శ్రద్ధ, విశ్వాసం ప్రధానం
ABN, Publish Date - Sep 13 , 2024 | 05:22 AM
తల్లితండ్రులను భగవంతుడికన్నా మిన్నగా భావించాలని, కన్నవారిని ఆదరించనివాణ్ణి భగవంతుడు కూడా క్షమించడని హిందూ సనాతన ధర్మం చెబుతోంది.
తల్లితండ్రులను భగవంతుడికన్నా మిన్నగా భావించాలని, కన్నవారిని ఆదరించనివాణ్ణి భగవంతుడు కూడా క్షమించడని హిందూ సనాతన ధర్మం చెబుతోంది. పార్వతీ పరమేశ్వరులకు మూడుసార్లు ప్రదక్షిణ చేసినందుకు వినాయకుడికి దక్కిన ఫలమే గణాధిపత్యం. అందుకే తల్లితండ్రులకు, పూర్వులకు ఉత్తమగతులు కలిగేలా చేయడం ఒక బాధ్యతగా పూర్వులు నిర్దేశించారు. మనిషి తన జీవితంలో తీర్చుకోవలసినవి పంచ ఋణాలు. వాటినే ‘పంచ యజ్ఞాలు’ అని కూడా అంటారు. అవి దేవ, పితృ, ఋషి, భూత, మనుష్య ఋణాలు. వాటిలో ప్రధానమైనది పితృరుణం. ఆ ఋణం నుంచి విముక్తి పొందడానికి చేసే కర్మల్లో శ్రాద్ధకర్మ ఒకటి. ‘శ్రార్థకర్మ’ అంటే ‘శ్రద్ధతో చేసే కర్మ’ అని అర్థం. గతించిన తల్లితండ్రులకు శ్రద్ధాభక్తులతో చేసే క్రతువు అది. ఇక్కడ ఆచార వ్యవహారాలకన్నా శ్రద్ధ, విశ్వాసం ముఖ్యం. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క దేవతకు ప్రాధాన్యాన్ని ఇచ్చే సంప్రదాయం... భాద్రపద మాసంలోని బహుళ పక్షాన్ని పితృ పక్షంగా నిర్దేశించింది. ఈ ప్రకారం... భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమాస్యవరకూ... పదిహేను రోజుల కాలాన్ని ‘పితృపక్షం’గా లేదా ‘మహాలయ పక్షం’గా పరిగణిస్తారు. ఈ రోజుల్లో శ్రార్థ కర్మలు నిర్వర్తించి... దాన, తర్పణ, సంతర్పణాది క్రియలు నిర్వహిస్తే... పితృదేవతలు సంతృప్తి చెంది... తమ వారసుల్ని అనుగ్రహిస్తారని శాస్త్రవచనం. దీన్ని మన పూర్వులు మరణించిన తిథినాడు లేదా పక్షంలో ఏదో ఒక రోజున... అదీ వీలు కాకపోతే అమావాస్య రోజున శ్రాద్ధకర్మలు ఆచరించాలి. అదీ కుదరకపోతే... శ్రద్ధాభక్తులతో తర్పణాలైనా వదలాలి. భాద్రపద మాసంలోని మహాలయ పక్షంతో కలిపి... పితృదేవతలను అర్చించే రోజులు ఏడాదిలో 96 ఉన్నాయి. వాటిలో పన్నెండు అమావాస్యలు ముఖ్యమైనవి. పలు ప్రాంతాల్లో అమావాస్య రోజున తర్పణాదులు నిర్వర్తించే సంప్రదాయం ఉంది.
మనకు మూడు శరీరాలు ఉంటాయని ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. మొదటిది భౌతికంగా కనిపించే శరీరం. రెండోది ప్రేత శరీరం. మూడవది ఆత్మ... సూక్ష్మ శరీరం. వసు, రుద్ర, ఆదిత్య రూపాలు ఈ మూడింటికీ ప్రతీకలు. మన సంకల్పంలో పితరులను స్మరించుకుంటూ... వసు, రుద్ర, ఆదిత్య రూపాలకు ముమ్మారు తర్పణాలు వదిలి, ఆ తరువాత అన్న సంతర్పణ చేస్తే... శ్రాద్ధ కర్మ పరిపూర్ణం అవుతుందనేది శాస్త్రవచనం. మహాలయ పక్షానికి సంబంధించిన కథ ఒకటి ఉంది. కర్ణుడు దానశీలిగా ప్రసిద్ధి పొందాడు. మహాభారత యుద్ధంలో మరణించిన అతను స్వర్గలోకానికి వెళ్తూ ఉండగా... ఆకలి, దప్పిక కలిగాయి. తినడానికి పండు ముట్టుకున్నా, తాగడానికి దోసిటిలో నీరు తీసినా... అవి బంగారంగా మారిపోతున్నాయి. ఇదేమిటని అతను ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆకాశవాణి ‘‘కర్ణా! నీవు మహాదాతవు. కవచ కుండలాలతో సహా అన్నీ దానం చేసి... చేతికి ఎముకలేదనే పేరు సంపాదించావు. కానీ నీ చేత్తో ఎవరికీ పట్టెడు అన్నం పెట్టన దృష్టాంతం లేదు. కాబట్టే ఈ దుస్థితి కలిగింది’’ అని చెప్పింది. అప్పుడు తన తండ్రి అయిన సూర్యుణ్ణి కర్ణుడు ప్రార్థించి... ఆయన అనుగ్రహంతో భూలోకానికి వచ్చాడు. పదిహేను రోజుల పాటు... తన రాజ్యంలోని అందరికీ షడ్రసోపేతమైన విందు చేసి, పితరులకు తర్పణాదులు విడిచాడు. తిరిగి స్వర్గలోకం చేరుకున్నాడు. ఆ పక్షమే ‘మహాలయం’ అనే పేరిట ప్రసిద్ధి చెందింది. ‘‘శ్రేష్టులైనవారు, విజ్ఞులు ఏది ఆచరించి మార్గనిర్దేశం చేస్తారో... దాన్ని సామాన్యులు ఆచరించి తరించవచ్చు’’ అని ‘భగవద్గీత’ చెప్పింది. పితృపక్షం కూడా అటువంటిదే. ఇది తమ వారసత్వాన్ని గుర్తుచేసుకొని, పూర్వులకు నివాళులు అర్పించే పుణ్యక్రతువు. పుణ్యఫలం కోసం ఇది ఆవశ్యకమైన కర్తవ్యం అన్నది పెద్దల మాట.
ఎ. సీతారామారావు’
Updated Date - Sep 13 , 2024 | 05:22 AM