ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అన్నదాతల్లో ఆందోళన..

ABN, Publish Date - Jul 31 , 2024 | 01:23 AM

రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుక వచ్చిన రెండు లక్షల రూపాయల వరకు రైతులకు రుణ మాఫీ పథకం వల్ల సాంకేతిక కారణాల వల్ల పలువురు రైతులకు రుణ మాఫీ కావడం లేదు. దీంతో సదరు రైతులు వ్యవసాయ కార్యాలయాల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఆందోళన చెందుతున్నారు.

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుక వచ్చిన రెండు లక్షల రూపాయల వరకు రైతులకు రుణ మాఫీ పథకం వల్ల సాంకేతిక కారణాల వల్ల పలువురు రైతులకు రుణ మాఫీ కావడం లేదు. దీంతో సదరు రైతులు వ్యవసాయ కార్యాలయాల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఆందోళన చెందుతున్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో వ్యవసాయ శాఖ హెల్ప్‌లైన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వారి సందేహాలను తీరుస్తున్నారు. రుణ మాఫీ కానీ రైతులకు ఏ కారణం చేత రుణ మాఫీ కాలేదనే అంశాన్ని గుర్తించారు. ఇలా 30 అంశాలను గుర్తించి రుణ మాఫీ అయ్యే విధంగా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంపిస్తున్నారు. మొదటి విడతలో లక్ష రూపాయల వరకు 29,724 మంది రైతులకు 149 కోట్ల 42 లక్షల 22 వేల 297 రూపాయలు మాఫీ అయ్యింది. ఇందులో ఇప్పటి వరకు 25 వేల మంది రైతుల వరకు వారి ఖాతాల్లో జమ కాగా, కొందరికీ సాంకేతిక కారణాల వల్ల పడడం లేదు. వీటిని సవరించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరికే గాకుండా లక్ష రూపాయల వరకు తమకు అర్హత ఉండి కూడా రుణ మాఫీ కాలేదని గగ్గోలు పెడుతున్నారు. అలాంటి వాళ్లు హెల్ప్‌లైన్‌కు ఫోన్లు చేస్తున్నారు. ఈ నెల 27వ తేదీ వరకు హెల్ప్‌లైన్‌కు 510 మంది రైతులు ఫోన్లు చేశారు. వీళ్లేగాకుండా పలువురు రైతులు నేరుగా వ్యవసాయ శాఖాధికారులు, బ్యాంకు అధికారులను కలుస్తున్నారు. సరైన ఆధార్‌ నంబర్‌ లేకపోవడం, ఆన్‌లైన్‌లో సంబంధిత రైతుల డేటా లేకపోవడం, ఆధార్‌ కార్డులో ఉన్న పేరు, రుణ ఖాతాలో ఉన్న పేరు వేరుగా ఉండడం, కుటుంబ సభ్యుల నిర్దారణ కాకపోవడం వల్ల 136 మంది రైతులకు రుణ మాఫీ కాలేదు. కుటుంబ సభ్యుల నిర్ధారణ చేయాల్సి ఉండడంతో పాటు కుటుంబంలో మినహాయింపు లేని ప్రభుత్వ ఉద్యోగి ఉండడం వల్ల కొందరికి రుణ మాఫీ కాలేదు. కుటుంబంలో సర్వీస్‌ పించన్‌దారులు ఉండడం, పట్టాదారు పాసుపుస్తకాలు లేని వాళ్లు, పట్టాదారు పాసు పుస్తకం లేకపోవడంతో పాటు కుటుంబ సభ్యుల నిర్ధారణ జరగ పోవడం, కటాఫ్‌ డేట్‌ నాటికి మంజూరైన రుణం కంటే వడ్డీ ఎక్కువగా ఉన్న వాళ్లకు కూడా రుణ మాఫీ జరగలేదు. ఇలా వివిధ కారణాల వల్ల రుణ మాఫీ కాలేదని అధికారులు గుర్తించారు.

ఫ డేటా అనుసంధానంతో..

ఇండియన్‌ బ్యాంకు ద్వారా రైతులకు ఇచ్చిన రుణాల డేటాలో సమస్య తలెత్తడంతో ఆ బ్యాంకులో లక్ష వరకు రుణాలు తీసుకున్న ఏ ఒక్క రైతు ఖాతాలో కూడా రుణ మాఫీ సొమ్ము జమ కాలేదని అధికారులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాని కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన పథకం ద్వారా ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు, ప్రభుత్వ ఉద్యోగులకు పెట్టుబడి సాయాన్ని అందించడం లేదు. ఆ పథకం ద్వారా లబ్ధిపొందుతున్న రైతుల డేటాతో రుణ మాఫీ పథకానికి ప్రభుత్వం అనుసంధానం చేయడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు, ఆదాయ పన్ను చెల్లింపుదారులకు రుణ మాఫీ జరగడం లేదు. కుటుంబం మొత్తానికి 2 లక్షల రూపాయల వరకు రుణ మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొదటి విడతలో లక్ష రూపాయల వరకు రుణ మాఫీ చేసినప్పుడు, కుటుంబ సభ్యుల డేటాతో అనుసంధానం చేసినప్పుడు 2 లక్షల లోపు కుటుంబ సభ్యులు రుణాలు కలిగి ఉన్నా కూడా లక్ష వరకే రుణ మాఫీ కాగా, కొందరికి రుణ మాఫీ కాలేదు. తమకు రుణ మాఫీ అవుతుందా, లేదా అని సదరు రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే గత ఏడాది పంట రుణం పొంది, ఈ ఏడాది వర్షాకాలం సీజన్‌ ప్రారంభంలో రుణాలు చెల్లించి తిరిగి పంట రుణాలు పొందిన రైతులకు రుణ మాఫీ వర్తించడం లేదు. దీంతో సదరు రైతులు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. తాము సకాలంలో రుణాలు చెల్లిస్తే తమకెందుకు రుణ మాఫీ చేయరని సదరు రైతులు ప్రశ్నిస్తున్నారు. రెండో విడతలో లక్షా 50 వేల రూపాయల వరకు జిల్లాలో 13,238 మంది రైతులకు 122 కోట్ల 43 లక్షల 26 వేల 652 రూపాయల మాఫీ చేశారు. మంగళవారం నుంచి ఆ డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించారు. ఇందులో కూడా పలువురి రైతుల ఖాతాల్లో సాంకేతిక సమస్యలతో డబ్బులు పడలేదని తెలుస్తున్నది. అర్హతగల రైతులందరికీ రుణమాఫీని వర్తింపజేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా వ్యవసాయ శాఖాధికారి దోమ ఆదిరెడ్డిని ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా సాంకేతిక కారణాల వల్ల మొదటి విడతలో కొంత మంది రైతులకు రుణ మాఫీ కానట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారందరినీ బ్యాంకుల వారీగా గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తున్నామని చెప్పారు.

Updated Date - Jul 31 , 2024 | 01:23 AM

Advertising
Advertising
<