ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బెంగళూరు కథ ముగిసె..

ABN, Publish Date - May 23 , 2024 | 03:50 AM

ఐపీఎల్‌ టైటిల్‌ సాధించాలనుకొన్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) కల మరోసారి భగ్నమైంది. వరుసగా ఆరు విజయాలతో ప్లేఆఫ్స్‌ చేరుకొన్న బెంగళూరును రాజస్థాన్‌ రాయల్స్‌ నాకౌట్‌ చేసింది...

ఎలిమినేటర్‌లో రాజస్థాన్‌ విజయం

రేపు క్వాలిఫయర్‌-2లో హైదరాబాద్‌తో ఢీ

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ టైటిల్‌ సాధించాలనుకొన్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) కల మరోసారి భగ్నమైంది. వరుసగా ఆరు విజయాలతో ప్లేఆఫ్స్‌ చేరుకొన్న బెంగళూరును రాజస్థాన్‌ రాయల్స్‌ నాకౌట్‌ చేసింది. బుధవారం హోరాహోరీగా సాగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ 4 వికెట్ల తేడాతో ఆర్సీబీపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నెగ్గిన రాజస్థాన్‌ ఫైనల్లో చోటుకోసం.. శుక్రవారం జరిగే క్వాలిఫయర్‌-2లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది. మరోవైపు ఆర్సీబీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలుత బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 172/8 స్కోరు చేసింది. రజత్‌ పటీదార్‌ (22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34), కోహ్లీ (24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 33), మహిపాల్‌ లోమ్రోర్‌ (17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అశ్విన్‌ (2/19), బౌల్ట్‌ (1/16) బెంగళూరు బ్యాటర్లను కట్టడి చేయగా.. అవేశ్‌ ఖాన్‌ 3 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో రాజస్థాన్‌ 19 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసి గెలిచింది. యశస్వీ జైస్వాల్‌ (30 బంతుల్లో 8 ఫోర్లతో 45), రియాన్‌ పరాగ్‌ (26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36), హెట్‌మయెర్‌ (14 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 26) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. సిరాజ్‌ 2 వికెట్లు తీశాడు.


ఆదుకొన్న పరాగ్‌-హెట్‌మయెర్‌: లక్ష్య ఛేదనలో ఓ దశలో ఉత్కంఠ రేగినా.. పరాగ్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌కు హెట్‌మయెర్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌ తోడు కావడంతో రాజస్థాన్‌ విజయం సాధించింది. వీరిద్దరూ 5వ వికెట్‌కు 25 బంతుల్లో 45 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గెలుపు ముంగిట నిలిపారు. ఓపెనర్లు జైస్వాల్‌, టామ్‌ కోహ్లెర్‌ (20) శుభారంభాన్ని అందించారు. తొలి రెండు ఓవర్లు ఆచితూచి ఆడినా.. మూడో ఓవర్‌లో యశ్‌ దయాళ్‌ బౌలింగ్‌లో జైస్వాల్‌ నాలుగు బౌండ్రీలతో విరుచుకుపడ్డాడు. మరోవైపు కోహ్లెర్‌ కూడా ఫోర్లతో బ్యాట్‌కు పనిచెప్పడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అయితే, ఆరో ఓవర్‌లో కోహ్లెర్‌ను ఫెర్గూసన్‌ బౌల్డ్‌ చేయడంతో.. పవర్‌ప్లే ముగిసే సమయానికి రాజస్థాన్‌ 47/1తో మెరుగ్గా కనిపించింది. మధ్య ఓవర్లలో కూడా జైస్వాల్‌ ఎడాపెడా షాట్లతో జోరు కొనసాగించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ శాంసన్‌ (17) అతడికి చక్కని సహకారం అందిస్తూ స్కోరు బోర్డును నడిపించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 35 పరుగులు జోడించారు. అయితే, నాలుగు పరుగుల తేడాతో జైస్వాల్‌, శాంసన్‌ వికెట్లు కోల్పోయిన రాజస్థాన్‌ 86/3తో ఒక్కసారిగా ఇబ్బందుల్లో పడింది. 10వ ఓవర్‌లో జైస్వాల్‌ను గ్రీన్‌ క్యాచవుట్‌ చేయగా.. ఆ తర్వాతి ఓవర్‌లో కర్ణ్‌ బౌలింగ్‌లో శాంసన్‌ స్టంపౌట్‌ అయ్యాడు.

