విప్లవోద్యమ ధ్రువతార.. పైలా
ABN, Publish Date - Apr 11 , 2024 | 03:53 AM
వీర శ్రీకాకుళ విప్లవోద్యమానికి ఆయన ఒక చిరునామా. కమ్యూనిస్టు విలువలకూ, త్యాగానికీ, ఆదర్శాలకూ, నిబద్ధతకూ నిలువెత్తు నిదర్శనం. ఆయన విప్లవ రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం...
వీర శ్రీకాకుళ విప్లవోద్యమానికి ఆయన ఒక చిరునామా. కమ్యూనిస్టు విలువలకూ, త్యాగానికీ, ఆదర్శాలకూ, నిబద్ధతకూ నిలువెత్తు నిదర్శనం. ఆయన విప్లవ రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. ఆయనే మచ్చలేని మహానాయకుడు పైలా వాసుదేవరావు. విప్లవోద్యమమే ఊపిరిగా శ్వాసించి, జీవితమంతా పీడిత ప్రజల విముక్తి కోసమే పరితపించి జనం మదిలో విప్లవోద్యమ ధ్రువతారగా నిలిచి వెలిగారు. 78 ఏళ్ళ జీవన గమనంలో జనమే తప్ప వ్యక్తిగతం లేని అలుపెరుగని అజ్ఞాత విప్లవ సూరీడాయన. శ్రీకాకుళ విప్లవోద్యమం ప్రభుత్వ క్రూర నిర్బంధానికీ, ఎన్‌కౌంటర్ హత్యలకు, అణచివేతకు గురైనా, గుండె నిబ్బరంతో అమరుల నెత్తుటి జెండాను సమున్నతంగా నిలబెట్టిన ధీశాలి.
మేష్టారుగా, ప్రసాదన్నగా ప్రజలు ప్రేమగా పిలుచుకునే వాసుదేవరావు 1932 ఆగస్టు 11న శ్రీకాకుళం జిల్లా, వజ్రపు కొత్తూరు మండలం, రిట్టపాడులో జన్మించారు. విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు రాజకీయాలవైపు ఆకర్షితులయ్యారు. 1953లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నప్పటి నుంచి తుదిశ్వాస వీడే వరకు ఐదున్నర దశాబ్దాలకు పైబడిన విప్లవోద్యమ జీవితంలో సొంత ఆస్తి లేని వ్యక్తి పైలా. పైగా తనకు వారసత్వంగా వచ్చిన కాస్త భూమిని, సొంత ఇంటిని అమ్మి నాటి శ్రీకాకుళం పోరాట ఉద్యమ కేంద్రం ఉద్దానంలోని పలాసలో అమరవీరుల స్మారకంగా పార్టీ కార్యాలయాన్ని నిర్మించిన నిస్వార్థ కమ్యూనిస్టు.
పైలా జీవితం వడ్డించిన విస్తరి కాదు. శ్రీకాకుళ పోరాట ఉద్యమ నాయకుడిగా, దళ జీవితం గడుపుతున్నప్పుడు 1970లో దళ సభ్యురాలు చంద్రమ్మను వివాహం చేసుకున్నారు. ఉద్యమ క్రమంలోనే తమకు పుట్టిన బిడ్డను సైతం తమ విప్లవ సహచరుడు అత్తలూరి మల్లికార్జునరావు కుటుంబానికి ఇచ్చేసి రక్తసంబంధం కంటే వర్గసంబంధం గొప్పదని చాటిచెప్పారు వాసుదేవరావు, చంద్రక్క. ఎమర్జెన్సీ టైమ్‌లో అరెస్టయ్యి 12 ఏళ్లు జైలు జీవితాన్ని అనుభవించినా వారిది విడివడని విప్లవోద్యమ ప్రేమ బంధం.
