11,915 మంది రైతులు.. రూ. 116 కోట్లు
ABN, Publish Date - Jul 31 , 2024 | 12:11 AM
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రుణమాఫీకి సంబంధించి రెండో విడత రూ 1.50 లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించారు
- రైతులకు రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల
- చెక్కును ఆవిష్కరించిన కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
- సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న కలెక్టర్, అధికారులు
సిరిసిల్ల, జూలై 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రుణమాఫీకి సంబంధించి రెండో విడత రూ 1.50 లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండోవిడత రుణమాఫీ నిధుల విడుదలకు సంబంధించిన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, జిల్లా అధికారులు, రైతులు, సింగిల్ విండో చైర్మన్లు పాల్గొన్నారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి రెండో విడత 11,915 మంది రైతులకు సంబంధించి 116 కోట్ల రూపాయల రుణమాఫీ చెక్కును అందించారు. మొదటి విడతలో 23,785 మంది రైతులు అర్హులుగా రూ 167.48 కోట్లు రుణమాఫీ నిధులు విడుదల అయ్యాయి. ఇందులో 23,330 మంది రైతుల ఖాతాల్లో రూ 127.22 కోట్లు జమ అయ్యాయి. రైతులు ప్రభుత్వం అందిస్తున్న రుణమాఫీని కొనియాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడతలో లక్ష రూపాయల వరకు 23,785 మంది రైతుల ఖాతాల్లో రూ 167.48 కోట్లు ప్రభుత్వ జమ చేసిందని రెండో విడతలో రూ 1.50 లక్షల వరకు రుణమాఫీ నిధులను విడుదల చేసిందన్నారు. సిరిసిల్ల జిల్లాలో 11,915 మంది రైతులకు 116 కోట్ల రూపాయలు మాఫీ కానున్నట్లు తెలిపారు. రెండో విడతలో రైతు రుణమాఫీ జరిగిన లబ్ధిదారులు బ్యాంక్ రుణాలను రెన్యూవల్ చేసుకోని రుణమాఫీ సొమ్మును వారి సేవింగ్ ఖాతాల్లో జమ చేయాలని అన్నారు. దీని కోసం బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, ఎల్‌డీఎం మల్లికార్జున్, సహకార అధికారి బుద్ధనాయుడు, సింగిల్ విండో చైర్మన్లు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 31 , 2024 | 12:11 AM