కోహ్లీ మెరుపు ఫీల్డింగ్‌తో ధ్రువ్‌ జురెల్‌ (8) రనౌట్‌ కావడంతో.. రాయల్స్‌ శిబిరంలో గుబులు రేగింది. ఈ దశలో పరాగ్‌కు జత కలసిన హెట్‌మయెర్‌ అటాకింగ్‌ గేమ్‌తో ఆశలు రేపాడు. చివరి 5 ఓవర్లలో రాయల్స్‌ గెలుపునకు 47 పరుగులు కావాల్సి ఉండగా.. గ్రీన్‌ వేసిన 16వ ఓవర్‌లో హెట్‌మయెర్‌, పరాగ్‌ చెరో సిక్స్‌తో 17 పరుగులు పిండుకొన్నారు. దీంతో లక్ష్యం 24 బంతుల్లో 30 పరుగులకు దిగివచ్చింది. ఆ తర్వాత హెట్‌మయెర్‌ మరో రెండు బౌండ్రీలు బాదడంతో మ్యాచ్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ వైపు మొగ్గింది. 18వ ఓవర్‌లో పరాగ్‌, హెట్‌మయర్‌ను సిరాజ్‌ అవుట్‌ చేసినా.. పావెల్‌ (8 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో16 నాటౌట్‌) 4,4,6తో మరో ఆరు బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు.


తడబడుతూనే..: బౌల్ట్‌, అశ్విన్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో.. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు తడబడింది. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ.. కీలక భాగస్వామ్యాలు నిర్మించలేక ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. పవర్‌ప్లేలో బౌల్ట్‌ పదునైన బంతులతో ముప్పుతిప్పలు పెట్టడంతో.. ఓపెనర్లు కోహ్లీ, డుప్లెసి (17) దూకుడుగా ఆడలేకపోయారు. తన తొలి మూడు ఓవర్లలో 6 పరుగులు మాత్రమే ఇచ్చిన బౌల్ట్‌.. డుప్లెసిని క్యాచవుట్‌ చేశాడు. దీంతో తొలి వికెట్‌కు 37 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. బౌండ్రీ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న పావెల్‌ డైవ్‌ చేస్తూ అద్భుత క్యాచ్‌ అందుకోవడంతో డుప్లెసి నిరాశగా వెనుదిరిగాడు. అయితే, సందీప్‌, అవేశ్‌ లక్ష్యంగా కోహ్లీ బ్యాట్‌ను ఝుళిపించడంతో.. పవర్‌ప్లేను బెంగళూరు 50/1తో ముగించింది. ఇక, మధ్య ఓవర్లలో స్పిన్నర్లు అశ్విన్‌, చాహల్‌ కూడా పరుగులను కట్టడి చేస్తూ బెంగళూరుపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో దూకుడుగా ఆడే ప్రయత్నం చేస్తున్న కోహ్లీని చాహల్‌ ఊరించే బంతితో బోల్తా కొట్టించాడు. కానీ, బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుగా వన్‌డౌన్‌లో వచ్చిన గ్రీన్‌ (27) 6,4తో బ్యాట్‌కు పని చెప్పడంతో 10 ఓవర్లకు జట్టు 76/2తో నిలిచింది. మరోవైపు అవుటయ్యే ప్రమాదం నుంచి బతికిపోయిన రజత్‌ పటీదార్‌.. గ్రీన్‌తో కలసి మూడో వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొనే ప్రయత్నం చేశాడు. అయితే, స్కోరు బోర్డు వేగం పుంజుకొంటున్న సమయంలో 13వ ఓవర్‌లో గ్రీన్‌తోపాటు మ్యాక్స్‌వెల్‌ (0)ను అవుట్‌ చేసిన అశ్విన్‌.. బెంగళూరును కోలుకోలేని దెబ్బకొట్టాడు.

