Kumaram Bheem Asifabad: కొత్త రేషన్ కార్డులపై ఆశలు
ABN, Publish Date - Jun 06 , 2024 | 10:15 PM
చింతలమానేపల్లి, జూన్ 6: ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు మండుతున్నాయి. మార్కెట్లో సన్నబియ్యం ధర కిలో రూ.70 నుంచి 75పలుకుతోంది.
- ఎదురుచూస్తున్న లబ్ధిదారులు
- విడుదల కాని మార్గదర్శకాలు
- జిల్లాలో సుమారుగా 5వేలకు పైనే దరఖాస్తుల పెండింగ్
- మరిన్ని దరఖాస్తులు పెరిగే అవకాశం
చింతలమానేపల్లి, జూన్ 6: ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు మండుతున్నాయి. మార్కెట్లో సన్నబియ్యం ధర కిలో రూ.70 నుంచి 75పలుకుతోంది. అన్ని పప్పుల ధరలు రూ.200వరకు చేరాయి. వంటనూనె, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి, మంత్రులు వివిధ సందర్భాల్లో రేషన్‌కార్డులు అర్హులైన ప్రతీ ఒక్కరికి అందజేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రేషన్ కార్డుల కోసం అర్హులు ఎదురుచూస్తున్నారు.
జిల్లాలో ఇలా..
జిల్లాలోని 15మండలాల పరిధిలో మొత్తం 314రేషన్ దుకాణాలు ఉండగా, 1,40,029 ఆహారభద్రత కార్డులు ఉంటే 4,63,010మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పటికే జిల్లాలోని మీసేవా కేంద్రాల్లో సుమారుగా 5వేలకు పైగా లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోగా అవి పెండింగ్‌లోనే ఉన్నాయి. రేషన్‌కార్డుల పంపిణీ ప్రక్రియ విధివిధా నాలు రూపొందిస్తే దరఖాస్తులు మరిన్ని పెరిగే అవకాశం ఉన్నది. ఆరు గ్యారంటీల పథకాలకు అధికారుల నుంచి దరఖాస్తులు స్వీకరించగా అర్హులైన ప్రతీఒక్కరు దరఖాస్తులు చేసుకున్నారు.
ఇకపై నిరంతర ప్రక్రియ..
పదేళ్లుగా కొత్త ఆహారభద్రత(రేషన్) కార్డుల మంజూరు ఊసే లేకుండా పోయింది. ఏటా కుటుంబాల సంఖ్య పెరుగుతున్నా.. ఆ మేరకు కార్డుల సంఖ్య పెరుగుతున్నా.. కార్డుల మంజూరు మాత్రం లేదు. పదేళ్లుగా మీసేవా ద్వారా దరఖాస్తులు కూడా తీసుకోకపోవ డంతో పథకాల ప్రయోజనాలకు ప్రతిబంధకంగా మారింది. గత ప్రభుత్వం హుజురాబాద్, మునుగోడు ఇతర శాసనసభ ఉప ఎన్నికల సమయంలో అప్పటికే దరఖాస్తులు చేసి కొన్నేళ్లు వేచి చూసిన లబ్ధిదారులకే ఆహార భద్రత కార్డులను అందించింది. ఆ తర్వాత వెబ్‌సైట్‌లో కార్డుల జారీ, మార్పులు, చేర్పుల ప్రక్రియను నిలిపివేసింది. తాజాగా సీఎం ప్రకటనతో మళ్లీ కొత్త రేషన్ కార్డుల జారీకి మోక్షం లభించనుంది. గతంలో కాకుండా నిరంతర ప్రక్రి యగా రేషన్‌కార్డులు జారీ చేస్తామని చెప్పడంతో లబ్ధిదారులకు ఊరట లభించింది. త్వరలోనే దీనికి సంబంధించిన విధివిధానాలు, మార్గదర్శకాలు విడుదల చేయనున్నారని అధికారులు చెబుతున్నారు.
సర్కార్ సాయం అందక అవస్థలు..
జిల్లాలోని పలు కుటుంబాలు అన్ని అర్హతలున్నా.. రేషన్ కార్డులు లేకపోవడంతో సర్కార్ సాయం అందక నానాఅవస్థ్థలు పడుతు న్నారు. రేషన్ దుకాణాల్లో నిత్యావసరాలు పొందలేక పోతున్నారు. వివిధ ప్రభుత్వపనులకు రేషన్‌కార్డు, ఆధార్‌కార్డును కొలమానంగా పరిగణిస్తుండడంతో కార్డులు లేని కుటుంబాలు ఇబ్బందులు పడు తున్నాయి.
కొత్తగా పేర్ల నమోదుకు..
అప్పట్లో కార్డులను రద్దు చేయడానికి, కొన్ని కార్డులలో నుంచి కుటుంబ సభ్యుల పేర్లు తొలగించడానికి అనేక కారణాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం, కుటుంబం నుంచి వేరు పడడం, ఒక కార్డు నుంచి మరో కార్డులో చేరిక, వలసలు వెళ్లడం, చనిపోవడం, రెండుకార్డుల్లో పేర్లు ఉండడం, ఇతర కారణాలతో రేషన్‌కార్డులో పేర్లు తొలగించారు. ప్రస్తుతం అర్హుల పేర్లు చేర్చడంతోపాటు కొత్తకార్డు పొందడానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో పాత రేషన్‌కార్డులో తప్పొప్పుల సవరణకు దాదాపుగా నాలుగేళ్లుగా సేవలు నిలిచిపోయాయి. కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్న వారికి, ఇప్పటికే ఏళ్లు గడుస్తున్న వారికి రేషన్‌కార్డులు మంజూరు చేయాలని కార్డుల్లో పేర్ల నమోదు, తొలగింపు నిరంతర ప్రక్రియగా ఉండాలని పలువురు కోరుతున్నారు.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలు..
వినోద్ కుమార్, డీఎస్‌వో
కొత్తగా రేషన్‌కార్డుల జారీ, రేషన్‌దుకాణాల్లో నిత్యావసరాల పంపిణీని ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చేపడతాం. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ముగిసింది. ప్రభుత్వ నిర్ణయం కోసం చూస్తున్నాం. ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇస్తే అందుకు అనుగుణంగా అవసరమైన చర్యలు చేపడతాం. జిల్లాలో చౌకధరల దుకాణాల ద్వారా పకడ్బందీగా సరకులు అందజేస్తున్నాం.
Updated Date - Jun 06 , 2024 | 10:15 PM