గురుకులాల్లో దళారుల దందా
ABN, Publish Date - Jun 15 , 2024 | 01:00 AM
పలు ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లో దళారులు ప్రవేశించి అడ్మిషన్ల దందా చేస్తున్నారని తెలుస్తున్నది. ఆయా గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు ప్రవేశాలకు సంబంధించి ఉన్న నిబంధనల లొసుగులను ఆధారం చేసుకుని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేసి వారి పిల్లలను గురుకులాల్లో చేర్పిస్తున్నట్లు సమాచారం.
- ఎస్సీ, బీసీ గురుకులాల్లో సీట్లు రాని వారికి గాలం
- మైనార్టీ గురుకులాల్లో చేర్పించేందుకు యత్నాలు
- ప్రవేశాలు కల్పించేందుకు డబ్బు వసూలు?
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
పలు ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లో దళారులు ప్రవేశించి అడ్మిషన్ల దందా చేస్తున్నారని తెలుస్తున్నది. ఆయా గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు ప్రవేశాలకు సంబంధించి ఉన్న నిబంధనల లొసుగులను ఆధారం చేసుకుని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేసి వారి పిల్లలను గురుకులాల్లో చేర్పిస్తున్నట్లు సమాచారం. ఈ వ్వవహారం మైనార్టీ గురుకుల విద్యాలయాల్లో సాగుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఎస్సీ, బీసీ గురుకులాల్లో సీట్లు రాని వారికి దళారులు గాలం వేస్తున్నట్లు తెలస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల విద్యాలయాలకు సంబంధించి 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. వారికి వచ్చే మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. విద్యార్థులు ముందుగా సూచించిన నాలుగైదు గురుకులాల్లో మార్కులను బట్టి ఆ విద్యాలయాన్ని కేటాయిస్తారు. ప్రవేశాలు పొందిన తర్వాత ఎవరైనా డ్రాపవుట్ అయితే ఆ తర్వాత మెరిట్‌లో ఉన్నవారికి అవకాశం కల్పిస్తున్నారు. ఇలా రెండు, మూడు జాబితాలు పూర్తయిన తర్వాత కూడా ఎక్కడైనా సీట్లు మిగిలితే వాటిని భర్తీ చేసే అవకాశం ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆ ప్రిన్సిపాళ్లకు అధికారం అప్పగిస్తున్నారు. వాళ్లు ప్రవేశపరీక్ష రాసిన విద్యార్థులకే సీట్లు ఇస్తుండగా, అక్కడక్కడ పైరవీలు చేసే వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తున్నది.
ఫ రూ.30-40 వేల వరకు వసూలు..
మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాల తీరు మరోరకంగా ఉంది. ప్రతి పాఠశాలలో 5వ తరగతిలో 80 సీట్లు ఉంటాయి. ఇందులో మైనార్టీలకు 51 సీట్లు, క్రిస్టియన్లకు 5 సీట్లు, బీసీలకు 10 సీట్లు, ఎస్సీలకు 3 సీట్లు, ఎస్టీలకు 3 సీట్లు, సిక్కులు, పార్శీలు, జైనులు, బుద్ధిస్టులకు 8 సీట్లు కేటాయించారు. ఈ సీట్ల భర్తీ కోసం ఆయా పాఠశాలల్లో నేరుగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇక్కడ ప్రవేశాల కోసం ఎలాంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించడం లేదు. కోటా నిండడమే లక్ష్యంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. మొదట ప్రవేశ పరీక్ష నిర్వహించినప్పటీకీ, పెద్దగా స్పందన లేక సీట్లు నిండ లేదు. ఇప్పుడు నేరుగా కోటా ప్రకారం ప్రవేశాలు కల్పిస్తున్నారు. జూలైలోపు మొత్తం సీట్లు భర్తీ కావడం లేదు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన సీట్లు మినహా, మైనార్టీలు, ఇతరులకు కేటాయించిన సీట్లు నిండడం లేదు. దీంతో ఆ సీట్లను ఎస్సీ, ఎస్టీలు, బీసీలతో భర్తీ చేసేందుకు గత ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీనిని ఆసరా చేసుకుని కొంత మంది దళారులు ఇతర గురుకుల్లో సీట్లు రాని విద్యార్థుల తల్లిదండ్రులను సంప్రదించి వారి వద్ద నుంచి 30నుంచి 40వేల వరకు డబ్బులు వసూలు చేసి మైనార్టీ గురుకులాల్లో విద్యార్థులను చేర్పిస్తున్నట్లు సమాచారం.
జిల్లాలోని ఒక గురుకుల పాఠశాలతో పాటు కరీంనగర్ జిల్లాలోని ఒక గురుకుల పాఠశాలలో ఈ రకమైన ప్రవేశాలు కల్పిస్తున్నారని తెలుస్తున్నది. ఈ రెండు గురుకులాలకు జిల్లాకు చెందిన విద్యార్థులనే పంపిస్తున్నారు. ప్రభుత్వ గురుకులాల్లో ఉచితంగా విద్యాభ్యాసం చేస్తున్నప్పటికీ, తల్లిదండ్రుల బలహీనతలను ఆసరా చేసుకుని దళారులు డబ్బులు తీసుకుని సంబంధిత పాఠశాల సిబ్బందికి కొంత ఇచ్చి, వాళ్లు కొంత తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ విద్యా సంవత్సరానికి ఎస్సీ, బీసీ గురుకులాల్లో ప్రవేశాలు పూర్తి కాగా, అందులో సీట్లు రాని వాళ్లను మైనార్టీ గురుకులాల్లో చేర్పించేందుకు రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ విషయమై ప్రభుత్వం స్పందించి మిగిలి ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించి మెరిట్‌ను ఆధారంగా కేటాయించాలని విద్యార్థుల తల్లితండ్రులు అభిప్రాయపడుతున్నారు.
Updated Date - Jun 15 , 2024 | 01:00 AM