SIM card : బయోమెట్రిక్ ఉంటేనే కొత్త సిమ్‌కార్డ్
ABN, Publish Date - May 23 , 2024 | 05:57 AM
టెలికాం రంగంలో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023లో తీసుకొచ్చిన నిబంధనలను డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) త్వరలో అమలు చేయనుంది.
సెప్టెంబరు నుంచి కొత్త టెలికాం నిబంధనలు
న్యూఢిల్లీ, మే 22: టెలికాం రంగంలో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023లో తీసుకొచ్చిన నిబంధనలను డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) త్వరలో అమలు చేయనుంది. ఈ విషయంపై డాట్‌కు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) గతంలో సిఫార్సు చేసింది. ఈ మార్పులు లోక్‌సభ ఎన్నికల తర్వాత అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. నకిలీ సిమ్ కార్డ్‌లతో సైబర్ మోసాలు విజృంభిస్తున్న తరుణంలో వీటిని నిరోధించడానికి కొత్త మార్గదర్శకాలు ఉపయోగపడనున్నాయి. దీని ప్రకారం... కొత్త కనెక్షన్‌ను అందించాలంటే బయోమెట్రిక్ గుర్తింపు తప్పనిసరి. అటువంటి సున్నితమైన సమాచారాన్ని సేకరించడంలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా టెలికాం కంపెనీలకు స్పష్టమైన మార్గదర్శకాలు డాట్ జారీ చేయనుంది. వీటితో పాటు స్పెక్ట్రమ్ కేటాయింపులు, శాటిలైట్ కమ్యూనికేషన్‌కు సంబంధించిన నిబంధనలు తీసుకురానున్నారు. దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించాలంటే.. సదరు కంపెనీలు ప్రభుత్వం నుంచి స్పెక్ట్రమ్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. టెలికమ్యూనికేషన్స్ చట్టంలోని వివిధ సెక్షన్‌లలో పేర్కొన్న నిబంధనలను సెప్టెంబరు 15 నాటికి అమల్లోకి తీసుకురావాలని డాట్ లక్ష్యంగా పెట్టుకుంది. టెలికాం రంగంలో నిమయ, నిబంధనలకు సంబంధించి చాలా ఏళ్లుగా కొనసాగుతున్న ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, ఇండియన్ వైర్‌లెస్ టెలిగ్రాఫ్ చట్టం, టెలిగ్రాఫ్ వైర్స్ చట్టం స్థానంలో కేంద్రప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. భారత పార్లమెంటు 2023 డిసెంబర్ 20న టెలికమ్యూనికేషన్స్ బిల్లు- 2023 (టెలికాం యాక్ట్- 2023)ని ఆమోదించింది.
Updated Date - May 23 , 2024 | 05:57 AM