ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డ్రగ్స్‌ కట్టడికి చర్యలు

ABN, Publish Date - Jul 21 , 2024 | 12:55 AM

డ్రగ్స్‌ నివారణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రహరీ క్లబ్‌లు ఏర్పాటు చేయడానికి జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

- పాఠశాలల్లో ప్రహరీ క్లబ్‌ల ఏర్పాటు

- మత్తు పదార్థాల కట్టడికి కమిటీలు

- విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు

జగిత్యాల, జూలై 20 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌ నివారణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రహరీ క్లబ్‌లు ఏర్పాటు చేయడానికి జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. పాఠశాల చుట్టుపక్కల ఎవరూ మత్తుమందులు విక్రయించకుండా, విద్యార్థులు వినియోగించకుండా క్లబ్‌లు నిఘా పెడతాయి. డ్రగ్స్‌పై విద్యార్థుల్లో అవగాహన పెంచడంతో పాటు నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్ర వెంకటేశం జీవో నంబరు 20 జారీ చేశారు. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారుల ద్వారా ఆయా ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

విద్యార్థులకు అవగాహన

మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన విద్యార్థులు ఉంటే గుర్తించి వారిని అప్రమత్తం చేస్తారు. డ్రగ్స్‌ వినియోగం వల్ల దుష్ప్రభావాలు వివరించి వాటికి దూరమయ్యేలా విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సిద్ధమవు తున్నారు. మత్తు పదార్థాల అక్రమ రవాణాకు పిల్లలను వినియోగించినట్లయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కట్టడి చేసి సంబంధిత పోలీసు అధికారులకు ప్రహరీ క్లబ్‌ సభ్యులు సమాచారం అందిస్తారు. డ్రగ్స్‌ వినియోగం, అమ్మకం, అనుమానిత కార్యకలాపాలపై క్లబ్‌లు నిరంతరం నిఘా పెడుతాయి.

క్లబ్‌ల ఏర్పాటు ఇలా.

ప్రహరీ క్లబ్‌ అధ్యక్షుడిగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ప్రిన్సిపాల్‌ వ్యవహరిస్తారు. ఉపాఽధ్యక్షుడిగా సీనియర్‌ ఉపాధ్యాయుడు, చైల్డ్‌ ఫ్రెండ్లీ టీచర్‌, సభ్యులుగా 6వ తరగతి నుంచి 10వ తరగతులకు సంబంధించిన విద్యా ర్థులు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో నుంచి ఒక ప్రతినిధి, స్థానిక పోలీస్‌స్టేషన్‌ నుంచి సిబ్బంది ఒకరు సభ్యులుగా ఉంటారు. కమిటీ కార్యకలాపాల్లో ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లను వినియోగించుకోనున్నారు.

జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, జిల్లా పరిషత్‌ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, కస్తూర్భా, మోడల్‌, సంక్షేమ పాఠశాలల్లో ప్రహరీ క్లబ్‌లు ఏర్పాటు చేస్తారు. జిల్లాలో 595 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. ఇందు లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సుమారు 1,21,460 మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలు 81, ఉన్నత పాఠశాలలు 175, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు 3, ఉన్నత పాఠశాలలు 13, కేజీబీవీలు 14, మైనారిటీ వెల్ఫేర్‌ ఉన్నత పాఠశాలలు 5, మహాత్మ జ్యోతిరావుపూలే బీసీ సంక్షేమ ఉన్నత పాఠశాలలు 13, సోషల్‌ వెల్ఫేర్‌ ఉన్నత పాఠశాలలు 7, ప్రైవేటు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 124 ఉన్నాయి. వీటిల్లో ప్రహరీ క్లబ్‌లు ఏర్పాటు చేయనున్నారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకే

- జగన్‌ మోహన్‌రెడ్డి, జిల్లా విద్యాధికారి

జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలల్లో డ్రగ్స్‌ నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడి భవిష్యత్తు నాశనం చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటాం. ఇందుకు అనుగుణంగా ప్రత్యేక కమిటీలను పాఠశాలల వారీగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.

డ్రగ్స్‌ వినియోగంతో తీవ్ర నష్టాలు

- అశోక్‌కుమార్‌, జిల్లా ఎస్‌పీ

విద్యార్థులు, యువత డ్రగ్స్‌ వినియోగిస్తే తీవ్రంగా నష్టపోతారు. విద్యార్థులు మత్తుపదార్థాలు, వ్యసనాలకు గురికాకుండా చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో గల పాఠశాలలు, కళాశాలల్లో అవగాహణ సదస్సులను నిర్వహిస్తూ డ్రగ్స్‌ వినియోగం వల్ల జరిగే నష్టాలను వివరిస్తున్నాం. పోలీసు శాఖ తరుపున మత్తు పదార్థాల వినియోగం, విక్రయంపై కఠన చర్యలు తీసుకుంటాం.

Updated Date - Jul 21 , 2024 | 12:55 AM

Advertising
Advertising
<