నుంచి ఫిబ్రవరి వరకు ఈ కేవైసీ పక్రియను నిర్వహించారు. జిల్లాలోని 345 రేషన్ దుకాణాల ద్వారా 80.19 శాతం ఈ కేవైసీ పక్రియను పూర్తి చేశారు.
Updated Date - Aug 21 , 2024 | 01:11 AM