ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వాన.. వరద

ABN, Publish Date - Sep 02 , 2024 | 12:51 AM

జిల్లావ్యాప్తంగా రెండు రోజుల నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది.

జలమయమైన నగరంలోని ప్రధాన రహదారి

- జిల్లా వ్యాప్తం భారీ వర్షం

- పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు

- నీటమునిగిన పంట పొలాలు

- అలుగుపారుతున్న చెరువులు, కుంటలు

- నేలకూలిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

- మరో 24 గంటలపాటు భారీ వర్షసూచన

- ఎల్లో అలర్ట్‌ జారీ చేసిన వాతావరణశాఖ

- కూలిన పాత ఇళ్ళు...ఇళ్ళలోకి చేరిన వరద నీరు

- అంబాలాపూర్‌ ఊరచెరువుకు గండి

కరీంనగర్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లావ్యాప్తంగా రెండు రోజుల నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. వచ్చే 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటూ వాతావరణశాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. లోయర్‌ మానేరు డ్యాంతోపాటు చెరువులు, కుంటలకు జలకళ సంతరించుకుంది. ఎల్‌ఎండికి మిడ్‌మానేరు, మోయతుమ్మెద వాగునుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. శంకరపట్నం మండలం అంబాలాపూర్‌ గ్రామంలో ఊర చెరువుకు గండిపడడంతో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జిల్లా కేంద్రంతోపాటు పట్టణాలు, మండల కేంద్రాలతోపాటు గ్రామాల్లో వరద నీరు రోడ్లపైకి వచ్చి చేరాయి. కొన్ని చోట్ల ఇళ్లలోకి నీరు రావడంతో ప్రజలు ఇబ్బందులుపడ్డారు. చెట్లు, చెట్ల కొమ్మలకు విరిగి పడటంతోపాటు రోడ్లపైకి భారీగా వరదనీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. విద్యుత్‌ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పలుచోట్ల శిథిలావస్థకు చేరిన పాత భవనాలు, ఇళ్లు, పూరి గుడిసెలు కూలిపోయాయి.

ఫ రోడ్లపైకి వరద నీరు

జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌, పోలీస్‌ హెడ్‌కార్వర్టర్స్‌ కార్యాలయం ఎదుట, కరీంనగర్‌-హైదరాబాద్‌ హైవేలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద, రాంనగర్‌, మంకమ్మతోట, ముకరంపుర, శర్మనగర్‌, అల్కాపురికాలనీ, ఆర్టీసీ వర్క్‌షాపు, మంచిర్యాల చౌరస్తా, శర్మనగర్‌, ఆటోనగర్‌, లక్ష్మినగర్‌, హన్మాన్‌నగర్‌, కట్టరాంపూర్‌, సాలంపుర, శ్రీహరినగర్‌, పద్మనగర్‌, దుర్గానగర్‌ తదితర ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. ఆయా ప్రాంతాలవాసులు ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. నగరపాలక సంస్థ, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగి వరదనీటిని మళ్లించడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. జమ్మికుంట మున్సిపల్‌ పరిధిలోని హౌసింగ్‌బోర్డుకాలనీలోకి భారీగా వరద నీరు చేరి ఇళ్లలోకి నీరు రావడంతో కాలనీవాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మున్సిపల్‌ సిబ్బంది నీటిని మళ్లించే చర్యలు చేపట్టారు. కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని తీగలగుట్టపల్లి రైల్వే బ్రిడ్జి సమీపంతోపాటు పలు కాలనీలు వరద నీటిలో మునిగాయి. తిమ్మాపూర్‌ మండలం రేకొండలో దున్నపోతుల పోచయ్య అనే వ్యక్తి ఇల్లు కూలింది. రాంహన్మాన్‌నగర్‌-పచ్చునూర్‌ గ్రామాల మధ్యగల రోడ్డుపై భారీగా వరద నీరు ప్రవహించడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చిగురుమామిడి మండలంలోని ఒగులాపూర్‌ గ్రామంలో అనేక ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో వస్తువులు నీటి మునిగాయని బాధితులు వాపోయారు. మానకొండూర్‌ మండలంలోని పలు గ్రామాలతోపాటు, చిగురుమిడి మండలం కొండాపూర్‌ గ్రామంలో వరి పొలాలు నీట మునగడంతో వీణవంక మండలంలోని వీణవంక, ఎల్బాక, మామిడాలపల్లి, నర్సింగాపూర్‌ గ్రామాల్లోని చెరువులు, కుంటలు అలుగుపారాయి. వీణవంక, నర్సింగాపూర్‌ గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదకరంగా మారడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. సైదాపూర్‌ మండల కేంద్రంలోని పాత బస్టాండ్‌ వద్ద రోడ్డుపై భారీగా వర్షపునీరు నిలవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. శంకరపట్నం మండల కేంద్రంలోని అంబాలాపూర్‌ ఊర చెరువుకు గండి పడింది. అరకండ్లలో లోలెవల్‌ బ్రిడ్జిపై నుంచి ఉధృతంగా వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ముత్తారం చెరువు అలుగుపారింది. కన్నాపూర్‌ శివారులో పంట పొలాలు నీటమునిగాయి. సైదాపూర్‌ మండలంలోని నాల్‌ చెరువు మత్తడి దూకింది. సైదాపూర్‌ లోలెవల్‌ బ్రిడ్జి గుంతల్లో ఆటో ఇరుక్కుపోవడంతో గ్రామానికి చెందిన యువకులు దాన్ని బయటకు పంపించారు. చొప్పందండి మండలంలో పంది వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆర్నకొండ-రాగంపేట గ్రామాల మధ్య రాక పోకలు నిలిచిపోయాయి. రామడుగు మండలంలోని గుండి ఊరచెరువు మత్తడి దూకడంతో గుండి-లక్ష్మిపూర్‌ రహదారి మధ్యలో దెబ్బతినడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గంగాధర మండలంలో నారాయణపూర్‌ చెరువు అలుగుపారడంతో లక్ష్మిదేవిపల్లి బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో గంగాధర, పెగడపల్లి మండలాల రాకపోకలు నిలిచి పోయాయి.

