Diya Mazumdar : మార్పు ఛాంపియన్
ABN, Publish Date - Aug 21 , 2024 | 04:45 AM
అడుగడుగునా ఆంక్షలతో, నిషేధాలతో... ఇంటికే పరిమితమైన మారుమూల గ్రామీణ బాలికలను క్రీడా మైదానాల్లోకి తీసుకురావడానికి పెద్ద పోరాటమే చేశారు దియా మజుందార్. ఆమె ప్రయత్నం ఆ పిల్లల జీవితాల్లోనే కాదు, పెద్దల ఆలోచనల్లోనూ మార్పునకు నాంది
అడుగడుగునా ఆంక్షలతో, నిషేధాలతో... ఇంటికే పరిమితమైన మారుమూల గ్రామీణ బాలికలను క్రీడా మైదానాల్లోకి తీసుకురావడానికి పెద్ద పోరాటమే చేశారు దియా మజుందార్. ఆమె ప్రయత్నం ఆ పిల్లల జీవితాల్లోనే కాదు, పెద్దల ఆలోచనల్లోనూ మార్పునకు నాంది పలికింది. దియా ప్రోత్సాహంతో ఇప్పుడు ఎందరో పిల్లలు వాలీబాల్‌లో రాణిస్తున్నారు, ఛాంపియన్లుగా నిలుస్తున్నారు.
‘‘మహిళలు ఎన్నో రంగాల్లో అత్యున్నత స్థాయికి చేరుకుంటున్నా, గొప్ప విజయాలు సాధిస్తున్నా... వారి పట్ల సమాజం కనబరిచే ధోరణుల్లో ఇప్పటికీ పెద్దగా మార్పు లేదు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో అమ్మాయిలు ఎన్నో ఆంక్షల మధ్య బతకాల్సి వస్తోంది. క్రీడల్లో ఆడపిల్లలకు కనీస ప్రోత్సాహమైనా ఉండదు. ఒక క్రీడాకారిణిగా, కోచ్‌గా ఒడిశాలోని ధెంకనల్ జిల్లాలోని గ్రామాల పరిస్థితి నన్ను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. నేను పుట్టింది, పెరిగింది పశ్చిమబెంగాల్‌లోని బంకురా సిటీలో. చిన్న వయసు నుంచి ఆటలంటే ఇష్టం. హైస్కూల్లో చదువుతున్నప్పుడు వాలీబాల్ మీద ఆసక్తి ఏర్పడింది. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నాను. కోచ్‌గా శిక్షణ పొంది... ‘వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ నుంచి సర్టిఫికెట్ పొందాను. కోచ్‌గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్న సమయంలో... ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్‌కు చెందిన అశుతోష్ పాత్రాతో నా వివాహం జరిగింది. నాలుగేళ్ళ క్రితం... 2020లో నా భర్తకు గిరిజన ప్రాంతమైన ధెంకనల్‌కు బదిలీ అయింది.
‘అది జరగని పని’ అన్నారు...
క్రీడాకారిణిగా... ఫిట్‌నె్‌సకు నేను ఎంతో ప్రాధాన్యత ఇస్తాను. మా ఇంటి ఆవరణలో రోజూ వ్యాయామంతోపాటు వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని. చుట్టుపక్కల ఉన్న పిల్లలు నన్ను విచిత్రంగా చూసేవారు. దానికి కారణం స్థానికంగా పాతుకుపోయిన కట్టుబాట్లే. అక్కడ ఆడపిల్లల జీవితాలు ఇంటి నాలుగు గోడలకే పరిమితం. బడికి వెళ్ళేవారి సంఖ్య కూడా తక్కువే. అమ్మాయిలు వీధుల్లోకి వచ్చి ఆటలు ఆడడం అనేది ఊహించలేని విషయం. మారుతున్న ప్రపంచానికి ఎంతో దూరంగా ఉన్న ఆ పిల్లల జీవితాల్లో క్రీడల ద్వారా మార్పు తేవాలని అనుకున్నాను. స్థానిక పాఠశాలలోని టీచర్‌తో నా ఆలోచనలు పంచుకున్నాను. ‘‘మీరేం మాట్లాడుతున్నారో అర్థం అవుతోందా? ఈ పల్లెటూరి అమ్మాయిలను వాలీబాల్ కోర్టుకు తీసుకురావడమా? అది జరగని పని. ఇక్కడ ప్రజలు కట్టుబాట్ల కోసం ప్రాణాలైనా ఇస్తారు. ఒక వయసు వచ్చాక ఆడపిల్లలను స్కూలుకు పంపడానికే ఇష్టపడరు’’ అన్నారావిడ. ‘‘ఆ పిల్లల తల్లితండ్రులను ఎలాగైనా ఒప్పిస్తాను. అయితే నాకు ఒడియా అంతగా రాదు. అందుకు మీ సాయం కావాలి’’ అని అడిగాను. ఆ టీచర్ కాస్త అయిష్టంగానే ‘సరే’నన్నారు.
