ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Prawn Dishes : రుచికరమైన రొయ్యల వంటలు!

ABN, Publish Date - Jun 29 , 2024 | 12:14 AM

రొయ్యలతో చేసే వంటకాలు రుచికరమే కాదు... ఆరోగ్యకరం కూడా. ఇందులో విటమిన్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. రొయ్యల బిర్యానీ, గోంగూర రొయ్యల కూర,

రొయ్యలతో చేసే వంటకాలు రుచికరమే కాదు...

ఆరోగ్యకరం కూడా. ఇందులో విటమిన్లు, ప్రొటీన్లు

పుష్కలంగా ఉంటాయి. రొయ్యల బిర్యానీ, గోంగూర రొయ్యల కూర,

క్రిస్పీ గోల్డెన్‌ ఫ్రై ప్రాన్స్‌ రెసిపీలు మీ కోసం...

రొయ్యల బిర్యానీ

కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం- 2 కప్పులు, రొయ్యలు- అర కేజీ, ఉల్లిపాయలు- 4 (పొడవుగా ముక్కలు కట్‌ చేసుకోవాలి), వేయించిన ధనియాలు- 2 టేబుల్‌ స్పూన్లు, జీలకర్ర- 1 టీస్పూన్‌, మిరియాలు- ముప్పావు టీస్పూన్‌, ఇలాచి- 8, లవంగాలు- 8, దాల్చిన చెక్క- 2 (వేలంత పొడవు ఉండేంత), ఉప్పు- రుచికి తగినంత, పసుపు- కొద్దిగా, కారం- రెండు టేబుల్‌ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌- రెండు టేబుల్‌ స్పూన్లు, పుదీనా- రెండు టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర- రెండు టేబుల్‌ స్పూన్లు, నిమ్మరసం- ముప్పావు టీస్పూన్‌, పెరుగు- అరకప్పు, పచ్చిమిర్చి- 3, బిర్యానీ ఆకు- 1, సాజీరా- ముప్పావు టీస్పూన్‌, నెయ్యి- టేబుల్‌ స్పూన్‌,

తయారీ విధానం: బిర్యానీ చేయటానికి ముందు బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి నలభై నిముషాల పాటు మంచి నీళ్లలో నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలను డీప్‌ఫ్రై చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత చిన్న జార్‌లో ధనియాలు, నాలుగు ఇలాచి, జీలకర్ర, నాలుగు లవంగాలు, మిరియాలు, ఒక దాల్చిన చెక్క వేసి మిక్సీ పట్టాలి. ఈ మసాలా పౌడర్‌ను పక్కన ఉంచుకోవాలి.

పసుపు కొద్దిగా, తగినంత ఉప్పు, కారం పొడి వేసి రొయ్యలకు పట్టేట్లు కలపాలి. ఆ తర్వాత తయారు చేసుకున్న మసాలా పౌడర్‌, డీప్‌ ఫ్రై చేసిన సగం ఉల్లిపాయ ముక్కలను వేశాక.. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేయాలి. పచ్చిమిర్చి తర్వాత పుదీనా, కొత్తిమీర కొద్ది కొద్దిగా వేయాలి. ఆ తర్వాత నిమ్మరసం వేశాక.. పెరుగు వేయాలి. ఈ మిశ్రమాన్నంతా బాగా కలిపాక.. గంటపాటు మారినేట్‌ చేసుకోవాలి.

గిన్నెలో సగానికి నీళ్లు తీసుకుని కొద్దిగా వేడయ్యాక.. బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగాలు, సాజీరా వేసి.. తగినంత ఉప్పు, నెయ్యి వేసి మీడియం ఫ్లేమ్‌లో పది నిముషాల పాటు కుక్‌ చేయాలి. ఆ ఉడికే నీళ్లలో నానబెట్టుకున్న బాస్మతి బియ్యం మాత్రమే వేయాలి. మూత ఉంచి గరిటెతో 80 శాతం వరకూ బియ్యాన్ని ఉడికించుకోవాలి. ఈ లోపు మరో పెద్ద కడాయిలో కొద్దిగా నూనె వేసి మారినేట్‌ చేసుకున్న రొయ్యల మిశ్రమాన్ని వేయాలి. ఆ బౌల్‌లో కొద్దిగా నీళ్లు పోసి తిప్పిన తర్వాత ఆ నీళ్లను రొయ్యల మిశ్రమం మీద వేయాలి. పుదీనా, కొత్తిమీర చల్లుకున్న తర్వాత మిగిలిన డీప్‌ఫ్రై చేసిన ఉల్లిపాయలు వేయాలి. ఈ లోపు ఉడికిన బియ్యంలోని నీళ్లను వార్చిన తర్వాత ఆ బియ్యాన్ని.. రొయ్యల మిశ్రమం మీద వేయాలి. ఈ బియ్యం మీద కొద్దిగా నెయ్యి అన్ని వైపులా చల్లిన తర్వాత.. స్టవ్‌ ఆన్‌ చేయాలి. పెద్ద కడాయి మీద మూత ఉంచి.. మూత చివర గోధుమపిండితో క్లోజ్‌ చేయాలి. హైఫ్లేమ్‌లో పది నిముషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్‌మీద పెనం ఉంచి దాని మీద కడాయిని ఉంచాలి. దీని వల్ల రొయ్యలు మాడిపోవు. ఐదు నిముషాల పాటు ఉడికించుకోవాలి. స్టవ్‌ కట్టేశాక.. చివరగా పదిహేను నిముషాల పాటు మూత తీయకుండా అలానే ఉంచాలి. రొయ్యల బిర్యానీ రెడీ.


