ఢిల్లీ ఢమాల్
ABN, Publish Date - May 13 , 2024 | 12:54 AM
ఇరు జట్లదీ కచ్చితంగా గెలిచితీరాల్సిన పరిస్థితే.. కానీ కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతులెత్తేసింది. బౌలర్లు మెరుగ్గానే రాణించినా, బ్యాటింగ్, ఫీల్డింగ్ వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది. అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాత్రం...
నేటి మ్యాచ్
గుజరాత్ X కోల్‌కతా, రాత్రి 7.30 గం. వేదిక: అహ్మదాబాద్
బెంగళూరుకు వరుసగా ఐదో గెలుపు
రేసు రసవత్తరం
బెంగళూరు: ఇరు జట్లదీ కచ్చితంగా గెలిచితీరాల్సిన పరిస్థితే.. కానీ కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతులెత్తేసింది. బౌలర్లు మెరుగ్గానే రాణించినా, బ్యాటింగ్, ఫీల్డింగ్ వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది. అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాత్రం అనూహ్య ఆటతీరుతో దూసుకెళుతోంది. వరుసగా ఆరు ఓటములతో ఫ్యాన్స్‌ను నిరాశపరిచిన ఈ జట్టు ఆ తర్వాత బలంగా పుంజుకుని వరుసగా ఐదో గెలుపును ఖాతాలో వేసుకొంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 47 రన్స్‌తో ఢిల్లీపై ఘనవిజయం సాధించింది. దీంతో 12 పాయింట్లతో ఐదో స్థానానికి చేరింది. డీసీ ఆరో స్థానానికి పడిపోయింది. ఫలితంగా ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ ఆశలు కూడా సజీవం కావడంతో రేసు రసవత్తరంగా మారింది. ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు చేసింది. రజత్ పటీదార్ (52), విల్ జాక్స్ (41), గ్రీన్ (32 నాటౌట్) రాణించారు. రసిక్, ఖలీల్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో ఢిల్లీ 19.1 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. అక్షర్ (57), హోప్ (29) మాత్రమే రాణించారు. యష్ దయాల్‌కు 3, ఫెర్గూసన్‌కు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా గ్రీన్ నిలిచాడు. కోహ్లీకిది 250వ ఐపీఎల్ మ్యాచ్.
అక్షర్ ఒక్కడే: ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ అక్షర్ పటేల్ మాత్రమే ఆకట్టుకున్నాడు. ఓ మాదిరి ఛేదనే అయినా పేలవ షాట్లకు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. చాలా రోజులతర్వాత జట్టులో స్థానం దక్కించుకున్న ఓపెనర్ వార్నర్ (1) తొలి ఓవర్‌లోనే నిష్క్రమించగా.. మూడో ఓవర్‌లో అభిషేక్ పోరెల్ (2)తో పాటు 2 సిక్సర్లు, 2 ఫోర్లతో జోరు మీదున్న మరో ఓపెనర్ ఫ్రేజర్ (21) అవుటయ్యారు. కుషాగ్ర (2)ను సిరాజ్ ఎల్బీ చేయడంతో 30/4 స్కోరుతో జట్టు కష్టాల్లో పడింది. ఈ స్థితిలో అక్షర్-హోప్ జోడీ వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. ఐదో ఓవర్‌లో హోప్ 3 ఫోర్లతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత అక్షర్ 2 ఫోర్లతో పవర్‌ప్లేలో 54/4తో జట్టు ఫర్వాలేదనిపించింది. అనంతరం బౌలర్లు కట్టడి చేయడంతో పరుగుల వేగం తగ్గింది. పదో ఓవర్‌లో హోప్‌ను ఫెర్గూసన్ అవుట్ చేయడంతో ఐదో వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ వెంటనే స్టబ్స్ (3) రనౌటయ్యాడు. అటు అక్షర్ జోరు కొనసాగిస్తూ జాక్స్ ఓవర్‌లో రెండు సిక్సర్లతో 30 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. కానీ కాసేపట్లోనే రసిక్ (10), అక్షర్ వరుస ఓవర్లలో పెవిలియన్ చేరడంతో ఢిల్లీ ఓటమి ఖాయమైంది.
