ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అంతఃసౌందర్యం ముఖ్యం

ABN, Publish Date - Aug 29 , 2024 | 05:49 AM

‘మిస్‌ ఇండియా అందాల పోటీల్లో శారీరక సౌందర్యం ఒక్కటే అర్హత కాదు, అంతఃసౌందర్యం కూడా చాలా ముఖ్యం’ అంటారు ఫెమినా ‘మిస్‌ తెలంగాణ- 2024’ టైటిల్‌ విజేత ప్రకృతి కంబం. ‘మిస్‌ ఇండియా’ పోటీలకు ఎంపికైన ఈ అమ్మాయి లలిత కళలు, క్రీడల్లో మాత్రమే కాదు...

‘మిస్‌ ఇండియా అందాల పోటీల్లో శారీరక సౌందర్యం ఒక్కటే అర్హత కాదు, అంతఃసౌందర్యం కూడా చాలా ముఖ్యం’ అంటారు ఫెమినా ‘మిస్‌ తెలంగాణ- 2024’ టైటిల్‌ విజేత ప్రకృతి కంబం. ‘మిస్‌ ఇండియా’ పోటీలకు ఎంపికైన ఈ అమ్మాయి లలిత కళలు, క్రీడల్లో మాత్రమే కాదు... నిజ జీవితంలోనూ ఒక ధీర. అందం, ఆత్మవిశ్వాసంతో పాటు దక్షిణాది సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యాన్ని చాటడానికి ‘మిస్‌ ఇండియా’ పోటీలను ఒక వేదికగా మలుచుకొంటానని చెబుతున్న ప్రకృతితో ‘నవ్య’ మాట కలిపింది.

‘‘మిస్‌ ఇండియా’ పోటీలకు ఎంపికవడం చాలా సంతోషంగా ఉంది. ఇది నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. నన్ను నేను మరింతగా మెరుగు పరుచుకొంటూ, కొత్త విషయాలు నేర్చుకొంటూ ముందుకు వెళ్లడానికి అవసరమైన స్థైర్యాన్ని ఈ పోటీలు నాకు కల్పించాయి. అందాల పోటీలో శారీరక సౌందర్యం ఒక్కటే ప్రామాణికం కాదు. అంతకు మించి క్రమశిక్షణ, మేధస్సు, సామాజిక స్పృహ, సాంస్కృతిక అస్తిత్వం, వ్యక్తిత్వం తాలూకూ ప్రభావాలు మరెన్నో ముడిపడి ఉంటాయి. శరీర దారుఢ్యం కూడా చాలా కీలకం. తెల్లవారుజామున 4.30కి నా రోజు మొదలవుతుంది. యోగాతో పాటు జిమ్‌లో వర్కవుట్స్‌ లాంటివి చేస్తుంటాను. ‘మిస్‌ ఇండియా’ పోటీల్లో స్పీచ్‌, వాక్స్‌ వంటి రకరకాల విభాగాల్లో మెప్పించాలి. ఆ క్రమంలో నడకను, ఉచ్చారణను, ఆలోచనలను, ఆహార్యాన్ని... ఇలా ప్రతి ఒక్క అంశాన్నీ న్యాయనిర్ణేతలు సూక్ష్మంగా పరిశీలిస్తారు. కనుక అందాల పోటీలో రాణించడానికి అంతఃసౌందర్యంతో పాటు బహుముఖ ప్రజ్ఞ కూడా చాలా అవసరం. ఈ పోటీలో పాల్గొనడం అంటే మరొకరితో పోటీ పడటం కాదు... నాతో నేను తలపడుతున్నట్టు.

అథ్లెటిక్స్‌లోనూ...

