Caste Census: 6 నుంచి రాష్ట్రంలో కులగణన
ABN, Publish Date - Oct 29 , 2024 | 03:19 AM
కుల గణనకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ఈ కార్యక్రమం నవంబరు-6 నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రశ్నావళిని ప్రభుత్వం విడుదల చేసింది.
7 పేజీలు.. 75 ప్రశ్నలు.. వ్యక్తిగత, కుటుంబ వివరాల సేకరణ
‘ఆధార్’ తప్పనిసరి కాదు.. రాజకీయం, వలసపై ప్రశ్నలు
ఆధార్ వివరాలు తప్పనిసరి కాదు
రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల లబ్ధి, రాజకీయ నేపథ్యం వివరాల సేకరణ
హైదరాబాద్, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): కుల గణనకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ఈ కార్యక్రమం నవంబరు-6 నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రశ్నావళిని ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 56 ప్రధాన ప్రశ్నలతోపాటు 19 అనుబంధ ప్రశ్నలతో కలిపి మొత్తం 75 ప్రశ్నలు ఖరారు చేశారు. పార్ట్-1లో యజమాని, కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలకు సంబంధించి 58 ప్రశ్నలుండగా.. పార్ట్-2లో కుటుంబ వివరాలకు సంబంధించి 17 ప్రశ్నలున్నాయి. మొత్తం 7 పేజీల్లో వీటిని పూరించాల్సి ఉంటుంది. కుటుంబ యజమానితోపాటు కుటుంబంలోని సభ్యులందరి వ్యక్తిగత వివరాలు సేకరించనున్నారు.
పార్ట్-1లో వ్యక్తిగత వివరాలలో.. మతం, సామాజిక వర్గం, కులం, ఉప కులంతోపాటు మాతృభాష, వైవాహిక స్థితి, పాఠశాల రకం, విద్యార్హత, ఉద్యోగం, ఉపాధి, కుల వృత్తి, వార్షిక ఆదాయం, ఐటి రిటర్న్, స్థిరాస్తులు, ధరణి పాస్‌బుక్ నెంబర్, రిజర్వేషన్‌తో పొందిన ప్రయోజనాలు, గత ఐదేళ్లలో ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన సంక్షేమ పథకాల పేర్లు, రాజకీయ నేపథ్యం, వలస వివరాలు సేకరిస్తారు. కుటుంబ వివరాలను పార్ట్-2లో నమోదు చేస్తారు. ఇందులో గత ఐదేళ్లలో తీసుకున్న రుణాల వివరాలు, పశుసంపద, స్థిరాస్తి, చరాస్తి వివరాలు, రేషన్ కార్డు నెంబరు, నివాస గృహం రకం, మరుగుదొడ్డి, గ్యాస్ కనెక్షన్ వివరాలు తెలపాల్సి ఉంటుంది. ఆధార్ వివరాలు తప్పనిసరి కాదని ఇందులో స్పష్టం చేశారు.
సమగ్ర కుటుంబ సర్వే లాంటి ప్రశ్నలే
2014 ఆగస్టు-19న నాటి కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే ద్వారా రాష్ట్రంలోని కోటి గృహాలు, 3.68 కోట్ల జనాభాకు సంబంధించి ఆర్థిక సామాజిక వివరాలన్నీ సేకరించింది. పదేళ్ల కిత్రం నిర్వహించిన నాటి సర్వేలో 8 అంశాలకు సంబంధించి 94 ప్రశ్నలకు సమాధానాలు సేకరించారు. అప్పటితో పోలిస్తే కులగణన సర్వేలో దాదాపు 90శాతం ప్రశ్నలు మళ్లీ పునరావృతం అయ్యాయి. కుటుంబసభ్యుల అనారోగ్య వివరాలు అందులో ఉండగా.. ఇప్పుడు కులాలకు సంబంధించిన ప్రశ్నలు అదనంగా ఉన్నాయి. గతంలో ఆధార్ వివరాల నమోదు తప్పనిసరి చేయగా.. ఇప్పుడు ఐచ్ఛికంగా ఉంచారు. కాగా, రాష్ట్రంలో కులగణనపైన టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన బుధవారం గాంధీభవన్‌లో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, డీసీసీ అధ్యక్షులు తదితరులు పాల్గొననున్నారు.
Updated Date - Oct 29 , 2024 | 03:19 AM