ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బెల్ట్‌ షాపులు

ABN, Publish Date - Jul 14 , 2024 | 10:42 PM

జిల్లాలో మద్యం ఏరులై పారు తోంది. అధికారుల అలసత్వంతో మద్యం మాఫియా గల్లీకో బెల్ట్‌ షాపు ఏర్పాటు చేస్తూ అందినకాడికి దండుకుంటోంది. నివాస గృహాలు, చిన్న చిన్న కిరాణా షాపుల్లోనూ కావలసినంత మద్యం దొరుకుతోంది. వైన్‌, బార్‌ షాపుల్లో సమయం ప్రకారం మద్యం లభ్యమవుతుండగా బెల్టు షాపుల్లో 24 గంటలు అందుబాటులో ఉంటోంది.

మంచిర్యాల, జూలై 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మద్యం ఏరులై పారు తోంది. అధికారుల అలసత్వంతో మద్యం మాఫియా గల్లీకో బెల్ట్‌ షాపు ఏర్పాటు చేస్తూ అందినకాడికి దండుకుంటోంది. నివాస గృహాలు, చిన్న చిన్న కిరాణా షాపుల్లోనూ కావలసినంత మద్యం దొరుకుతోంది. వైన్‌, బార్‌ షాపుల్లో సమయం ప్రకారం మద్యం లభ్యమవుతుండగా బెల్టు షాపుల్లో 24 గంటలు అందుబాటులో ఉంటోంది. ఎప్పుడంటే అప్పుడు....ఏ బ్రాండ్‌ అంటే ఆ బ్రాండ్‌ వైన్‌ షాపుల మాదిరి ఇళ్లలోనే లభ్యం అవు తోంది. కిలోమీటర్ల మేర దూరంలోని వైన్‌ షాపులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఐదో, పదో ఎక్కువిస్తే ఇంటి పక్కనే మద్యం దొరుకుతోంది.

వైన్‌ షాపులకు అనుబంధంగా

మద్యం విక్రయాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో వైన్‌ షాపుల నిర్వాహకులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో వైన్‌ షాపు పరిధిలో కనీసం 30 చొప్పున బెల్టు షాపులు అనుబంధంగా పని చేస్తున్నాయి. తమ టార్గెట్లు చేరుకొనేందుకు బెల్టు షాపులను ఏర్పాటు చేయిస్తూ, అక్రమంగా మద్యం అమ్మకాలు సాగించేలా వైన్‌షాపుల నిర్వా హకులే ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వైన్‌షాపుల నుంచి ఎమ్మార్పీ ఽధరలకు కొనుగోలు చేస్తున్న బెల్టు షాపుల నిర్వాహకులు ఒక్కో క్వార్టర్‌ బాటిల్‌పై రూ.20 అదనంగా వసూలు చేస్తూ అమ్మకాలు సాగిస్తున్నారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా బెల్టు షాపులు దర్శనమిస్తున్నాయి.

అక్రమంగా సిట్టింగ్‌లు ఏర్పాటు...

బెల్టు షాపుల్లో సిట్టింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నా పట్టించుకొనేవారు లేరు. ఆహార పదార్థాలు తయారు చేస్తూ మందుబాబులకు అందజేస్తున్నారు. బెల్టు షాపుల మధ్య పోటీ పెరగడంతో కస్టమర్లను ఆకర్శించేందుకు ఇళ్లలోనే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. బార్‌ అండ్‌ రెస్టారెంట్ల మాదిరిగా బెల్టు షాపుల్లో చికెన్‌, మటన్‌, గుడ్లు, ఆమ్లేట్‌, తదితర ఆహార పదార్థాలను వండి అందజేస్తున్నారు.

నిద్రావస్థలో అబ్కారీశాఖ...

విచ్చలవిడిగా బెల్టు షాపుల్లో మద్యం విక్రయాలు కొనసాగుతున్నా అబ్కారీశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అడ్డూ అదుపు లేకుండా అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నా పట్టించు కోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల నిర్లిప్తతతో మద్యం కల్తీ కూడా జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బెల్టు షాపుల్లో మద్యం కల్తీ విపరీతంగా జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. కల్తీ మద్యం కారణంగా ప్రజలు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది. అయినా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. వైన్‌ షాపులు, బెల్టు షాపుల నుంచి మామూళ్లు అందుకుంటున్న అబ్కారీశాఖ అధికారులు మద్యం మత్తులో జోగుతున్నారనే బహిరంగ ప్రచారం జరుగుతోంది.

గుప్పుమంటున్న గుడుంబా

గుడుంబా రహిత జిల్లాగా అబ్కారీశాఖ ప్రకటించింది. అయితే గుడుంబా తయారీ, విక్రయాలు జిల్లాలో కనుమరుగు కాలేదు. ఇటీవల అక్కడక్కడ దాడులు జరిపి గుడుంబా స్థావరాలను ధ్వంసం చేయడమే దీనికి నిదర్శనం. అంతేగాకుండా గుట్టు చప్పుడు కాకుండా విక్రయానికి తరలిస్తున్న గుడుంబాను స్వాధీనం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయినా అబ్కారీశాఖ అడపాదడపా దాడులు మినహా, పూర్తిస్థాయిలో అరికట్టే చర్యలు తీసుకోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని బెల్ట్‌ షాపులను అరికట్టడంతోపాటు గుడుంబా తయారు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jul 14 , 2024 | 10:42 PM

Advertising
Advertising
<