ఎంతో శ్రమపడ్డా...
ముందుగా ఆ స్కూల్‌లో చదివే అమ్మాయిలతో మాట్లాడాను. చాలామంది ‘‘క్రీడలంటే మాకు ఇష్టమే. కానీ మా ఇంట్లో ఒప్పుకోరు’’ అని చెప్పారు. దాంతో ఆ పిల్లల ఇళ్ళకు నేను, ఆ టీచర్ వెళ్ళాం. తల్లితండ్రులతో మాట్లాడాం. దాదాపు అందరూ ఎగతాళి చేశారు. ‘‘మీరు ఎక్కడి నుంచో వచ్చారు. ఇక్కడి పరిస్థితులు మీకు తెలియవు. మీ పని మీరు చూసుకుంటే మంచిది’’ అన్నారు. ఇతర పాఠశాలల అమ్మాయిల కుటుంబాలను కూడా కలుసుకున్నాను. ప్రతిచోటా స్పందన ఒకేలా ఉంది. అయినా నేను పట్టువదలలేదు. రెండు నెలల పాటు అదే పనిగా ప్రయత్నించాను. చదువుతోపాటు క్రీడల ప్రాధాన్యత గురించి, శారీరకంగా, మానసికంగా బాలికల ఎదుగుదలలో వాటి పాత్ర గురించి ఓపికగా వివరించాను. పిల్లలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూస్తానని భరోసా ఇచ్చాను. చివరకు కొందరు తల్లితండ్రులు అంగీకరించారు. అలా... మూడేళ్ళ కిందట అయిదారుగురికి శిక్షణ ప్రారంభించాను. రోజూ వారి తల్లితండ్రులు కూడా మైదానానికి వచ్చేవారు. క్రమంగా వారికి నా మీద నమ్మకం కుదిరింది. శిక్షణకు వచ్చే పిల్లల సంఖ్య కూడా పెరిగింది. కానీ హాఫ్ ఫ్యాంట్ వేసుకోవడానికి సిగ్గుపడేవారు. సల్వార్ కమీజ్ వేసుకొనేవారు. ప్రాక్టీస్ సమయంలో ఇబ్బందిపడేవారు. క్రీడలకు అనుకూలంగా ఉండేలా దుస్తులు వేసుకోవాలని పిల్లలను, వారి కుటుంబ సభ్యులను ఒప్పించడానికి ఎంతో శ్రమపడ్డాను.
బలమైన ఆ జట్టును ఓడించి...
నా దగ్గర శిక్షణ తీసుకున్న తొలి బృందం పాఠశాల స్థాయి పోటీల్లో గెలవడం, వారి గురించి పత్రికల్లో రావడంతో... తమ పిల్లలను కూడా వాలీబాల్ శిక్షణకు పంపించాలన్న ఆలోచన ఇతరులలోనూ కలిగింది. క్రమంగా పిల్లల సంఖ్య పెరిగింది. ఇప్పటివరకూ ధెంకనల్ జిల్లాలోని పలు గ్రామాల్లో 130 మందికి పైగా బాలికలు నా దగ్గర శిక్షణ పొందారు. అందరికీ ఉచితంగానే శిక్షణ ఇస్తున్నాను. ఒకప్పుడు వాలీబాల్ అంటే తెలియని ఆ జిల్లా... 14 ఏళ్ళలోపు బాలికల విభాగంలో రాష్ట్రంలోనే ఛాంపియన్‌గా నిలిచింది. అది కూడా అత్యంత బలమైన కేంద్రపడ జిల్లా జట్టును 2-0 తేడాతో ఓడించింది. నా దగ్గర శిక్షణ పొందిన వారిలో 45 మంది రాష్ట్ర స్థాయి మ్యాచుల్లో రాణించారు. ఏడుగురు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ముఖ్యంగా ఆ పిల్లలందరిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రపంచాన్ని చూసే దృక్పథం మారింది. బిడియంగా ఉండే ఆ అమ్మాయిలు ఇప్పుడు వాలీబాల్ కోర్టులో కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తున్నారు. తమ తల్లితండ్రులకు గర్వకారణంగా నిలుస్తున్నారు. కుమార్తెలను ఇంటి పనులకే పరిమితం చేస్తున్న ఎన్నో కుటుంబాలకు ఈ పిల్లల విజయాలు ఆదర్శంగా నిలుస్తాయని ఆశిస్తున్నాను. వాలీబాల్‌లో ఆడపిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలన్నది నా కల. అది నెరవేరడానికి నా భర్త అశుతోష్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు.’’
Updated Date - Aug 21 , 2024 | 04:45 AM