1968 నవంబరు 25న శ్రీకాకుళ సాయుధ పోరాటం ప్రారంభించడంలో పైలా వాసుదేవరావుది విశిష్టమైన పాత్ర. రివిజనిజం నుంచి తెగతెంపులు చేసుకొని ఏర్పడిన రాష్ట్ర సమన్వయ కమిటీలో భాగంగా చారు మజుందార్ నాయకత్వంలో ఏర్పడిన అఖిల భారత విప్లవ కారుల సమన్వయ కమిటీలో భాగమయ్యారు. పంచాది కృష్ణమూర్తి, సుబ్బారావు పాణిగ్రహి తదితరులతో కలిసి తెగింపు దళాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. శ్రీకాకుళ గిరిజనోద్యమ నిర్మాతలు వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసంలను 1970 జూలై 10న పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపడంతో శ్రీకాకుళ ఉద్యమ చరిత్ర ముగిసిందని నాటి ప్రభుత్వం భ్రమించింది. కానీ పైలా వాసుదేవరావు అత్యంత కీలక సమయంలో ఆనాటికి మిగిలివున్న మరి కొందరు నాయకులను కూడగట్టి ప్రజా విశ్వాసం సన్నగిల్లకుండా ఉద్యమ పునర్నిర్మాణానికి ఊపిరిలూదిన తీరు విప్లవోద్యమ చరిత్రలో మరువలేని అధ్యాయం. కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తి, రవూఫ్‌లను కలిసి చర్చించి.. వీరితో ఏర్పడిన రాష్ట్ర కమిటీకి పైలా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత చారు మజుందార్ పంథాతో విభేదించారు. సిపిఐ(ఎంఎల్) కేంద్ర కమిటీని పునరుద్ధరించి విప్లవకారుల ఐక్యతకు కృషి చేస్తున్న సత్యనారాయణ్ సింగ్‌తో సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఆ పార్టీలో విలీనమయ్యారు. 1975లో ఆనాటి కేంద్ర కమిటీలో వాసుదేవరావు సభ్యుడయ్యారు. తదనంతర పరిణామాలలో చండ్ర పుల్లారెడ్డి నాయకత్వాన గల ఏపీఆర్‌సీపీతో కలిసి చర్చించి రెండు పార్టీలను ఏకం చేయడంలో పైలా కీలక భూమిక పోషించారు. పోట్ల రామనర్సయ్య రాష్ట్ర కార్యదర్శిగా ఏర్పడిన నూతన ఆంధ్రా కమిటీలో వాసుదేవరావు సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు.
1976 ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో ఎన్‌కౌంటర్‌లో పోట్ల రామనర్సయ్య నేలకొరిగిన తరువాత, వాసుదేవరావు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికై, నాటి నుంచి 1989 వరకు ఆ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించారు. 1984లో పార్టీ చీలికకు గురైన అనతికాలంలోనే ఆ చీలిక వల్ల ప్రతిఘటనోద్యమ రాజకీయాలు బలహీనపడి మితవాద రాజకీయాలు ఆధిపత్యంలోకి వచ్చాయని గుర్తించారు. పార్టీలో మితవాద రాజకీయాలకు వ్యతిరేకంగా అంతర్గత పోరాటం కొనసాగిస్తూనే, ఉక్కు క్రమశిక్షణతో పార్టీని ముందుకు నడిపించిన ఘనత పైలాది.
తాను నమ్మిన విప్లవ రాజకీయాల పట్ల దృఢమైన విశ్వాసం, చిత్తశుద్ధి, ఆచరణ కలిగిన వ్యక్తి పైలా. భారతదేశంలో విప్లవం విజయవంతం కావాలంటే, సారూప్యత కలిగిన విప్లవ సంస్థలు, పార్టీలన్నీ ఐక్యం కావాలని బలంగా ఆకాంక్షించారు. చివరి ఘడియల్లో తనను చూసేందుకు వచ్చిన కార్యకర్తలకు, పార్టీ నాయకులకు విప్లవోద్యమంలో ఎదురౌతోన్న అనేక ఒడిదుడుకులను దీటుగా ఎదుర్కొంటూ విప్లవోద్యమంలోనే ముందుకు సాగాలి తప్ప కాడి దించకూడదని, కేన్సర్ కారణంగా వచ్చిన నిస్సత్తువను అధిగమించి, శక్తిని కూడగట్టుకొని, పిడికిలి బిగించి లాల్‌సలామ్ అంటూ చిరునవ్వుతో వారికి వీడ్కోలు పలికేవారు.
పైలా వాసుదేవరావు 2010 ఏప్రిల్ 11న కేన్సర్ వ్యాధితో మరణించారు. మరణం అంచుల్లో ఉన్నా, ఉద్యమ భవిష్యత్ గురించి నిరంతరం పరితపించారు. దేశంలో ముందుకొచ్చిన అనేక అస్తిత్వ, ప్రజాస్వామిక ఉద్యమాలకు బాసటగా నిలిచిన వ్యక్తి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని సానుకూలంగా అర్థం చేసుకోవడమే కాకుండా దానికి వెన్నుదన్నుగా నిలిచారు. విప్లవ పార్టీల్లో ప్రబలుతోన్న అనేక అన్యవర్గ ధోరణుల నేపథ్యంలో పైలా జీవితాన్ని, ఉద్యమ ప్రస్థానాన్ని అర్థం చేసుకొని, వారి నిస్వార్థ, నిబద్ధ జీవితమే ఆదర్శంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాల్సిన కీలక సమయమిది. అందులో భాగంగానే ఏప్రిల్ 14న శ్రీకాకుళం జిల్లా మామిడిపల్లిలో పైలా వర్ధంతి సభ నిర్వహిస్తున్నాం.
చిట్టిపాటి వెంకటేశ్వర్లు
రాష్ట్ర కార్యదర్శి సీపీఐ(ఎం.ఎల్) న్యూడెమొక్రసీ
Updated Date - Apr 11 , 2024 | 03:53 AM