జీవితంలో ఎలాంటి కష్టం లేకుండా విజయం వరించడం సాధ్యం కాదు కదా. మనం ఎంచుకున్న ఈ రంగంలోనూ కొన్ని కష్టాలుంటాయి. ముఖ్యంగా మనకు ఇష్టమైన ఆహారాన్ని చాలా సందర్భాలలో తీసుకోలేకపోవచ్చు. నేనైతే, రోజులో ఎక్కువగా నీళ్లు తాగుతుంటాను. చర్మాన్ని కాంతిమంతంగా ఉంచడంలో అంతకు మించిన చిట్కా మరొకటి లేదని నమ్ముతాను. డైట్‌ విషయంలో చాలా కచ్చితంగా ఉంటాను. చిన్నప్పటి నుంచి క్రీడలన్నా, నృత్యం, సంగీతమన్నా విపరీతమైన ఇష్టం. నేను అథ్లెట్‌ను కూడా. స్కూల్‌, కాలేజీ రోజుల్లో త్రోబాల్‌ టీమ్‌ కెప్టెన్‌గా వ్యవహరించాను. అందాల పోటీల వైపు ఆసక్తి కలగకపోతే, క్రీడా రంగం వైపు వెళ్లేదాన్నేమో! భరతనాట్యంతో పాటు హిప్‌హాప్‌ లాంటి పాశ్చాత్య నృత్యరీతులనూ నేర్చుకొన్నాను. అవన్నీ నాకు ఈ పోటీల్లో పనికొస్తున్నాయి. కల్చరల్‌ ఐడెంటిటీ ఇక్కడ చాలా కీలకం. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సంస్కృతుల మేళవింపును నేను ‘మిస్‌ ఇండియా’ పోటీ వేదికపై పరిచయం చేయాలని అనుకొంటున్నాను. అదే నా అస్తిత్వం కూడా.

అమ్మానాన్న ప్రోత్సాహం...

ఇదివరకు ‘మిస్‌ గ్రాండ్‌ కర్ణాటక’, ‘టైమ్స్‌ ఫ్రెష్‌ ఫేస్‌ బెంగళూరు’ టైటిల్స్‌ గెలుచుకున్నాను. నిజానికి అందాల పోటీలో పాల్గొనాలన్న ఆలోచనకు స్ఫూర్తి మా అక్క ప్రేరణ. తను నాకన్నా నాలుగేళ్లు పెద్ద. నిబంధనల ప్రకారం ఉండాల్సినంత ఎత్తు లేకపోవడంతో ‘మిస్‌ ఇండియా’ పోటీ ఫైనల్స్‌ వరకు వెళ్లి వెనక్కి వచ్చింది. దాంతో నన్ను అటువైపు వెళ్లమని అక్క ప్రేరేపించింది. చదువుతో పాటు ఆట, పాటలన్నిటిలో అమ్మానాన్న మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. చదువు పూర్తయ్యాక ఎటువైపు వెళ్లినా తమకు అభ్యంతరం లేదన్నారు. అందాల పోటీ అనగానే ‘ఆ రంగంలోని లోటుపాట్లు, కష్టసుఖాలన్నిటినీ ముందు అర్థం చేసుకోండి. తర్వాత మీ వంతు కృషితో ముందుకు సాగండి’అని సూచించారు.

సినిమాల్లో రాణించాలి...

తెలుగు సినిమాల్లో నటిగా రాణించాలన్నది నా అంతిమ లక్ష్యం. ఇప్పటికే మా అక్క ప్రేరణ తెలుగు సీరియల్‌ ‘కృష్ణాముకుంద మురారీ’లో లీడ్‌ రోల్‌ చేస్తోంది. నేనూ ఒక సినిమాలో నటించాను. ఇప్పటికే సినిమాల వైపు కూడా దృష్టిపెడుతూ, కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటున్నాను. అల్లు అర్జున్‌తో నటించాలన్నది నా కోరిక. ప్రస్తుతం ‘మిస్‌ ఇండియా’ పోటీలకు సన్నద్ధమవుతున్నాను. ప్రతి అమ్మాయికీ తన కెరీర్‌ను ఎంపిక చేసుకోవడంలో స్వేచ్ఛ ఉండాలి. వారి కలలకు తల్లిదండ్రులు మద్దతుగా నిలవాలి. అందాల పోటీలో పాల్గొని టైటిల్స్‌ గెలవడమే నా ఆశయం కాదు, నా వంతుగా సమాజానికి సహాయపడాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల ముఖంలో సంతోషాన్ని చూడటానికి అవసరమైన కార్యక్రమాలు నిర్వహించాలన్నది నా కోరిక.’’


అందుకు గర్విస్తున్నా...

