కవ్వాల కనువిందు
ABN, Publish Date - Jun 29 , 2024 | 10:32 PM
కవ్వాల అభయారణ్యం కనువిందు చేస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు పచ్చదనం పరుచుకుంది. కవ్వాల అభయారణ్యం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు నుంచి జన్నారం ఇటు కడెం మండలం వరకు సుమారు 60 కిలోమీటర్ల మేర ఉంటుంది.
జన్నారం, జూన్ 29: కవ్వాల అభయారణ్యం కనువిందు చేస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు పచ్చదనం పరుచుకుంది. కవ్వాల అభయారణ్యం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు నుంచి జన్నారం ఇటు కడెం మండలం వరకు సుమారు 60 కిలోమీటర్ల మేర ఉంటుంది. ప్రధాన రహదారి వెంట ఉన్న అటవీ ప్రాంతం పచ్చదనంతో స్వాగతం పలికుతోంది. ఈ రహదారిలో ప్రయాణించే వారు పచ్చదనం, పక్షుల కిలకిలు, అక్కడక్కడ అగుపించే వన్యప్రాణులను చూస్తూ పరవశించిపోతారు. ప్రధాన రహదారులు ఇరువైపుల పచ్చదనం స్వాగతం పలుకుతున్నట్లు ఉండడంతో మనసు ఆహ్లాదకరంగా మారుతుంది. వర్షాలకు వాగులు, వంకలు, సెలయేర్లు గల గల పారుతుండగా మరో వైపు జంతువుల అలజడి వాటి కూతలు ఎంతగానే ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే కవ్వాల అభయారణ్యాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఏకో టూరిజం ఆధ్వర్యంలో సఫారీలను ఏర్పాటు చేశారు. ఈ వర్షాకాలం మొదలైందంటే అడవి పచ్చదనంతో పాటు వన్య ప్రాణులను చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతారు.
అటవీ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి
కవ్వాల టైగర్‌జోన్‌లోని వన్య ప్రాణులు, అటవీ సంరక్షణ కోసం అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా వన్య ప్రాణులు అధికంగా తిరిగే ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చెరువుల వద్ద వాటిని మానిటరింగ్ చేసేందుకు యానిమల్ ట్రాకర్లను ఏర్పాటు చేసి వాటికి ఇబ్బందులు కలుగకుండా దాహార్తీ తీర్చే విధంగా చర్యలు చేపట్టారు. అటు పర్యాటకులు వీక్షించే విధంగా రహదారులు, మంచెలు కనువిందు చేస్తాయి.
హరిత టూరిజం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు
తెలంగాణ హరిత టూరిజం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ముఖ్యంగా కవ్వాల టైగర్ జోన్‌లోని అటవీ వన్యప్రాణులను వీక్షించేందుకు వచ్చే పర్యాటకుల కోసం ప్రత్యేకంగా జంగిల్ సఫారీలను ఏర్పాటు చేశారు. దీంతో అభయారణ్యంలో సుమారు 15 కిలోమీటర్ల మేర లోపలికి గైడ్ తీసుకువెళ్లడంతో పాటు అడవిని, వన్యప్రాణులను ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉండేలా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
-కవ్వాల అభయారణ్యంను వీక్షించేందుకు వచ్చేవారి కోసం తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా హరిత రిసార్టు, ప్రత్యేక కాటేజీలను ఏర్పాటుచేశారు. జన్నారం అటవీ డివిజన్‌తోపాటు నిర్మల్ జిల్లా కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు వద్ద మరో హరిత రిసార్టు, బోట్ సౌకర్యం ఏర్పాటు చేయడంతో సెలవు దినాల్లో ప్రజలు ఎక్కువగా వస్తున్నారు.
Updated Date - Jun 29 , 2024 | 10:32 PM