గ్రూప్-1 నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
ABN, Publish Date - May 18 , 2024 | 11:09 PM
జూన్ 9న జరగనున్న గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. శనివారం టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఎం. మహేందర్‌రెడ్డి కలెకర్లు, అదనపు కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో వీడియో కాన్పరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
పరీక్షా కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి
జిల్లా కలెక్టర్ శశాంక
ఆంధ్రజ్యోతి రంగారెడ్డి అర్బన్, మే 18 : జూన్ 9న జరగనున్న గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. శనివారం టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఎం. మహేందర్‌రెడ్డి కలెకర్లు, అదనపు కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో వీడియో కాన్పరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందన్నారు. పరీక్ష నిర్వహణకు జిల్లాలో 93 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 55,692 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి పరీక్షా కేంద్రాలలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకూ తావివ్వరాదని సూచించారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య పరీక్ష జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ చెప్పారు. పరీక్షల నిర్వహణకు లైజన్ అఽధికారులను నియమించామని చెప్పారు. అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు పరీక్ష కేంద్రాన్ని సందర్శించి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్ హజరు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులకు తెలిసేలా పరీక్షా కేంద్రం పేరు, పేపర్ కోడ్, ఏరియా ఆయా పరీక్ష కేంద్రం ముందు తప్పని సరిగా ప్రదర్శించాలని సూచించారు. ఇన్విజిలేటర్లు జాప్యం చేయకుండా సరైన సమయానికి పేపర్ ఇవ్వాలని, టైం పూర్తయిన వెంటనే తీసుకోవాలన్నారు. ఉదయం10 గంటల తర్వాత ఎవరినీ పరీక్షా కేంద్రంలోని అనుమతించరని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రంలోకి ఎలక్ర్టానిక్ పరికరాలు, సెల్‌ఫోన్లు, రైటింగ్ పాడ్స్ అనుమతించరని తెలిపారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్ మాత్రమే తెచ్చుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాలలోని అన్ని గదులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలు ఉండేలా చూసుకోవాలన్నారు. పరీక్షా సమయంలో నిరంతరాయంగా విద్యుత్ ఉండేలా చూడాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు 9 గంటలలోగా చేరుకునేలా ఆయా రూట్లలో తగినన్ని బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశిం చారు. పరీక్షా కేంద్రాల పరిసరాలను పరిశుభ్రంగా చేయించేలా చర్యలు చేప ట్టాలని మున్సిపల్ కమిషనర్లు, డీపీవోకు సూచించారు. అదే విధంగా పరీక్ష కేంద్రాల వద్ద మెడికల్ కిట్ ఓఆర్‌ఎస్ ప్యాకెట్లతో ఏఎన్‌ఎంను అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కలెక్టర్ శశాంక సూచించారు. చీఫ్ సూపరింటెండెంట్‌లు ఇన్విజిలేటర్లు, నో రిలేషన్ సర్టిఫికెట్ ఇవ్వాలన్నారు. ముందు రోజు కూడా ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇవ్వాలని చీఫ్ సూపరింటెంట్లకు సూచించారు. అఽధికారులు సమన్వయంతో పనిచేసి గ్రూప్-1 పరీక్ష సజావుగా నిర్వహించాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, చీఫ్ సూపరింటెండెంట్లు, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - May 18 , 2024 | 11:09 PM