ఆదుకున్న పటీదార్-జాక్స్: తొలి పది ఓవర్లలో 110/2.. ఆ తర్వాత చేసింది 77/7 మాత్రమే. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ ఆడిన తీరిది. రజత్ పటీదార్-విల్ జాక్స్ ఉన్నంతసేపు సులువుగా 200 దాటుతుందనిపించినా.. ఆఖర్లో ఢిల్లీ బౌలర్లు అదరగొట్టారు. తొలి నాలుగు ఓవర్లలోనే ఓపెనర్లు డుప్లెసి (6), విరాట్ (27) వికెట్లను కోల్పోయింది. ఈ దశలో విల్ జాక్స్, రజత్ పటీదార్ జోడీ బౌలర్లను దీటుగా ఎదుర్కొంది. దీనికి తోడు కుల్దీప్ ఓవర్‌లో వీరిచ్చిన సులువైన క్యాచ్‌లను వదిలివేయడం కలిసివచ్చింది. ఐదో ఓవర్‌లో పటీదార్ 3 ఫోర్లు బాదడంతో పవర్‌ప్లేలో జట్టు 61/2 స్కోరుతో నిలిచింది. ఆ తర్వాత కూడా ఇద్దరూ భారీ షాట్లతో ఆకట్టుకున్నారు. దీంతో పటీదార్ 29 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఎట్టకేలకు 13వ ఓవర్‌లో పటీదార్ ఇచ్చిన క్యాచ్‌ను అక్షర్ అందుకోవడంతో మూడో వికెట్‌కు 88 పరుగుల భాగస్వా మ్యం ముగిసింది. వెంటనే జాక్స్‌ను కుల్దీప్ అవుట్ చేశాడు. ఈ దశలో 17వ ఓవర్‌లో గ్రీన్ రెండు, లొమ్రోర్ (13) ఓ సిక్సర్‌తో 22 రన్స్ వచ్చాయి. కానీ చివరి 3 ఓవర్లలో జట్టు తడబడింది. లొమ్రోర్, దినేశ్ కార్తీక్ (0)లను ఖలీల్ ఒకే ఓవర్‌లో అవుట్ చేయగా.. ఆ తర్వాత 12 బంతుల్లో 13 పరుగులే చేసిన ఆర్‌సీబీ స్వప్నిల్ (0), కర్ణ్ శర్మ (6), సిరాజ్ (0) వికెట్లను కోల్పోయింది. దీంతో 190 రన్స్ లోపే ఇన్నింగ్స్ ముగిసింది.
స్కోరుబోర్డు
బెంగళూరు: కోహ్లీ (సి) అభిషేక్ (బి) ఇషాంత్ 27, డుప్లెసి (సి) ఫ్రేజర్ (బి) ముకేశ్ 6, విల్ జాక్స్ (సి) అక్షర్ (బి) కుల్దీప్ 41, పటీదార్ (సి) అక్షర్ (బి) రసిక్ 52, గ్రీన్ (నాటౌట్) 32, లోమ్రోర్ (సి) అభిషేక్ (బి) ఖలీల్ 13, కార్తీక్ (సి) కుల్దీప్ (బి) ఖలీల్ 0, స్వప్నిల్ (సి) కుశాగ్ర (బి) రసిక్ 0, కర్ణ్ శర్మ (రనౌట్) 6, సిరాజ్ (రనౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 187/9; వికెట్ల పతనం: 1-23, 2-36, 3-124, 4-137, 5-174, 6-174, 7-176, 8-185, 9-187; బౌలింగ్: ఇషాంత్ 3-0-31-1, ఖలీల్ 4-0-31-2, ముకేశ్ 3-0-23-1, అక్షర్ 3-0-24-0, కుల్దీప్ 4-0-52-1, రసిక్ 3-0-23-2.
ఢిల్లీ: వార్నర్ (సి) జాక్స్ (బి) స్వప్నిల్ 1, ఫ్రేజర్ (రనౌట్) 21, అభిషేక్ పొరెల్ (సి) ఫెర్గూసన్ (బి) యశ్ దయాల్ 2, హోప్ (సి) కర్ణ్ (బి) ఫెర్గూసన్ 29, కుశాగ్ర (ఎల్బీ) సిరాజ్ 2, అక్షర్ (సి) డుప్లెసి (బి) యశ్ దయాల్ 57, స్టబ్స్ (రనౌట్) 3, రసిక్ (సి) జాక్స్ (బి) గ్రీన్ 10, కుల్దీప్ (బి) యశ్ దయాల్ 6, ముకేశ్ (సి) లోమ్రోర్ (బి) ఫెర్గూసన్ 3, ఇషాంత్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 19.1 ఓవర్లలో 140 ఆలౌట్: వికెట్ల పతనం: 1-8, 2-24, 3-24, 4-30, 5-86, 6-90, 7-127, 8-128, 9-135, 10-140; బౌలింగ్: స్వప్నిల్ 1-0-9-1, సిరాజ్ 4-0-33-1, యశ్ దయాల్ 3.1-0-20-3, కర్ణ్ శర్మ 2-0-19-0, ఫెర్గూసన్ 4-0-23-2, గ్రీన్ 4-0-19-1, విల్ జాక్స్ 1-0-16-0.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే
కోల్‌కతా 12 9 3 0 18 1.428
రాజస్థాన్ 12 8 4 0 16 0.349
చెన్నై 13 7 6 0 14 0.528
హైదరాబాద్ 12 7 5 0 14 0.406
బెంగళూరు 13 6 7 0 12 0.387
ఢిల్లీ 13 6 7 0 12 -0.482
లఖ్‌నవూ 12 6 6 0 12 -0.769
గుజరాత్ 12 5 7 0 10 -1.063
ముంబై 13 4 9 0 8 -0.271
పంజాబ్ 12 4 8 0 8 -0.423
1
ఐపీఎల్‌లో ఎక్కువసార్లు (18) డకౌట్ అయిన బ్యాటర్‌గా దినేశ్ కార్తీక్
Updated Date - May 13 , 2024 | 12:54 AM