ఆధ్యాత్మిక బలం కోసం..
ABN, Publish Date - Aug 16 , 2024 | 06:00 AM
‘‘హలధరుడు, గదాధరుడు, రేవతీకాంతుడు, భక్తవత్సలుడు, ధరణీధరుడు, బలశ్రేష్టుడు, ప్రలంబాసురుణ్ణి సంహరించినవాడు, శ్రీకృష్ణుడికి అగ్రజుడు అయిన బలరామునికి ప్రణామాలు. మా మీద దయచూపించి, మమ్మల్ని సదా రక్షించు’’ అని భావం. శ్రీకృష్ణుడి అన్న అయిన బలరాముని జయంతిని శ్రావణ పౌర్ణమి రోజున
19న శ్రీబలరామ జయంతి
నామస్తే హలాగ్రహ నామస్తే మూశలాయుధ
నామస్తే రేవతీ కాంత నామస్తే భక్త వత్సల
నామస్తే బలానాం శ్రేష్ఠ నామస్తే ధరణీధర
ప్రలంబారే నామస్తేస్తు త్రాహిమం కృష్ణ పూర్వజ
‘‘హలధరుడు, గదాధరుడు, రేవతీకాంతుడు, భక్తవత్సలుడు, ధరణీధరుడు, బలశ్రేష్టుడు, ప్రలంబాసురుణ్ణి సంహరించినవాడు, శ్రీకృష్ణుడికి అగ్రజుడు అయిన బలరామునికి ప్రణామాలు. మా మీద దయచూపించి, మమ్మల్ని సదా రక్షించు’’ అని భావం. శ్రీకృష్ణుడి అన్న అయిన బలరాముని జయంతిని శ్రావణ పౌర్ణమి రోజున భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ భక్తులు నిర్వహిస్తారు. రోహిణి, వసుదేవుల తనయుడైన బలరాముడు ‘సంకర్షణ, రామ, బలభద్ర’ అనే పేర్లతో పిలుపులు అందుకున్నాడు. దేవకి గర్భం నుంచి రోహిణి గర్భానికి మార్పు చెందినవాడు కాబట్టి ‘సంకర్షణుడు’ అని, గోకుల వాసులందరినీ సంతోషం కలిగించేవాడు కాబట్టి ‘రామ’ అని, విశేష బలపరాక్రమాలు కలిగినవాడు కాబట్టి ‘బలభద్రు’డనీ అంటారు.
కంసుడి ఆగడాల నుంచి లోకాన్ని రక్షించడానికి శ్రీకృష్ణుడిగా మహావిష్ణువు ఆవిర్భవించబోతున్న సమయంలో... ఆయనకు సహాయపడేందుకు ఆ అనంతశేషుడు భువిపై బలరాముడిగా జన్మించాడు. దేవకీ వసుదేవుల అష్టమ సంతానంగా శ్రీకృష్ణుడు పుట్టాల్సి ఉంది. ఏడో సంతానంగా దేవకి గర్భంలో బలరాముడు ఉన్నాడు. ఆయనను రోహిణి గర్భానికి యోగమాయ మార్చింది. గర్భస్రావం జరిగిందని అందరూ అనుకున్నారు. దేవకి కూడా భయపడింది. కానీ ఆమెకు యోగమాయ ధైర్యం చెప్పి, వాస్తవాన్ని తెలియజేసింది. ఈ విధంగా దేవకికి, రోహిణికి బలరాముడు కుమారుడయ్యాడు. ఆ తరువాత ‘‘నీవు ఈ భూతలంపై వివిధ క్షేత్రాల్లో... దుర్గ, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండికా, కృష్ణా, మాధవి, కన్యకా, మాయా, నారాయణీ, ఈశాని, శారద, అంబిక తదితర పేర్లతో ప్రజల నుంచి పూజలు అందుకుంటావు’’ అని యోగమాయకు శ్రీకృష్ణుడు చెప్పాడు. హరేకృష్ణ ఉద్యమ సంస్థాపకాచార్యులైన శ్రీల ప్రభుపాదులు తన భాష్యంలో బలరాముడి గురించి వివరిస్తూ ‘‘శ్రీకృష్ణుడి పరివ్యాప్త స్వరూపాలలో మొదటి రూపం బలరాముడని పలువురు పండితుల అభిప్రాయం. బలరాముడు ‘మహా సంరక్షణ, కారణాబ్ధిశాయి, గర్భోదక శాయి, క్షీరోదక సాయి, అనంత శేషుడు’ అనే అయిదు రూపాలలోకి తనను విస్తరింపజేసుకున్నాడు. ఈ అయిదు స్వరూపాలే ఆధ్యాత్మిక, భౌతిక జగత్తులు వ్యక్తం కావడానికి మూల కారణం’’ అని తెలిపారు.
ఆధ్యాత్మిక శక్తిలో మూడు అంశాలు ఉంటాయి. అవి సంధిని, సివత్, హ్లాదిని. వీటిలో సంధిని శక్తికి అధిష్టాన దైవం బలరాముడు. బలరాముణ్ణి ప్రార్థించడం ద్వారా శ్రీకృష్ణుని పాదపద్మాల దగ్గరకు చేరే మార్గం సుగమం అవుతుంది. బలరాముడు లేదా ఆయన ప్రతినిధి అయిన ఒక ప్రామాణిక గురువు అనుగ్రహం లేనిదే కృష్ణతత్త్వాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. ‘‘శ్రీకృష్ణుడి పట్ల, గురువు పట్ల ఎవరికైతే అచంచలమైన విశ్వాసం ఉంటుందో... వారిలో సమస్త జ్ఞానం తనంతట తానే భాసిల్లుతుంది’’ అంటుంది శ్వేతాశ్వతర ఉపనిత్తు. ‘‘నాయమాత్మ బలహీనేన లభ్యో... తగినంత ఆధ్యాత్మిక బలం లేనిదే ఆత్మసాక్షాత్కార మార్గంలో పురోగమించడం సాధ్యం కాదు’’ అంటోంది ముండకోపనిషత్తు. ఇందులో ‘బల’ అనే పదం బలరాముణ్ణి సూచిస్తుంది. అయితే అది భౌతిక బలాన్ని ఉద్దేశించిన మాట కాదు. ఆధ్యాత్మిక జీవనంలో ఎవరైనా పురోగమించాలని కోరుకున్నప్పుడు... మాయ, మోహం పలు రకాలుగా అడ్డు పడుతూ ఉంటాయి. వాటిని అధిగమించడానికి తగిన ఆధ్యాత్మిక బలం అవసరం. ఆ బలం బలరాముణ్ణి ప్రార్థించడం వల్ల కలుగుతుంది.
కృష్ణ భక్తికి అవరోధాలుగా నిలిచే మనలోని అంతర్గత శత్రువులను బలరాముడి నుంచి లభించే బలంతో జయించవచ్చు. పవిత్రమైన బలరామ జయంతి రోజున ఆయన అనుగ్రహం కోరుతూ ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి. ‘హరేకృష్ణ హరేరామ’ మంత్రంలోని ‘రామ’ నామం బలరాముణ్ణి కూడా సూచిస్తుంది. ఆ మహామంత్ర జపంతో శ్రీకృష్ణ బలరాముల అనుగ్రహం లభిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి.
శ్రీసత్యగౌర చంద్రదాస ప్రభూజీ
అధ్యక్షుడు, హరే కృష్ణ మూవ్‌మెంట్,
హైదరాబాద్, 9396956984
Updated Date - Aug 16 , 2024 | 06:01 AM