పావెల్‌ అందుకొన్న మరో గ్రేట్‌ క్యాచ్‌తో గ్రీన్‌ పెవిలియన్‌ చేరగా.. భారీ షాట్‌ ఆడే క్రమంలో మ్యాక్సీ అవుటయ్యాడు. ఈ దశలో పటీదార్‌, మహిపాల్‌ లోమ్రోర్‌ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరు బోర్డులో ఊపు తెచ్చారు. చాహల్‌ వేసిన 14వ ఓవర్‌లో రజత్‌ 6,4 కొట్టగా.. లోమ్రోర్‌ సిక్స్‌తో ఆ ఓవర్‌లో 19 పరుగులు లభించాయి. కానీ, పటీదార్‌తోపాటు దినేష్‌ కార్తీక్‌ (11), లోమ్రోర్‌ను అవేశ్‌ వెనక్కి పంపాడు. ఇక, ఆఖరి ఓవర్‌లో కర్ణ్‌ శర్మ (5), స్వప్నిల్‌ (9 నాటౌట్‌) 4,6తో టీమ్‌ స్కోరును 170 మార్క్‌ దాటించారు. రాయల్స్‌ బౌలర్ల దెబ్బకు డెత్‌ ఓవర్లలో బెంగళూరు 47 పరుగులు మాత్రమే చేసింది.


స్కోరుబోర్డు

బెంగుళూరు: కోహ్లీ (సి) (సబ్‌-ఫెరీరా) (బి) చాహల్‌ 33, డుప్లెసి (సి) పావెల్‌ (బి) బౌల్ట్‌ 17, గ్రీన్‌ (సి) పావెల్‌ (బి) అశ్విన్‌ 27, పటిదార్‌ (సి) పరాగ్‌ (బి) అవేశ్‌ 34, మ్యాక్స్‌వెల్‌ (సి) జురెల్‌ (బి) అశ్విన్‌ 0, లోమ్రోర్‌ (సి) పావెల్‌ (బి) అవేశ్‌ 32, దినేశ్‌ కార్తీక్‌ (సి) జైస్వాల్‌ (బి) అవేశ్‌ 11, స్వప్నిల్‌ (నాటౌట్‌) 9, కర్ణ్‌ శర్మ (సి) పావెల్‌ (బి) సందీప్‌ శర్మ 5, ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం: 20 ఓవర్లలో 172/8; వికెట్ల పతనం: 1-37, 2-56, 3-97, 4-97, 5-122, 6-154, 7-159, 8-172; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-16-1, సందీప్‌ 4-0-48-1, అవేశ్‌ 4-0-44-3, అశ్విన్‌ 4-0-19-2, చాహల్‌ 4-0-43-1.

రాజస్థాన్‌: జైస్వాల్‌ (సి) కార్తీక్‌ (బి) గ్రీన్‌ 45, కోహ్లెర్‌ (బి) ఫెర్గూసన్‌ 20, శాంసన్‌ (స్టంప్డ్‌) కార్తీక్‌ (బి) కర్ణ్‌ 17, రియాన్‌ పరాగ్‌ (బి) సిరాజ్‌ 36, జురెల్‌ (రనౌట్‌) 8, హెట్‌మయెర్‌ (సి) డుప్లెసి (బి) సిరాజ్‌ 26, పావెల్‌ (నాటౌట్‌) 16, అశ్విన్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 19 ఓవర్లలో 174/6; వికెట్ల పతనం: 1-46, 2-81, 3-86, 4-112, 5-157, 6-160; బౌలింగ్‌: స్వప్నిల్‌ 2-0-19-0, సిరాజ్‌ 4-0-33-2, యశ్‌ దయాల్‌ 3-0-37-0, ఫెర్గూసన్‌ 4-0-37-1, కర్ణ్‌ శర్మ 2-0-19-1, గ్రీన్‌ 4-0-28-1.

1

ఐపీఎల్‌లో 8 వేల పరుగుల మైలురాయి చేరిన తొలి బ్యాటర్‌గా విరాట్‌ కోహ్లీ.

Updated Date - May 23 , 2024 | 03:50 AM

Advertising
Advertising