సామాజిక న్యాయానికి సమాధి కడుతున్నదెవరు?
ABN, Publish Date - Apr 10 , 2024 | 02:33 AM
రాజ్యాధికారంలో వాటా అయినా సంక్షేమంలో భాగస్వామ్యమైనా ఆఖరున, అట్టడుగున ఉన్నవారికి అందినప్పుడే ప్రజాస్వామ్యానికి సార్ధకత అంటారు బాబా సాహెబ్ డా. బి.ఆర్ అంబేడ్కర్. ఇవాళ తెలంగాణ రాష్ర్టంలో...
రాజ్యాధికారంలో వాటా అయినా సంక్షేమంలో భాగస్వామ్యమైనా ఆఖరున, అట్టడుగున ఉన్నవారికి అందినప్పుడే ప్రజాస్వామ్యానికి సార్ధకత అంటారు బాబా సాహెబ్ డా. బి.ఆర్ అంబేడ్కర్. ఇవాళ తెలంగాణ రాష్ర్టంలో మాత్రం అది దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులూ మారుతున్నారు. అట్టడుగున ఉన్న దళితుల్లో మరింత అట్టడుగున ఉన్న మాదిగలకు మాత్రం కనీస ప్రాతినిధ్యం లేకుండా పోతున్నది. తాజాగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఈ రకమైన అన్యాయం మాదిగలకు జరుగుతోంది. తెలంగాణలో కొత్తగా అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ సైతం మాదిగలకు వారి జనాభాకు అనుగుణంగా సీట్లు కేటాయించకపోవడం ఆశ్చర్యకరం. తెలంగాణలో అతిపెద్ద సామాజిక సమూహమైన మాదిగలను విస్మరించడం చారిత్రక ద్రోహమే అవుతుంది.
తెలంగాణ రాష్ర్ట సాధన అనంతరం కేసీఆర్ నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన గులాబీ సర్కార్ హయాంలో మాదిగలకు అన్ని రంగాల్లో అన్యాయమే జరిగింది. మూడు దశాబ్దాలుగా మాదిగల వర్గీకరణ సమస్యను ఈ పాలకులు ఏ మాత్రం పట్టించుకోలేదనేది జగద్వితం. పైగా దానిని వీలైనంత దాటివేసేందుకు అది మా చేతిలో లేదు, కేంద్రం చేతుల్లో ఉందని కేసీఆర్ ముఖం చాటేశారు. మరి వీరి చేతిలో ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ సీట్లల్లోనే కాదు ఆఖరికి నామినేటెడ్ పోస్టుల్లో సైతం మాదిగలకు అన్యాయమే చేశారు. తెలంగాణ వచ్చిన తరువాత యూనివర్సిటీలకు వీసీల నియామకం చేపట్టి పదిమంది వీసీలను నియమించారు. ఇందులో ఆరుగురు వీసీలకు ఓసీ సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్లకే అవకాశం కల్పించారు. మిగిలిన నాలుగింటిలో రెండు బీసీలకు, ఒకటి ఎస్టీకి, ఒకటి ఎస్సీకి కేటాయించారు. ఆ ఒక్కటి కూడా మాల సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్‌కు అవకాశం కల్పించారు. అలాగే టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా ఇట్లా చెప్పుకుంటూపోతే మాదిగల కంటే మాలలకే కేసీఆర్ సర్కార్ పెద్దపీట వేసింది. మాదిగల నుండి తాటికొండ రాజయ్యకు డిప్యూటీ సీఎం ఇచ్చినట్టే ఇచ్చి దానిని మూన్నాళ్ల ముచ్చట చేసింది. ఇక మంత్రివర్గంలో కూడా కొప్పుల ఈశ్వర్ వంటి మాల సామాజికవర్గ వ్యక్తులనే ప్రోత్సహించి మంత్రి పదవులు కట్టబెట్టింది. అంతేకాదు ఆఖరికి ‘దళిత బంధు’ పథకంలో కూడా మాదిగలకు అన్యాయమే జరిగింది. అందుకు కారణం ప్రభుత్వానికి దగ్గరగా ఉండే మాల మేధావులు, రాజకీయవేత్తలు చక్రం తిప్పడమే.
నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మొదలుకొని నిన్నటి తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమం దాకా మాదిగల భాగస్వామ్యం లేని ఉద్యమం లేదంటే అతిశయోక్తి కాదు. మరోవైపు చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడిన మాలలు సహజంగానే అధికారం రుచి చూడగలిగారు. గల్లీ నుండి ఢిల్లీ దాకా లాబీయింగ్‌లు చేయగలుగుతున్నారు. మాదిగల వెనుకబాటుతనం, అనైక్యత, అమాయకత్వం మాలలకు వరంగా మారింది. దీంతో చూస్తుండగానే అన్ని పార్టీల్లో మాలల నాయకత్వం ఎదిగి వచ్చింది. వ్యాపార వాణిజ్య రంగాల్లో సైతం మాల బిజినెస్‌మెన్‌లు ఎదిగి వచ్చి, సొంత కులాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లగలుగుతున్నారు. దళితుల్లోని రెండు ప్రధాన కులాల మధ్య ఉన్న ఈ ఆర్థిక అంతరాలు, అభివృద్ధి నేపథ్యాల వైరుధ్యం మన పాలకులకు తెలియంది కాదు. అయినా సరే అభివృద్ధి చెందిన మాలలకే పెద్దపీటను వేయడం నాటి బీఆర్‌ఎస్ నుంచి నేటి కాంగ్రెస్ దాకా నిరంతరం కొనసాగుతూనే ఉంది. జనాభా పరంగా చూసుకుంటే 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో అధికారికంగా నమోదైన మాదిగల జనాభా 32 లక్షల 33వేల 642, అలాగే మాలల జనాభా 15లక్షల 27వేల 143. మరి 2021 జనాభా లెక్కల వివరాలు వెల్లడిస్తే మాదిగల జనాభా మరో పది పదిహేను లక్షలు పెరిగితే సుమారు అరకోటికి చేరువలో ఉంటుంది. అరకోటి జనాభా కలిగిన సామాజిక సమూహమైన మాదిగలకు అన్యాయం చేయడం ఏ పాలకులకైనా తగదు.
మాదిగలను ఎంత విస్మరణకు గురిచేస్తున్నారంటే బాబూ జగ్జీవన్‌రామ్ దగ్గరి నుంచి తొలిదశ తెలంగాణ ఉద్యమంలో రాష్ర్ట సాధన కోసం తన మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన సదాలక్ష్మీ నుండి డా. కొల్లూరి చిరంజీవి దాకా అందరికీ అన్యాయమే చేస్తున్నారు. కేసీఆర్ చేసిన పొరపాట్లను మేం చేయబోం అన్నట్టు సంస్కరణను మొదలుపెట్టిన రేవంత్ సర్కార్ కూడా ఈసారి మాదిగలకు తీరని అన్యాయం చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగల అడ్రస్‌ను గల్లంతు చేసింది.
తెలంగాణలో ఉన్న ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాలైన పెద్దపల్లి, వరంగల్, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల్లో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా కాంగ్రెస్ మాదిగలకు కేటాయించకపోవడం వెనక కుట్ర ఎవరిది? ఏ సామాజిక సమీకరణాలు పని చేశాయి? అసలు తెలంగాణలో మాలలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్న నియోజకవర్గాల్లో సింహభాగం జనాభా మాదిగలదే. అంటే ఓట్లు మాదిగలవి, సీట్లు మాత్రం మాలలవి. తెలంగాణలో చాలా గ్రామాల్లో మాలల ఇండ్లు ఒక్కటి అర కూడా లేనివి వందల ఊర్లు ఉన్నాయి. మరి రాజకీయ పార్టీలు మాత్రం మాదిగలకు అన్యాయం చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నాయి. దీనికి తోడు మాదిగల్లో నాయకులు ఎక్కువగా ఉండడం, ఐక్యత లేకపోవడం, అగ్రవర్ణ నేతల చేతుల్లో పావులుగా మారడం కూడా మరో బలహీనతగా కనిపిస్తున్నది. దీంతో మాదిగలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో సైతం మాలలు ఆయా పార్టీ అధిష్ఠానాలను ఒప్పించి, మెప్పించి సీట్లు తెచ్చుకోగలుగుతున్నారు. ఈ పరిణామం ఇలాగే కొనసాగితే మాదిగల నుంచి మరిన్ని ఉద్యమాలు పుట్టుకురావడం తథ్యం.
ఒకానొక సందర్భంలో కొప్పుల రాజు ఐఏఎస్‌ను తెలంగాణలో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయమని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశిస్తే, అది మాదిగల నియోజకవర్గం, అక్కడ నేను పోటీ చేయడం సరికాదని స్వచ్ఛందంగా తప్పుకున్న స్ఫూర్తి ఇవాళ కొరవడుతోంది. డబ్బు, పలుకుబడి ఉన్న మాలలు ఒక్కింట్లోనే రెండు, మూడు టిక్కెట్లు తెచ్చుకొని మాదిగలను రాజ్యాధికారానికి శాశ్వతంగా దూరం చేస్తున్నారు. మాలలు రాజకీయంగా ఎదగకూడదని ఏ మాదిగా కోరుకోడు. కాకుంటే మాదిగలకు న్యాయంగా దక్కాల్సిన నోటికాడి బుక్కను విద్యా, ఉద్యోగాల్లో కొల్లగొట్టినట్టు, మాలలు రాజకీయాల్లో కూడా కొల్లగొట్టడం సామాజిక న్యాయం అనిపించుకోదు. ఇది అన్నదమ్ముల మధ్య మరింత అగాధాన్ని పెంచుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకోవాల్సిన బాధ్యత పాలకులది. కీలకమైన ఈ విషయాన్ని విస్మరిస్తే మాదిగలకు అన్యాయం చేస్తున్న ఏ పార్టీకైనా ఈ దగాపడిన బిడ్డలు ఎందుకు ఓటేస్తారు?
డా. పసునూరి రవీందర్
రాష్ర్ట ఉపాధ్యక్షులు, తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం
Updated Date - Apr 10 , 2024 | 02:33 AM