ఫ జిల్లాలో దంచికొట్టిన వాన

జిల్లాలో శనివారం ఉదయం 8.30 గంటల నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు 110.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సైదాపూర్‌ మండలంలో 132.6 మి.మీ వర్షం కురిసింది. జిల్లాలో ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటలవరకు భారీ వర్షం పడింది. ఎనిమిది గంటల వ్యవధిలో సగటు 41.4 మిల్లీమీట్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చిగురుమామిడి మండలంలో 93.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. చొప్పదండి మండలం వెదురుగట్టులో 91.8, తిమ్మాపూర్‌ మండలం నుస్తులాపూర్‌, మానకొండూర్‌ మండలం ఈదుగట్టపల్లిలో 79, ఇందుర్తిలో 71.3, రామడుగు మండలం గుండిలో 57, సైదాపూర్‌ మండలం వెంకపల్లిలో 56.3, చొప్పదండి మండలం ఆర్నకొండలో 54.8, గంగాధర మండల కేంద్రంలో 50, కొత్తపల్లి మండలం ఆసీఫ్‌నగర్‌లో 49.5, జమ్మికుంట మండలంలో 48.0, గన్నేరువరం మండలం కాసీంపేటలో 46.8, హుజురాబాద్‌ మండలం బోర్నపల్లిలో 45.5, కరీంనగర్‌లో 31.8, శంకరపట్నం మండలం కొత్తగట్టులో 30.5, కరీంనగర్‌ రూరల్‌ మండలం దుర్శేడ్‌లో 24., ఇల్లందకుంట మండలం మల్యాలలో 11.3, వీణవంక మండలంలో 3.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

ఫ అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దు : మంత్రి ‘పొన్నం’

జిల్లాలో భారీ వర్షాలు వర్షాలు కురుస్తున్నందున ప్రజలు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారన్నారు. ప్రజల రక్షణ కోసం అధికారయంత్రాంగం నిరంతరం శ్రమిస్తోందని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆయన విజ్ఞప్తిచేశారు. భారీ వర్షాలకు సంబంధించి బాధితుల సహాయం కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని, టోల్‌ ఫ్రీ నంబర్‌ 8782997247తోపాటు వాట్సాప్‌ నంబర్‌ 8125184683లో సంప్రదించవచ్చన్నారు. 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటారని మంత్రి పొన్నం తెలిపారు.

Updated Date - Sep 02 , 2024 | 12:52 AM

Advertising
Advertising