అల్విదా.. సునీల్ ఛెత్రి
ABN, Publish Date - May 17 , 2024 | 02:12 AM
భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఎనలేని ఖ్యాతి తీసుకువచ్చిన సూపర్‌స్టార్, కెప్టెన్ సునీల్ ఛెత్రి రెండు దశాబ్దాల అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నాడు. జూన్ 6న కువైట్‌తో...
వచ్చే నెల 6న చివరి ఫుట్‌బాల్ మ్యాచ్
న్యూఢిల్లీ: భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఎనలేని ఖ్యాతి తీసుకువచ్చిన సూపర్‌స్టార్, కెప్టెన్ సునీల్ ఛెత్రి రెండు దశాబ్దాల అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నాడు. జూన్ 6న కువైట్‌తో జరిగే ఫిఫా వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచ్ అతడికి చివరిది కానుంది. ఈమేరకు అతడు ఎక్స్‌లో ఓ వీడియో విడుదల చేశాడు. ‘19 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో మధుర జ్ఞాపకాలు. ఒత్తిడి, బాధ్యతలు, అంతులేని ఆనందం ఇలా ఎన్నో భావోద్వేగాలను అనుభవించాను. ఇన్నేళ్లపాటు భారత్‌కు ఆడతానని అనుకోలేదు. ఇక నా రిటైర్మెంట్ నిర్ణయాన్ని తల్లి, భార్యతో పంచుకున్నప్పుడు వారు కంటతడి పెట్టుకున్నారు’ అని 39 ఏళ్ల ఛెత్రి తెలిపాడు. సిక్కింకు చెందిన ఈ స్టార్ ఆటగాడు 1984లో హైదరాబాద్‌లో జన్మించాడు. 2005లో జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేయగా, ఆడిన 150 మ్యాచ్‌ల్లో 94 గోల్స్ చేశాడు. ప్రస్తుతం ఫుట్‌బాల్‌లో కొనసాగుతున్న ఆటగాళ్లలో క్రిస్టియానో రొనాల్డో (128), మెస్సీ (106) తర్వాత ఛెత్రివే అత్యధిక గోల్స్ కావడం విశేషం. అతడి సారథ్యంలో భారత ఫుట్‌బాల్ జట్టు ఆసియన్ ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ చాలెంజ్ కప్, శాఫ్ చాంపియన్‌షి్‌ప, ఇంటర్‌కాంటినెంటల్ కప్‌లను దక్కించుకుంది. మరోవైపు ఛెత్రి రిటైర్మెంట్‌పై వివిధ క్రీడాప్రముఖులు సోషల్‌మీడియాలో స్పందిస్తూ అతడి సేవలను కొనియాడారు.
Updated Date - May 17 , 2024 | 02:12 AM