నేను పుట్టి, పెరిగిందంతా బెంగళూరులో. అక్కడే బీకామ్‌ పూర్తి చేశాను. మాది తెలంగాణ. మా తాతయ్య ప్రొఫెసర్‌ కేవీ బాలముకుంద్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగాధిపతిగా పని చేశారు. మా నానమ్మ నీల తొలినాళ్లలో ఆకాశవాణిలో గాయని. ఒకప్పుడు కటుంబమంతా చిక్కడపల్లిలో ఉండేవాళ్లు. మా నాన్న పురుషోత్తం సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కావడంతో ఉద్యోగరీత్యా బెంగళూరులో స్థిరపడ్డారు. మా అమ్మ రూప తమిళియన్‌. అలా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో నాకు మంచి ప్రవేశమే ఉంది. కర్ణాటకలో ఉన్నా, తెలుగు భాషా, సంస్కృతులకు దగ్గరగానే పెరిగాను. మా నాయనమ్మ ప్రభావంతో ఇక్కడి పండుగలు, ఆచార వ్యవహారాలన్నీ చిన్నప్పటి నుంచి నా జీవితంలో భాగం అయ్యాయి. నాన్న ద్వారా ఈ నేల గొప్పతనం గురించి ఎన్నోసార్లు విన్నాను. అలాంటిది ఇప్పుడు తెలంగాణ అమ్మాయిగా ‘మిస్‌ ఇండియా’ పోటీలకు వెళ్లడం నాకు చాలా గర్వంగా ఉంది.

అలా చూడటం సరికాదు...

లైంగిక దాడి లేదా వేధింపులకు లోనైనవారిని బాధితులుగా చూడటం సరికాదు. అసలు వారిని అలా సంబోధించకూడదు కూడా. ఒక అమ్మాయి తనకెదురైన హింసను బయటకు వెల్లడించడానికి అనువైన వాతావరణం ఇంట, బయట తప్పనిసరిగా కల్పించాలి. తనకు ఒక భరోసా ఇవ్వగలగాలి. అంతేకానీ... కుటుంబ పరువు, ప్రతిష్ట పేరుతో నోరు మూయించడం లాంటివి చేస్తే మాత్రం సమాజంలో మరింత మంది నేరగాళ్లు తయారవడానికి మనమే పరోక్షంగా కారణం అవుతాం. ‘హింసను ఎదుర్కొన్నవారు సైతం మీ అంతరాత్మకు మినహా మరెవ్వరి సందేహాలనూ తీర్చనక్కర్లేదు. ఎవరో ఏదో అనుకొంటారని వెనకడుగు వేయద్దు. నిర్భయంగా బయటకు వచ్చి అన్యాయంపై పెదవి విప్పండి. నిశ్శబ్దాన్ని ఛేదించండి. ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లండి’ అని ప్రతి ఒక్కరికీ ఓ సోదరిగా చెబుతాను.


వేధింపులకు వ్యతిరేకంగా...

కోల్‌కతాలో డాక్టర్‌ మీద అఘాయిత్యం, మహారాష్ట్ర బద్లాపూర్‌లోని చిన్నారులపై అమానుషం... ఇలాంటి వార్తలు వింటున్నప్పుడు మనసంతా ఆందోళనగా ఉంటుంది. అలా అని బాధపడుతూనో, భయపడుతూనో కూర్చోకూడదు కదా! మనం బతికేది ఇలాంటి సమాజంలోనా? అని ప్రశ్నిస్తూ దోషులను, సమాజాన్ని నిలదీయాలి. ప్రతి ఆడపిల్ల జీవితంలో వేధింపులు భాగమేమో. నాకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని తప్పనిసరిగా ఇక్కడ ప్రస్తావించాలి. స్కూల్లో చదువుతున్నప్పుడు చాలామందిలానే నేనూ శారీరక, మానసిక, లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను. అది నన్ను బాగా కుంగదీసింది. ఆ బాధను బహిర్గతం చేయాలా వద్దా అని చాలా రోజులు నాలో నేను మధనపడ్డాను. ఇలా ఎన్నాళ్లని కుమిలిపోవాలి? నేను చెయ్యని తప్పునకు నేనెందుకు ఆత్మన్యూనతకు లోనవ్వాలి? ఒక రోజు జరిగిన విషయాన్ని అమ్మానాన్న దృష్టికి తీసుకెళ్లాను. ఆ సమయంలో వారు నాకు అందించిన ధైర్యం, నా పట్ల ప్రవర్తించిన తీరు నన్ను ఒక ధీరగా నిలబెట్టాయి. నా జీవితంలో గర్వపడే క్షణాలు అంటే, నా చేదు అనుభవాన్ని బహిర్గతం చేయడమే. అమానుషత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తడమే.

కేవీ

ఫొటోలు:రాజ్‌కుమార్‌

Updated Date - Aug 29 , 2024 | 05:49 AM

Advertising
Advertising