Kumaram Bheem Asifabad: పడకేసిన పల్లె పాలన..
ABN, Publish Date - Jul 13 , 2024 | 10:26 PM
తాను విధులు నిర్వహించే గ్రామ పంచాయతీలో నిధులు లేక ఒక కార్యదర్శి 4నెలలలుగా ట్రాక్టర్ డీజిల్, వీధి దీపాల కొనుగోలు ఇతర మరమ్మతుల కోసం సొంతంగా డబ్బులు ఖర్చు చేశాడు.
- వీధి దీపాలు లేక చీకట్లో గ్రామాలు
- గ్రామపంచాయతీల్లో పుట్టెడు సమస్యలు
- నిధులు రాక సొంత డబ్బులు వెచ్చిస్తున్న వైనం
- దీనికి తోడు సర్వేలతో అదనపు పనిభారం
- ఏడు నెలలుగా సపాయిలకు అందని వేతనాలు
- పాలకవర్గాలు లేవు...ప్రత్యేకాఽధికారులు పట్టించుకోరు
తాను విధులు నిర్వహించే గ్రామ పంచాయతీలో నిధులు లేక ఒక కార్యదర్శి 4నెలలలుగా ట్రాక్టర్ డీజిల్, వీధి దీపాల కొనుగోలు ఇతర మరమ్మతుల కోసం సొంతంగా డబ్బులు ఖర్చు చేశాడు. ఈ ఆర్థిక భారంతోపాటు అధికారులు అప్పగిస్తున్న సర్వేలతో అదనపుభారం మోస్తున్నాడు. ఏడు నెలలలుగా సపాయి కార్మికులకు జీతాలు రాకపోవడంతో వారిని బతిమిలాడి పని చేయించుకుంటున్న దుస్థితి. ఈ దుస్థితి జిల్లాలోని దాదాపు గ్రామపంచాయతీ కార్యదర్శులంతా అనుభవిస్తున్నట్లుగా తెలుస్తున్నది. పంచాయతీ పాలకవర్గాలు లేక ఇప్పటికే ఆరు నెలలు కావస్తున్నది. ప్రత్యేకాధి కారులు ఉన్నారంటే ఉన్నారన్నట్టుగానే ఉంది. గ్రామ సర్వతో ముఖాభివృద్ధికి కథానాయకుడై నడిపించాల్సిన కార్యదర్శే ప్రస్తుతం కష్టాల్లో ఉండటం గమనార్హం. - బెజ్జూరు
జిల్లాలో 335గ్రామపంచాతీలు ఉన్నాయి. దాదాపు అన్ని గ్రామపంచాతీల్లోనూ కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. గతంలో గ్రామాల అభివృద్ధి పనులు, మరమ్మత్తులు, నిధుల వ్యవహారమంతా సర్పంచ్‌లు, పాలకవర్గాలు చూసుకునేది. కానీ గడిచిన జనవరి నెలాఖరుతో పాలకవర్గాల గడువు పూర్తయింది. ఆ వెంటనే ప్రతీ గ్రామానికి ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించింది. ఇతర శాఖల్లో కీలకంగా ఉన్నవారికే ప్రత్యేకాధికారులుగా బాఽధ్యతలు అప్పగించడంతో వారు గ్రామాలపై సరైన దృష్టి పెట్టడం లేదు. తమ మాతృశాఖలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎప్పుడో ఒకసారి గ్రామాలకు వస్తున్నప్పటికీ సలహాలు, సూచనలకే పరిమితమవుతున్నారు. దీంతో భారమంతా స్థానికంగా ఉండే పంచాయతీ కార్యదర్శిపై పడుతోంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు మరమ్మతులు, గ్రామ నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలు, పన్నుల వసూళ్లు, ఆదాయ వ్యయాల లావాదేవీలు, నెలవారి చెల్లింపులు తదితర విషయాలన్ని వీరే పర్యవేక్షించాల్సి వస్తోంది. ఈ విషయంపై పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. గ్రామపంచాయతీలకు రావాల్సిన కేంద్ర, రాష్ట్రాల నిఽఽధులు ఆగిపోయాయి. దీంతో చాలా పంచాయతీ ఖాతాల్లో నిధుల కొరత ఏర్పడింది. గ్రామపంచాయతీల్లో సపాయి కార్మికులకు ఏడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. ట్రాక్టర్ల కిస్తీలకు నిధులు చాలడం లేదు. వీధిదీపాలు లేక గ్రామాల్లో చీకట్లో అలుముకుంటున్నాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో గ్రామాల్లో వీధులన్నీ అపరిశుభ్రంగా మారుతున్నాయి. మురికి కాలువలు పూర్తిగా పూడికతో నిండి దోమల వ్యాప్తికి కారణమవుతున్నాయి. వీటి పనులను పంచాయతీ కార్యదర్శులే దగ్గరుండి చూసుకోవాల్సి వస్తోంది. కార్యదర్శులే స్వంతంగా డబ్బులు పెట్టి చేయిస్తున్నారు. ఇటు పాలకవర్గాలు లేక అటు గ్రాంట్లు, నిధులు రాక మరోవైపు ప్రత్యేకాధికారులు పట్టించుకోక నలిగిపోతున్నారు.
కిస్తీలకు సరిపోక..
చిన్న పంచాయతీల్లో వసూలయ్యే ఏడాది ఇంటిపన్ను రెండు, మూడు నెలల ట్రాక్టర్ కిస్తీలకు కూడా సరిపోవడం లేదని ఆయా పంచాయతీల కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటికి మిషన్ భగీరథ రావడంతో నీటి పన్నులు పూర్తిగా రద్దు చేశారు. ప్రభుత్వం ఇచ్చే పల్లెప్రగతి నిధులే దిక్కుగా మారుతున్నాయి. పంచాయతీలకు గరిష్టంగా వచ్చే నిధులు ఏడాదికి రూ.10లక్షల నుంచి రూ.15లక్షలు ఉంటుంది. వాటిలో ట్రాక్టరు కిస్తీలు, మరమ్మతులు, డీజిల్ కోసం ఏటా రూ.6.50లక్షల వరకు ఖర్చవుతోంది. వచ్చే నిధుల్లో సగం వీటికే పోతే అభివృద్ధి పనులు ఎలా చేయాలని కార్యదర్శులు వాపోతున్నారు. గ్రామపంచాయతీలకు వచ్చే నిధుల్లో ట్రాక్టర్ కిస్తీకి రూ.26,000, పారిశుధ్య కార్మికుడి వేతనం రూ.9,500, ట్రాక్టర్ మరమ్మతుకు రూ.2,500, డీజిల్ ఖర్చు రూ.4,000, విద్యుత్ బిల్లు రూ.10,000 మొత్తం ఖర్చు రూ.52వేలు వరకు అవుతోంది. ప్రస్తుతం పాలకవర్గాల పదవీకాలం పూర్తి కావడంతో ఆ నిధులు కూడా రాకపోవడంతో పంచాయతీల భారమంతా కార్యదర్శులే మోయాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇక చిన్న పంచాయతీలకు వచ్చే నిధులకు, ఖర్చులకు పొంతన ఉండటం లేదు. వచ్చే నిధులు ఏ మూలకు సరిపోవడం లేదు. వీటితోపాటు పంచాయతీల్లో చిన్నపాటి సమస్యల పరిష్కారానికి సైతం డబ్బులు వెచ్చించాల్సి ఉంటుందని వాపోతున్నారు. ఈ పరిస్థితి జిల్లాలో అన్ని చిన్న పంచాయతీల్లో ఉంది.
Updated Date - Jul 13 , 2024 | 10:26 PM