క్రిస్పీ గోల్డెన్‌ ఫ్రై ప్రాన్స్‌

కావాల్సిన పదార్థాలు

పొట్టు తీసేసిన పెద్ద రొయ్యలు- అరకేజీ, పెప్పర్‌ పొడి- అర టీస్పూన్‌,

ఉప్పు- రుచికి తగినంత, మైదా- కప్పు, కోడిగుడ్లు- రెండు, సన్నటి బ్రెడ్‌ ముక్కల పొడి- కప్పు,

తయారీ విధానం

బౌల్‌లో రొయ్యలు వేసి పెప్పర్‌ పొడి, ఉప్పు వేసి కలపాలి. నలభై నిముషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. చతురస్రాకారం బాక్సులో మైదా వేశాక కొద్దిగా పెప్పర్‌ పొడి, చిటికెడు ఉప్పు వేసి కలపాలి. మరో బాక్సులో రెండు కోడిగుడ్ల సొనను వేసి మ్యాష్‌ చేయాలి. మరో బాక్సులో బ్రెడ్‌ ముక్కలను వేసుకోవాలి. ఇపుడు మైదాలో రొయ్యలను వేసి బాగా కలపాలి. పిండి అంటుకుంటుంది.

ఈ రొయ్యలను ఒక్కోదాన్ని కోడిగుడ్ల సొనలో ముంచి చివరగా బ్రెడ్‌ ముక్కల్లో వేసి ముక్కలు అతుక్కునేట్లు రొయ్యలను కదపాలి.

ఈ రొయ్యలను అన్నింటిని ఒక ప్లేట్‌లో ఉంచుకోవాలి. చివరగా డీప్‌ ఫ్రైకి తగినంత నూనె తీసుకుని వేడయ్యాక ఈ రొయ్యలను గోల్డెన్‌ బ్రౌన్‌ రంగు వచ్చేంత వరకూ కాల్చుకోవాలి. క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయివి.


గోంగూర రొయ్యల కూర

కావాల్సిన పదార్థాలు: పొట్టు తీసిన రొయ్యలు- కేజీ, కారం- రెండు స్పూన్లు, ఉప్పు రుచికి తగినంత, పసుపు- టీస్పూన్‌, నూనె- రెండున్నర టేబుల్‌ స్పూన్స్‌, మీడియం సైజ్‌ ఉల్లిపాయలు- 3 (సన్నగా తరగాలి), పచ్చిమిర్చి- 5 (నిలువుగా కోయాలి), అల్లం, వెల్లుల్లి పేస్ట్‌- టేబుల్‌ స్పూన్‌, టమోటాలు-2 (సన్నగా తరగాలి), గోంగూర పేస్ట్‌- టేబుల్‌ స్పూన్‌,

తయారీ విధానం: మొదట రొయ్యలను శుభ్రం చేసి ఒక బౌల్‌లో తీసుకోవాలి. ఇందులో ఒక స్పూన్‌ కారం, కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు వేసి రొయ్యలకు పట్టేట్లు బాగా కలపాలి. ఆ తర్వాత ప్యాన్‌లో ఒక స్పూన్‌ నూనె తీసుకుని కాస్త వేడయ్యాక.. రొయ్యలు వేసి కలపాలి. ప్యాన్‌పై మూత ఉంచి.. మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. రొయ్యల్లోని నీరు బయటకు వస్తుంది. ఆ నీరు పోయేంత వరకు గరిటెతో కదుపుతూ ఉడికించుకోవాలి. ఆ తర్వాత వీటిని ప్లేట్‌లో వేసి పక్కన ఉంచుకోవాలి.

మరో ప్యాన్‌లో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి కాస్త వేడయ్యాక.. తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, కొద్దిగా పసుపు వేసి మీడియం ఫ్లేమ్‌లోనే కలపాలి. మూత ఉంచి.. నాలుగు నిముషాల పాటు కుక్‌ చేయాలి. ఉల్లిపాయల రంగు మారిన తర్వాత అల్లం వెల్లులి పేస్ట్‌ వేసి ఆ పచ్చివాసన పోయేంత వరకూ గరిటెతో కదపాక.. టమోటా ముక్కలతో పాటు గ్రైండ్‌ చేసిన గోంగూర పేస్ట్‌ వేసి కలపాలి. ప్యాన్‌పై మూత ఉంచి ఐదు నిముషాల పాటు కుక్‌ చేశాక.. గరిటెతో కదిపిన తర్వాత స్పూన్‌ కారం, తగినంత ఉప్పు, గరం మసాలా వేసి కలపాలి. గ్రేవీకి అవసరమైన నీళ్లు కొన్ని తీసుకుని గరిటెతో కలపాలి. ప్యాన్‌మీద మూత ఉంచి ఐదు నిముషాల పాటు ఉడికించుకోవాలి. కొద్దిగా నీళ్లు చూసుకుని వేసుకున్న తర్వాత.. గరిటెతో కదపాలి. చివరగా పక్కన ఉంచిన రొయ్యలను ఇందులో వేయాలి. గరిటెతో కదిపాక ఉప్పు, కారం సరిచూసుకున్న తర్వాత ప్యాన్‌పై మూత ఉంచి ఐదు నిముషాల పాటు కుక్‌ చేయాలి. చివరగా గరిటెతో రెండు నిముషాలు కదిపిన తర్వాత అన్నంలోకి వేడివేడిగా వడ్డించుకుని తినటమే తరువాయి.

Updated Date - Jun 29 , 2024 | 12:15 AM

Advertising
Advertising